close

ప్రజల ముందుకు ప్రియాంక! 

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా తొలిసారి ర్యాలీ 
నాలుగున్నర గంటల పాటు రోడ్‌ షో 
తోవ పొడుగునా పూలవర్షం.. 
తోడుగా వచ్చిన అన్నయ్య రాహుల్‌

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడిన ప్రియాంకా గాంధీ... తొలిసారి ప్రజల ముందుకొచ్చారు. సోమవారం లఖ్‌నవూ విమానాశ్రయం నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వరకూ 25 కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహించారు. అన్న, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌, యువనేత జ్యోతిరాదిత్య సింధియాలు వెంట వచ్చారు. ఆమెను చూసేందుకు, కరచాలనం చేసేందుకు వేల మంది ఉత్సాహం చూపించారు. పూల వర్షం కురిపించారు. 
లఖ్‌నవూ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్‌ పశ్చిమ ప్రాంత బాధ్యురాలు ప్రియాంకాగాంధీ వాద్రా సోమవారం లఖ్‌నవూ వీధుల్లో మెరిశారు! రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ... విమానాశ్రయం నుంచి పార్టీ ప్రధాన కార్యాలయం వరకూ నాలుగున్నర గంటల పాటు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, ప్రజలను ఉద్దేశించి ఆమె ఎక్కడా మాట్లాడలేదు.  ఆమె ఇందిరలా ఉన్నారంటూ ప్రజలు మాట్లాడుకోవడం వినిపించింది. 

సర్కారు ఏర్పాటే లక్ష్యం... 
పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీని ఉద్దేశించి రాహుల్‌గాంధీ మాట్లాడారు. కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్‌లోనూ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘‘యూపీలో కాంగ్రెస్‌ సైద్ధాంతిక ప్రభుత్వం ఏర్పడి... రైతులకు, యువతకు, పేదలకు న్యాయం జరిగేవరకూ మేం విశ్రమించం. ప్రియాంక, సింధియాల లక్ష్యం లోక్‌సభ ఎన్నికలే కాదు. యూపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతా వాళ్లపై ఉంది. ఇక్కడ మహాకూటమి కూడా పోటీలో ఉంది. మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌లు అంటే నాకు గౌరవం. కానీ.. రాష్ట్రంలో మంచి మార్పును తీసుకొచ్చేందుకు తన శక్తివంచన లేకుండా కాంగ్రెస్‌ పోరాడుతుంది.’’ అని స్పష్టం చేశారు. 
ర్యాలీ అనంతరం ప్రియాంక.. రాహుల్‌ను వెంట బెట్టుకుని భర్త రాబర్ట్‌ వాద్రాను కలిసేందుకు జైపుర్‌కు వెళ్లారు. అక్రమాల కేసులో ఈడీ విచారణ నిమిత్తం ఆయన అక్కడ ఉంటున్నారు. 
ట్విటర్‌ సూపర్‌ స్టార్‌... 
ప్రియాంక సోమవారం తొలిసారిగా ట్విటర్‌లోకి అడుగిడారు. ‘సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ట్విటర్‌లోకి వచ్చిన 24 గంటల్లో 2 లక్షల మంది ఆయనను ఫాలో అయ్యారు. అయితే ప్రియాంక ట్విటర్‌లోకి వచ్చిన 12 గంటల్లోపే లక్ష మందికిపైగా అనుచరులు పోగయ్యారు. 
జాగ్రత్తగా చూసుకోండి: వాద్రా 
తన భార్య ప్రియాంకను జాగ్రత్తగా చూసుకోవాలని రాబర్ట్‌ వాద్రా ట్విటర్‌ వేదికగా కోరారు. ‘‘ప్రజాసేవ చేయడం ప్రియాంక విధి. అందుకే మేము ఆమెను భారతీయుల చేతుల్లో పెడుతున్నాం. ప్లీజ్‌! ఆమెను జాగ్రత్తగా చూసుకోండి’’ అని పేర్కొంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

గుజరాత్‌లో సీడబ్ల్యూసీ భేటీ!

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత కీలకమైన వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) తదుపరి సమావేశాన్ని గుజరాత్‌లో నిర్వహించేందుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రంగం సిద్ధం చేస్తున్నారు. గాంధీనగర్‌ లేదా పోరుబందర్‌లలో ఎక్కడైనా ఈనెల 14 తర్వాత సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈనెలలోనే రాహుల్‌ గాంధీ గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లా ధరమ్‌పుర్‌ నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలిపాయి.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.