close
యూపీయేతోనే ఉంటాం

సమాఖ్య కూటమికి అవకాశం లేదు
ఆలయాల సందర్శనలో భాగంగానే చెన్నైకి కేసీఆర్‌
డీఎంకే అధినేత స్టాలిన్‌ స్పష్టీకరణ
చంద్రబాబుతో డీఎంకే నేత దురైమురుగన్‌ భేటీ
యూపీయేతో కలిసి ఉండాలన్నదే తమ అధినేత స్టాలిన్‌ నిర్ణయమని వెల్లడి

ఈనాడు డిజిటల్‌, చెన్నై, ఈనాడు- అమరావతి: ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో భాజపా, కాంగ్రెసేతర సమాఖ్య కూటమికి అవకాశం ఉండబోదని డీఎంకే అధినేత స్టాలిన్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఉప ఎన్నికల ప్రచారానికి వెళుతూ చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సోమవారం భేటీపై ఆయన స్పష్టతనిచ్చారు. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ అంశంపైనా స్పందించారు. కూటముల ఏర్పాటుకు కేసీఆర్‌ ఇక్కడికి రాలేదని, రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల సందర్శనలో భాగంగా చెన్నై వచ్చిన ఆయన మర్యాదపూర్వకంగానే తనను కలిశారని వెల్లడించారు. ఈ సందర్భంగా పలు ఇతర అంశాలపై చర్చించామని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌, భాజపాయేతర కూటమి ఏర్పడుతుందని తాను భావించడం లేదని చెప్పారు. సమాఖ్య కూటమి ఏర్పాటు అవకాశం ఉందా? లేదా? అనేది ఫలితాల అనంతరమే తేలుతుందని వివరించారు. తాము మాత్రం కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీయే పక్షానే ఉన్నామని స్పష్టం చేశారు. కేసీఆర్‌, భాజపాతో స్టాలిన్‌ సంప్రదింపులు జరుపుతున్నారని, డీఎంకే రంగులు మార్చుకుంటోందంటూ భాజపా తమిళనాడు అధ్యక్షురాలు తమిళసై చేసిన విమర్శలపైనా ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్‌ మండిపడ్డారు. ‘‘తాను భాజపా, ప్రధాని మోదీతో మాట్లాడానన్న వ్యాఖ్యలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. లేనిపక్షంలో మోదీ, తమిళసై సిద్ధమా?’’ అని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల అనంతర అంశాలపై మాట్లాడానని చెప్పడం అవాస్తవమని, ఆరోపణలను నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోడానికి వారిద్దరూ సిద్ధం కావాలని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా రాహుల్‌ను తానే తొలుత ప్రతిపాదించానని ఓ ప్రకటనలో వివరించారు. మరోవైపు డీఎంకే సీనియర్‌ నేత, పార్టీ కోశాధికారి దురైమురుగన్‌ మంగళవారం అమరావతిలోని సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ల భేటీ విశేషాలను వివరించారు. కేసీఆర్‌తో భేటీ, ఫెడరల్‌ ఫ్రంట్‌పై స్టాలిన్‌ అభిప్రాయాలను చంద్రబాబుకు తెలిపారు.

కేసీఆర్‌తో భేటీపై దుమారం
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో డీఎంకే అధినేత స్టాలిన్‌ సమావేశం కావడంపై భాజపా, అన్నాడీఎంకే విమర్శలు గుప్పించాయి. డీఎంకే ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుందని, ఫలితాల తర్వాత భాజపా ప్రభుత్వంలో మంత్రి పదవులు ఆశిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్‌, మంత్రి జయకుమార్‌ విమర్శించారు. ఇప్పుడు సమాఖ్య కూటమికి ప్రయత్నిస్తున్న కేసీఆర్‌తో స్టాలిన్‌ భేటీ అయ్యారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు, తనకు మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని స్టాలిన్‌ ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. స్టాలిన్‌కు ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదనే అనుమానం వచ్చిందని పేర్కొన్నారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థి అని ప్రతిపాదించిన వ్యక్తి ఇతర ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్‌ పార్టీ ఆలోచించాలన్నారు.

డీఎంకే అప్రమత్తం
తొలుత కేసీఆర్‌తో భేటీ ఉండకపోవచ్చని సంకేతాలిచ్చిన డీఎంకే.. ఆయనతో భేటీ కావడం, దానిపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో డీఎంకే అప్రమత్తమైంది. కేసీఆర్‌తో సమావేశమైన మరుసటి రోజే ఆ పర్యటన తాలూకు చర్చలపై స్టాలిన్‌ స్పష్టతనిచ్చారు. పార్టీ కోశాధికారి దురైమురుగన్‌ అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ‘సమాఖ్య కూటమిలోకి రావాలని కేసీఆర్‌ అడిగారు. ప్రస్తుత ఎన్నికల్లో యూపీయేతో కలిసి పోటీ చేసినందున భవిష్యత్తులోనూ దాంతోనే ఉంటామని స్టాలిన్‌ కేసీఆర్‌కు వివరించారు. దక్షిణాదిలోని పార్టీలన్నీ కలిసి పనిచేస్తే ఉమ్మడి లక్ష్యాలను సాధించుకోవచ్చని కేసీఆర్‌ సూచించగా.. ఎన్నికల ఫలితాలు వచ్చాకే మాట్లాడుకోవచ్చని స్టాలిన్‌ పేర్కొన్నారు’ అని మురుగన్‌ చంద్రబాబుకు చెప్పినట్లు తెదేపా వర్గాల సమాచారం. ఆలయాల సందర్శనకు వచ్చిన కేసీఆర్‌ మర్యాదపూర్వకంగానే తమ నేతను కలిశారని డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్‌ భారతి కూడా స్పష్టతనిచ్చారు.

ప్రచారానికి చంద్రబాబుకు ఆహ్వానం
తన భార్య, కుమారుడు కతిర్‌ ఆనంద్‌లతో కలిసి డీఎంకే నేత దురైమురుగన్‌ అమరావతికి వచ్చారు. తమిళనాడులోని వేలూరు నుంచి కతిర్‌ ఆనంద్‌ డీఎంకే తరఫున లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఏప్రిల్‌ 18న జరగాల్సిన ఎన్నికను భారీగా నగదు దొరికిందన్న కారణంతో ఎన్నికల సంఘం రద్దు చేసింది. తిరిగి జరిగే ఆ ఎన్నికల్లో తన తరఫున ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కతిర్‌ ఆనంద్‌ చంద్రబాబును ఆహ్వానించారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.