close
ఆన్‌లైన్లో జవాబు పత్రాలు

27న ఫలితాలతో పాటు అందుబాటులో ఉంచండి
  ఇది విద్యార్థులకు సంతృప్తినిస్తుంది
  ప్రభుత్వానికి హైకోర్టు సూచన
ఇంటర్‌ పరీక్షల కేసులో  గ్లోబరీనాను ప్రతివాదిగా చేరుస్తూ నోటీసులు
ఈనాడు - హైదరాబాద్‌

ఇంటర్‌ పరీక్షల్లో తప్పిన అభ్యర్థులందరి ఫలితాలు, మార్కుల జాబితాలతోపాటు జవాబు పత్రాలను కూడా ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలంటూ ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు సూచించింది. దీనివల్ల గతంలో వచ్చిన మార్కులు, రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ తరువాత మార్కులతోపాటు జవాబు పత్రాలను విద్యార్థులు సరిచూసుకుని సంతృప్తి చెందడానికి అవకాశం ఉందని పేర్కొంది. సమస్య మరింత జటిలం కాకుండా ఉంటుందని కూడా వ్యాఖ్యానించింది. గ్లోబరీనా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ను ప్రతివాదిగా చేర్చాలంటూ దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. గ్లోబరీనాకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను జూన్‌ 6కు వాయిదా వేసింది. పునఃమూల్యాంకనానికి ఆదేశించాలని, ఆత్మహత్య చేసుకున్న 16 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని, గ్లోబరీనాను ప్రతివాదిగా చేర్చాలని బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు, న్యాయవాది రాపోలు భాస్కర్‌ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే.

వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన వేసవి సెలవుల ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ పూర్తయిందన్నారు. ఈ ప్రక్రియను కూడా గ్లోబరీనా సంస్థ చేపట్టిందని, ప్రభుత్వం దీనిపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందజేశాక, మరో ఏజన్సీ డేటాటెక్‌ మెథడిక్స్‌కు బాధ్యతలు అప్పగించామన్నారు. రెండు సంస్థలూ ఫలితాలను ప్రకటించే ప్రక్రియను చేపడతాయన్నారు.

27 వరకూ గడువు కోరిన ఎస్‌జీపీ
మొత్తం 9,43,005 మంది పరీక్షలకు హాజరుకాగా 5,60,889 మంది ఉత్తీర్ణులయ్యారని, 3,82,116 మంది ఫెయిలయ్యారని ఎస్‌జీపీ చెప్పారు. 12 స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంపుల్లో 5,831 క్వాలిఫైడ్‌ లెకర్చర్లు ఈ ప్రక్రియను పూర్తి చేశారన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉన్నామని, 16 సాయంత్రానికి మార్కుల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచుతామని, 27 తరువాత జవాబు పత్రాలనూ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ మార్కుల జాబితాతోపాటు జవాబు పత్రాలనూ ఒకేసారి ఎందుకు అప్‌లోడ్‌ చేయరాదని ప్రశ్నించింది. తనకు 60 మార్కులు రావాల్సి ఉందని భావించిన విద్యార్థికి 38 మార్కులు వచ్చినట్లయితే, జవాబు పత్రాలను పరిశీలిస్తే.. తనకు ఎందుకు అన్ని మార్కులు రాలేదో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యమేనని అయితే 27 వరకు గడువు కావాలని ఎస్‌జీపీ తెలిపారు. మొత్తం 9,02,429 జవాబు పత్రాలున్నాయని, ఒక్కొక్కొటీ 24 పేజీల బుక్‌లెట్‌గా ఉంటుందన్నారు. అప్‌లోడ్‌కు సమయం పడుతుందని చెప్పారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది డి.దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ లక్షల మంది విద్యార్థులు నిరీక్షిస్తున్నారన్నారు. గతంలో కమిటీని ఏర్పాటు చేశామని, 8న ఫలితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొనడాన్ని ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం గడువు ఇవ్వడం సమంజసమని, హడావుడిగా సమాచారం అడగటం సరికాదంది. అప్‌లోడింగ్‌, డిజిటలైజేషన్‌లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ విద్యాసంవత్సరంలో జాప్యం జరుగుతోందని, నీట్‌ తదితర పరీక్షలున్నాయన్నారు. కనీసం రెండో సంవత్సరం విద్యార్థులవైనా ముందు ఇచ్చేలా చూడాలన్నారు. ఎస్‌జీపీ స్పందిస్తూ మళ్లీ వాటిని వేరు చేసేలా ప్రోగ్రాం లేదన్నారు. కొంతమంది రెండో సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం ఫెయిలై తిరిగి రాశారన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.