close
ఉత్కంఠబరి హుజూర్‌నగరి

నువ్వా నేనా అన్నట్లు తెరాస.. కాంగ్రెస్‌

కృష్ణమ్మ పరవళ్లు.. పచ్చటి వరిపొలాలు.. పారిశ్రామిక చిహ్నాలైన సిమెంట్‌ కర్మాగారాలతో ప్రత్యేకతను సొంతం చేసుకున్న హుజూర్‌నగర్‌లో తెరాస కాంగ్రెస్‌ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు ఆసక్తికర పోరుసాగుతోంది. గెలుపు నల్లేరుపై నడకే అని మొదట భావించిన తెరాస, కాంగ్రెస్‌లు మారిన పరిస్థితులు.. మారుతున్న సమీకరణలతో సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించడంతో ఆర్భాటపు ప్రచారం జోలికి పోవడంలేదు. వ్యయపరిమితి కత్తి మెడపై వేలాడుతుండటంతో పార్టీలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రచారానికి నాలుగురోజుల గడువే మిగిలి ఉండడంతో నేతలంతా గ్రామాలను చుట్టేస్తూ కులసంఘాల సమావేశాలను ఏర్పాటు చేసుకుని చివరి విడత ప్రయత్నాలను తారస్థాయికి తీసుకెళ్తున్నారు.


హోరు లేని ప్రచారం..
ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టితో అప్రమత్తం
పదునెక్కిన వ్యూహాలు.. ఎత్తుగడలు
హుజూర్‌నగర్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

ప ఎన్నికలు అంటే చాలు ఎంతో ఆర్భాటం, హోరెత్తే ప్రచారం కనిపిస్తాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితులేవీ కనిపించకపోవడం విశేషం. అక్కడక్కడ తిరిగే ప్రచార వాహనాలు మినహా అసలు ఎన్నికలు జరుగుతున్నట్లే లేదు. ఊరూవాడా రెపరెపలాడే జెండాల స్థానంలో అక్కడక్కడ ఒకటి రెండు జెండాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకదృష్టి సారించడంతో అభ్యర్థులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా ఐటీ మాజీ ఉన్నతాధికారి కె.ఆర్‌.బాలకృష్ణన్‌ నియామకం వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు బదిలీ చేయడం.. భాస్కరన్‌ నియామకం వంటి చర్యలు ఈ ఎన్నికల్లో చర్చనీయాంశాలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు పెద్దగా హడావుడి, ఆర్భాటం లేకుండా నేరుగా గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు.

సై అంటే సై అంటున్న పార్టీలు
ఎలాగైనా విజయం పతాకం ఎగురవేయాలని అధికార తెరాస సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. వరుస విజయాల పరంపర కొనసాగించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. గత శాసనసభ ఎన్నికల అనంతరం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుగులేని అధిక్యాన్ని సాధించిన తెరాస అదే పరంపర కొనసాగుతుందని ధీమాగా ఉంది. కాంగ్రెస్‌ కూడా శాసనసభ ఎన్నికల్లో 7,466 ఓట్ల ఆధిక్యంతో నెగ్గిన ఉత్తమ్‌ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 12,993 ఆధిక్యాన్ని సాధించడంతో గెలుపుపై విశ్వాసంతో ఉంది.

ఇద్దరిదీ అభివృద్ధి మాటే
లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక ఎన్నిక కావడంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికైన హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ వరుస విజయాలకు ముగింపు పలికి జెండా ఎగురవేయాలని తెరాస ముందుకు వెళ్తోంది. అభివృద్ధి కోసం ఓటేయాలని తెరాస కోరుతుండగా చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

తెరాసకు ప్రతిష్ఠాత్మకం
గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సైదిరెడ్డి మరోమారు బరిలో దిగారు. తెరాస తరఫున ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.టి.రామారావు రోడ్‌షోలో పాల్గొనగా స్థానిక మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎన్నికల ఇన్‌ఛార్జీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా తెరాస కీలక ప్రజాపతినిధులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు అంతా అక్కడే మకాం వేశారు. నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే తెరాసను గెలిపించాలని తెరాస ప్రచారం సాగిస్తోంది. సీఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ బహిరంగపభ, మంత్రి కేటీఆర్‌ సభలు పార్టీకి మరింత తోడ్పడతాయని తెరాస నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌కు గెలుపు కీలకం
ఉత్తమ్‌ స్థానంలో ఈసారి ఆయన సతీమణి పద్మావతి కాంగ్రెస్‌ అభ్యర్థి కావడంతో ఉత్తమ్‌ గెలుపు బాధ్యతను పూర్తిగా తీసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు కావడం, 2009 నుంచి వరుసగా నెగ్గడంతో ఉత్తమ్‌కు గెలుపు కీలకంగా మారింది.జిల్లా కాంగ్రెస్‌ నేతలంతా కలసికట్టుగా ముందుకు వెళ్తుండటం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేత జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

సత్తాచాటాలని చూస్తున్న పార్టీలు
భాజపా అభ్యర్థి రామారావు, తెదేపా అభ్యర్థి కిరణ్మయి తమ పార్టీల ఓట్లను పదిలపరుచుకునే దిశగా ప్రయత్నిస్తున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు ఎంపీలు బండి సంజయ్‌, అర్వింద్‌, ఆ పార్టీ నేత వివేక్‌ ప్రచారంలో పాల్గొనగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారంలో పాల్గొననున్నారు. తెదేపా తరఫున రాష్ట్ర అధ్యక్షుడు రమణ ప్రచారంలో పాల్గొన్నారు. 15 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన తెదేపా ఈసారి బరిలో దిగగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెజాస ప్రకటించింది. సీపీఐ మొదట తెరాసకు మద్దతు ప్రకటించగా ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.

కులాల ఓట్ల కోసం పార్టీల వ్యూహం

కులాలు, వర్గాల వారీగా ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. కులాలవారీగా సంక్షేమానికి తెరాస ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆ పార్టీ నేతలు నేతలు వివరిస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న గిరిజనుల ఓట్లపై తెరాస, కాంగ్రెస్‌లు ప్రత్యేక దృష్టి సారించాయి. మంత్రి సత్యవతిరాథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ కవిత మూడు రోజుల పాటు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. గిరిజన గూడెలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వయం పాలన అందించడం, ఆసరా, రైతుబంధు, ఉచిత విద్యుత్‌ గురించి తెరాస ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌ తరఫున ప్రధానంగా ఉత్తమ్‌తో పాటు కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్‌ పార్టీ గిరిజన నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

మండలాలు: ఏడు (నేరేడుచర్ల, పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్‌నగర్‌, గరిడేపల్లి)
నియోజవర్గం: పునర్విభజనలో 2009లో ఏర్పడింది
ప్రాతినిధ్యం: 2009, 2014, 2018 ఎన్నికల్లో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గెలుపు.
ఉప ఎన్నిక: ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్‌ రాజీనామాతో ఉప ఎన్నిక

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.