close

ప్రధానాంశాలు

ఇక మహిళా సేనానులు

సైన్యంలో ‘కమాండ్‌’ బాధ్యతలు
వారికి శాశ్వత కమిషన్‌ ఇవ్వాలి
సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
దిల్లీ

‘‘గర్భధారణ, మాతృత్వాన్ని పొందడం, పిల్లల పెంపకం, కుటుంబపరమైన బాధ్యతల నిర్వహణ వంటి కారణాల వల్ల మహిళా అధికారులు సైనిక విధుల్లోని సవాళ్లను అందుకోలేరన్న కేంద్ర ప్రభుత్వ వాదన మూస ఆలోచన ధోరణికి నిదర్శనం. ఇది రాజ్యాంగపరంగా చెల్లుబాటు కాదు.’’

-సుప్రీంకోర్టు ధర్మాసనం

 

సైనిక దళాల్లో లింగ వివక్షకు ముగింపు పలికే దిశగా సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సైన్యంలో మహిళా అధికారులకు ‘కమాండ్‌ హోదా’లను ఇచ్చేందుకు మార్గం సుగమం చేసింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) మహిళా అధికారులందరికీ మూడు నెలల్లోగా ‘శాశ్వత కమిషన్‌’ (పర్మనెంట్‌ కమిషన్‌- పీసీ) మంజూరు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అతివల శారీరక పరమైన పరిమితుల కారణంగా కమాండ్‌ హోదా ఇవ్వడంలేదన్న ప్రభుత్వ వాదనను తప్పుపట్టింది. ఇది లింగ వివక్ష అని, మూస ఆలోచన ధోరణి అని వ్యాఖ్యానించింది.

మహిళా ఎస్‌ఎస్‌సీ అధికారులకు పీసీ ఇవ్వాలంటూ దిల్లీ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీలతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. సైన్యంలోని పది విభాగాల్లో మహిళా ఎస్‌ఎస్‌సీ అధికారులకు శాశ్వత కమిషన్‌ ఇస్తామంటూ కేంద్రం గత ఏడాది ఫిబ్రవరి 25న తెచ్చిన విధానాన్ని ధర్మాసనం ఆమోదించింది. ఈ విధానాన్ని తెచ్చినప్పటికీ.. ప్రభుత్వం అనుమతించిన విభాగాల్లోకే మహిళలను తీసుకోవాలని సైనిక చట్టం చెబుతున్నట్లు కేంద్రం వాదించింది. దీన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. దేశ సేవలో మహిళా అధికారుల రికార్డు తిరుగులేనిదని, అఫ్గానిస్థాన్‌, సిరియా, ఇథియోపియా, ఇజ్రాయెల్‌ సహా అనేక ప్రాంతాల్లో వీరు సత్తా చాటారని తెలిపింది. వారి పేర్లనూ ప్రస్తావించింది. ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో మహిళా అధికారులు అద్భుత సేవలు అందించారని తెలిపింది. కవాతుల్లో పురుష జవాన్లతో కూడిన దళాలను ముందుండి నడిపించిన లెఫ్టినెంట్‌ భావనా కస్తూరి, కెప్టెన్‌ తానియా షేర్‌గిల్‌ల సామర్థ్యాన్ని గుర్తు చేసింది.

ఆలోచన తీరు మార్చుకోండి..
జవాన్లలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారని, యూనిట్లలో కమాండ్‌ హోదాలో మహిళా అధికారులను ఆమోదించేందుకు వారు ఇంకా మానసికంగా సిద్ధంగా లేరని కేంద్రం పేర్కొంది. దీనిపై సుప్రీం కోర్టు మండిపడింది. మహిళల శారీరక లక్షణాలకు.. వారి హక్కులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. శారీరక సంబంధ పరిమితులు, యూనిట్లలో పూర్తిగా పురుషులతో కూడిన వాతావరణం ఉండటం, పోరాట సామర్థ్యం వంటి అంశాల కారణంగా మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ ఇవ్వలేమన్న వాదన తప్పు అని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ఇలాంటి ఆలోచనతీరును మార్చుకోవాలని స్పష్టంచేసింది. ‘‘స్త్రీ/పురుష ప్రాతిపదికన మహిళల సమర్థతను శంకించడం అతివల గౌరవానికే కాక.. సైన్యంలో పురుష అధికారుల ప్రతిష్ఠకూ భంగకరం’’ అని వ్యాఖ్యానించింది.

ఒకవేళ 14 ఏళ్లకుపైగా సర్వీసు పూర్తిచేసుకున్న మహిళా అధికారులెవరైనా పీసీ కోరుకోకుంటే వారికి పెన్షన్‌కు యోగ్యమైన 20 ఏళ్ల సర్వీసు వరకూ కొనసాగే అవకాశాన్ని కల్పించాలని స్పష్టంచేసింది. సర్వీసులో ఉన్న అధికారులకు లేదా గతంలో హైకోర్టును ఆశ్రయించిన అధికారులకు పెన్షన్‌ ఇతర సౌకర్యాలు వర్తిస్తాయని చెప్పింది. శాశ్వత కమిషన్‌ పొందిన మహిళా అధికారులకు పురుష అధికారులతో సమానంగా పదోన్నతులు సహా అన్ని రకాల ప్రయోజనాలను కల్పించాలని ఆదేశించింది.

పోరాట విధులపై తేల్చాల్సింది ప్రభుత్వమే..
అయితే మహిళా అధికారులను పోరాట విధుల్లోకి తీసుకునే అంశంపై నిర్ణయాన్ని ప్రభుత్వానికే సుప్రీం కోర్టు వదిలేసింది. విధానపరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని, దానిపై సంబంధిత వ్యవస్థే దృష్టి సారించాలని పేర్కొంది.


ఫలితం ఏమిటి?

‘కమాండ్‌ హోదా’ పోస్టుల్లో నియామకానికి వీలు కల్పించడం వల్ల పురుష అధికారుల తరహాలో మహిళా అధికారులూ కంపెనీ, బెటాలియన్‌ వంటి విభాగాలకు నాయకత్వం వహించడానికి వీలవుతుంది. ప్రతిభ ప్రాతిపదికన కల్నల్‌ లేదా అంత కన్నా ఎక్కువ హోదాకు చేరుకోవడానికి మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం మహిళా అధికారులు ఎస్‌ఎస్‌సీ కింద 10-14 ఏళ్లు మాత్రమే సైన్యంలో పనిచేసే వీలు ఉంటోంది. శాశ్వత కమిషన్‌ ఇవ్వడం వల్ల పురుష అధికారులతో సమానంగా పదవీ విరమణ వయసు వరకూ కొనసాగవచ్చు.


ఆనందోత్సాహాలు..

ఈ తీర్పుతో కోర్టు వెలుపల ఉన్న పలువురు మహిళా సైనికాధికారులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేశారు. ఇది సైనిక దళాలకే కాకుండా దేశవ్యాప్తంగా మహిళలందరి అభ్యున్నతికి దోహదపడుతుందని వారు చెప్పారు. ఇప్పుడు మహిళలకు ఆకాశమే హద్దు అని మహిళా అధికారుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది మీనాక్షి లేఖి వ్యాఖ్యానించారు.

సుప్రీం కోర్టు తీర్పును రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వాగతించారు. మహిళలకు శాశ్వత కమిషన్‌ ఇవ్వాలన్న ఆలోచనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థించారని చెప్పారు. 2018లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆయన దీన్ని ప్రస్తావించారని తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.