close

ప్రధానాంశాలు

అమ్మభాష నేర్చితేనే ఉద్యోగాలు

అలా ప్రభుత్వాలు చొరవ చూపాలి
వరంగల్‌ ఏవీవీ కళాశాల వజ్రోత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఈనాడు - వరంగల్‌

ఆంగ్లంపై మక్కువతో మాతృభాషకు విద్యార్థులు దూరమవుతున్నారని, అందుకే అమ్మభాష నేర్చుకున్నవారికే ఉద్యోగాలు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. ‘‘ఆసక్తికోసం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. అందులో మాతృభాష కచ్చితంగా ఉండాలి. మాతృభాష వచ్చిన వారికే ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాలి. అప్పుడే అమ్మభాషను విధిగా నేర్చుకుంటారు’’ అని అన్నారు. ఆదివారం వరంగల్‌లో ఆంధ్ర విద్యాభివర్ధని (ఏవీవీ) కళాశాల వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘విద్యలో నైతిక విలువలు పెరగాలి. నేడు నిర్భయ లాంటి ఘటనలు చూస్తుంటే విలువలు ఎటుపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మానవ జీవిత వికాసంలో విద్య పాత్ర ఎంతో కీలకం. భవిష్యత్తు తరాలకు సరైన మార్గదర్శనం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది. జేఎన్‌టీయూలో ఇటీవల నైతిక విలువలపై కోర్సును ప్రవేశపెట్టారు.

వరంగల్‌ అంటేనే చందా కాంతయ్య గుర్తొస్తారు
వరంగల్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. విద్యార్థి దశ నుంచే ఇక్కడికి వస్తున్నా. పీవీ నర్సింహారావు లాంటి మహా మేధావులు ఇక్కడే చదువుకొని గొప్పవారయ్యారు. కాళోజీ, దాశరథి, వానమామలై వరదాచార్యులు లాంటి ఎంతో మంది గొప్ప కవులు నడయాడిన గడ్డ ఇది. వరంగల్‌ అంటేనే ఏవీవీ విద్యా సంస్థ స్థాపకుడైన చందా కాంతయ్య గుర్తొస్తారు. ఆయన విద్యాభివృద్ధి కోసం తన ఆస్తిని ధారాదత్తం చేశారు. ఏవీవీ కళాశాల ఎంతో మందిని గొప్పవారుగా తీర్చిదిద్దింది. వరంగల్‌లోని ప్రఖ్యాత రామప్ప, లక్నవరం, పాకాలలాంటి చెరువులు ఉన్నాయి. అవి ఆక్రమణలపాలు కాకుండా కాపాడాలి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు చాలా బాగున్నాయి’’ అని వెంకయ్యనాయుడు చెప్పారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. తనతోపాటు వరంగల్‌కు చెందిన ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏవీవీ కళాశాల పూర్వ విద్యార్థులేనని అన్నారు. అనంతరం వెంకయ్యనాయుడిని కళాశాల నిర్వాహకులు చందా విజయకుమార్‌, డాక్టర్‌ ఉపేంద్రశాస్త్రి, డాక్టర్‌ నర్సింహారావు సత్కరించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, ఎంపీలు లక్ష్మీకాంతరావు, పసునూరి దయాకర్‌, బండా ప్రకాశ్‌, మేయర్‌ ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, నరేందర్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి మోహన్‌కందా తదితరులు పాల్గొన్నారు.


సర్వధర్మ సమభావన దెబ్బతీసేలా కుట్రలు

‘ప్రాంతాలు, భాషలు వేరైనా భారతీయులంతా ఒక్కటే అనే జాతీయతా భావనతో మనమంతా ముందుకెళ్లాలి. భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన సర్వధర్మ సమభావన దెబ్బతీసేలా కొంతకాలంగా కుట్రలు జరుగుతున్నాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో వేర్వేరు అంశాలపై జరుగుతున్న అల్లర్లు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. విచ్ఛిన్నకర శక్తులు అదును చూసి విషం చిమ్మాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. దేశంలో మైనారిటీలకు తగిన రక్షణ ఉంది. భారత్‌లో 65 శాతానికిపైగా ఉన్న యువతే బలీయమైన శక్తి. వచ్చే 35 ఏళ్లపాటు ప్రపంచానికి అవసరమైన మానవవనరులను అందించే శక్తి భారత్‌కు ఉంది’ అని వెంకయ్యనాయుడు వివరించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.