close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
నిర్లక్ష్యపు చికిత్స ప్రాణం తీసింది!

చేగూరులో మహిళ మృతి వెనుక విస్మయకర అంశాలు
ఇద్దరు ఆర్‌ఎంపీలు, ఓ వైద్యుడి నిర్వాకం
3 ఆసుపత్రులు సీజ్‌.. ముగ్గురిపై కేసులు
మృతురాలి ఇంట్లో అద్దెకు నలుగురు బిహారీ యువకులు
వారు దిల్లీ నుంచి మర్కజ్‌ యాత్రికులతో కలిసి వచ్చినట్లు గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనాతో ఓ మహిళ మృతిచెందిన ఘటనలో పలు విస్మయకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు వైద్యులు ఆమెకు నిర్లక్ష్యంగా వైద్యం చేయడమే ఇందుకు కారణమని అధికారుల విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన మహిళ(50) కరోనాతో మరణించింది. ఈ ఘటనలో వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు, పోలీసులు శనివారం తనిఖీలు చేసి మూడు ఆసుపత్రులు, మందుల దుకాణాలను సీజ్‌ చేయడంతో పాటు ఇద్దరు ఆర్‌ఎంపీలు, ఒక వైద్యుడిపై కేసు నమోదు చేశారు. ఈనెల 1వ తేదీన సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రిలో ఈ మహిళ చనిపోయింది. ఆమెకు సంబంధించిన నివేదిక 3వ తేదీన రాగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆమె గతంలో ఎక్కడెక్కడ చికిత్స తీసుకుందనే కోణంలో రంగారెడ్డి జిల్లా ఉప వైద్యారోగ్యాధికారి చందూనాయక్‌, షాద్‌నగర ఆర్డీవో రాజేశ్వరి, ట్రైనీ ఐపీఎస్‌ రితిరాజ్‌ల ఆధ్వర్యంలో చేగూరు, షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌లో తనిఖీలు చేశారు. సదరు మహిళ గత నెల 28న జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు లక్షణాలతో చేగూరులోని ఆర్‌ఎంపీ వైద్యుడు ప్రతాప్‌రెడ్డి వద్దకు వెళ్లింది. అక్కడ తగ్గకపోవడంతో 31న షాద్‌నగర్‌లో ఆర్‌ఎంపీ విఠలయ్య వద్దకు పంపించారు. అతను కొంత వైద్యం చేసి మహబూబ్‌నగర్‌లోని అనిల్‌ సర్జికల్‌ ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. అక్కడ డాక్టర్‌ అనిల్‌ సదరు మహిళను పరీక్షించి నిబంధనలకు విరుద్ధంగా ఎండోస్కోపీకి ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో.. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలన్నారు. ఏప్రిల్‌ 1న మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మహిళను పరీక్షించి కొవిడ్‌-19 లక్షణాలు గుర్తించారు. మధుమేహం ఉండటంతో ఉస్మానియాకు పంపించారు. ఇక్కడికి వచ్చాక చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందింది.

35 మందికి చికిత్స చేసినట్లు గుర్తింపు
సదరు మహిళకు చికిత్సనందించాక.. ఆర్‌ఎంపీ విఠలయ్య ఇద్దరికి, డాక్టర్‌ అనిల్‌ 33 మందికి వైద్యం చేసినట్లు గుర్తించారు. వీరిని రాజేంద్రనగర్‌లోని జిల్లా క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. చేగూరులోని ఆర్‌ఎంపీ ప్రతాప్‌రెడ్డి ఎవరికీ వైద్యం చేయలేదని చెబుతున్నారు. షాద్‌నగర్‌లో ఆర్‌ఎంపీ వైద్యుడు విఠలయ్య అక్రమంగా క్లినిక్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బయట శ్రీనివాస డెంటల్‌ ఆసుపత్రి అని బోర్డు ఉంది. డాక్టర్‌ కృష్ణవేణి అని పేరు రాసి ఉంది.  కానీ విఠలయ్య వైద్యం చేస్తున్నట్లు తేలింది.


బిహార్‌వాసులతోనే వచ్చిందా?

గ్రామంలో ఉండే మహిళకు కొవిడ్‌-19 ఎలా సోకిందా అని ఆరా తీశారు. ఈమె ఇంట్లోనే నలుగురు బిహారీ యువకులు అద్దెకు ఉంటున్నారు. వీరు సమీపంలోని ఓ ఆధ్యాత్మిక కేంద్రంలో పనిచేస్తున్నారు. వీరందరూ గత నెల 7న ఉత్తరాఖండ్‌కు.. అక్కడి నుంచి 18న దిల్లీకి వెళ్లారు. అక్కడ 19న బయలుదేరారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ నుంచి తిరిగి వస్తున్న యాత్రికులతో కలిసి వీరూ ప్రయాణించారు. అనంతరం కారులో చేగూరుకు చేరుకున్నారు. నలుగురు బిహార్‌వాసులతో పాటు కారులో డ్రైవర్‌, మరొక వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. బిహారీవాసులకు కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాలు రావాల్సి ఉంది. వీరందరినీ క్వారంటైన్‌కు తరలించారు.. ఈ మహిళతో మాట్లాడిన 30 మంది గ్రామస్థులు, మొత్తంగా 97 మందిని ఇంటికే పరిమితం కావాలని చెప్పారు. ఆధ్యాత్మిక కేంద్రంలో 818 మందిని హోం క్వారంటైన్‌ కావాలని సూచిస్తూ అధికారులు ముద్ర వేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.