
తాజా వార్తలు
వివరాలను వెల్లడించిన పైలట్లు
ఇంటర్నెట్‌డెస్క్: బాలాకోట్‌పై భారత వాయుసేన ఎలా దాడి చేసిందో తాజాగా బహిర్గతమైంది. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు పైలట్లు ఆపరేషన్ వివరాలను పరిమితంగా ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ఈ దాడి కోసం వాయుసేన చేసిన కసరత్తు..శత్రువు దృష్టి మళ్లించడానికి పన్నిన ఉచ్చును వివరించారు. మన వాయుసేన వీరులు ప్రాణాలకు తెగించి సరిహద్దులు దాటి ఉగ్రశిబిరాలను నాశనం చేసిన తీరును వీరు కళ్లకుగట్టారు.
దాడి సన్నద్ధత ఇలా..
పుల్వామ ఘటన తర్వాత జైషే ఉగ్రమూక అంతు చూడాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. దీనిపై తర్జనభర్జనల తర్వాత బాలాకోట్‌లోని ఉగ్రశిబిరాన్ని టార్గెట్‌గా నిర్ణయించారు. ఈ విషయం మూడోకంటికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. దాడికి సరిగ్గా రెండు రోజుల ముందు నుంచి సరిహద్దులకు అత్యంత దగ్గరగా కాంబాట్ ఎయిర్ పెట్రోల్(వైమానిక గస్తీ)లు పెంచారని ఆపరేషన్‌లో పాల్గొన్న పైలట్ ఒకరు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..‘‘పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాన్ని అంచనా వేసి దానిని తప్పుదోవ పట్టించడానికి వీటి ఉద్ధృతిని పెంచాం. భారత్ ఇలా ఎందుకు చేస్తోందో అర్థం కాక పాక్ గందరగోళానికి గురైంది.’’ అన్నారు.
కొన్నిగంటల ముందు బాంబులు బయటకు..
మరో పైలట్ మాట్లాడుతూ ‘‘దాడికి కొద్ది గంటల ముందు నుంచి మాత్రమే సన్నాహాలు మొదలు పెట్టారు. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం 4గంటలకు స్పైస్-2000 బాంబులను బయటకు తీశారు. వాటిని మిరాజ్-2000 యుద్ధ విమానాలకు అమర్చారు. అనంతరం బాలాకోట్ ఉగ్ర క్యాంప్‌నకు సంబంధించిన సమాచారాన్ని ఆ స్మార్ట్ బాంబ్‌లో అమర్చారు. ఫిబ్రవరి 26వ తేదీన అర్ధరాత్రి 2గంటల సమయంలో ఇంధన ట్యాంకులను నింపుకొన్న విమానాలు గాల్లోకి లేచాయి. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి బయల్దేరిన యుద్ధవిమానాలు కశ్మీర్‌కు చేరగానే రేడియో సైలెన్స్‌ను పాటించాయి. ఈ విమానాలకు రక్షణ కల్పించడానికి.. ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించడం కోసం సుఖోయ్-30 ఎంకేఐ విమానాల బలగం కూడా బయల్దేరింది. మాకు మార్గనిర్దేశం కోసం అవాక్స్ విమానం, గాల్లో ఇంధనం నిపేందుకు మరో ట్యాంకర్ విమానం కూడా గాల్లోకి ఎగిరాయి. మరోపక్క ఎవరికీ అనుమానం రాకుండా మా అధికారులు తమ రోజువారీ పనులను యథాతథంగా నిర్వహించారు.’’
‘‘శత్రువుల కళ్లుగప్పడం కూడా ఈ దాడి వ్యూహంలో ఒక భాగమే. అందుకే మాలోనే ఒక బృందం వేరే మార్గంలో వెళ్లింది. మేము శత్రు భూభాగంలోకి ప్రవేశించాక కేవలం 90 క్షణాల్లో మా పని ముగించుకొని వెనక్కి బయల్దేరాము. నేను ఆ రోజు దాడిలో పాల్గొన్న విషయం నా భార్యకు కూడా తెలియదు. మర్నాడు ఈ వార్తా దావానలంలా వ్యాపించింది. దీంతో ‘నువ్వు ఈ దాడిలో పాల్గొన్నావా..?’ అని ఆమె నన్ను ప్రశ్నించింది. నేను దానికి స్పందించలేదు. మౌనంగా నిద్రపోయాను’’ అని వెల్లడించారు.
ఈ దాడి తర్వాత పాక్ కూడా ప్రతి దాడికి ప్రయత్నించగా.. దానిని మన వాయుసేన తిప్పికొట్టింది. ఈ క్రమంలో భారత పైలట్ అభినందన్ వర్థమాన్ పాక్ విమానాన్ని కూల్చివేశాడు. అదే సమయంలో అతని విమానం కూడా కూలడంతో పాక్ బలగాలకు చిక్కాడు. ఆ తర్వాత పాక్ అతన్ని విడిచిపెట్టింది.
భారత్ చెట్లు కూల్చిందని ఫిర్యాదు..
బాలాకోట్ దాడిపై పాక్ డ్రామాలు అందరికీ తెలిసినవే. భారత దాడిలో తమ వైపు ఎవరూ చనిపోలేదని గట్టిగా నమ్మించేందుకు ప్రయత్నించింది. భారత్ మా భూభాగంలో చెట్లను కూల్చేసిందని యూఎన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. కానీ, దాడి జరిగిన ప్రదేశానికి అంతర్జాతీయ మీడియా బృందాన్ని అనుమతించలేదు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 14 వరకు మదర్సాను మూసివేసింది. 43 రోజుల తర్వాత ఏప్రిల్‌లో పాకిస్థాన్ ప్రభుత్వం బాలాకోట్‌లో భారత్ దాడిచేసినట్లు చెబుతున్న మదర్సా సందర్శనకు విలేకర్లను తీసుకెళ్లింది. ఈ సందర్శనకు ఐఎస్పీఆర్ మేజర్ జనరల్ ఆసీఫ్ గఫూర్ కూడా హాజరయ్యారు. ఇస్లామాబాద్ నుంచి ఒక హెలికాప్టర్లో విలేకర్ల బృందాన్ని తీసుకొని బాలాకోట్ సమీపంలోని మాన్సెరా వద్ద దించారు. అక్కడ అత్యంత కష్టమైన మార్గంలో దాదాపు గంటన్నర ప్రయాణించాక జైష్ క్యాంప్‌గా పేర్కొంటున్న మదర్సాకు చేరుకున్నారు. ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది. మసీదును తలపిస్తున్న ఆ క్యాంప్‌లో దాదాపు 150-200 మంది పిల్లలు ఖురాన్ చదువుతున్నారు.
అక్కడి వారితో మాట్లాడటంపై మీడియాకు అంక్షలు విధించారు. అతి తక్కువ సమయం మాత్రమే మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. అక్కడి వారి మాటలను బట్టి మదర్సా ఇంకా మూసే ఉందని, మీడియా సందర్శన సమయంలో అక్కడ ఉన్న పిల్లలు అంతా స్థానికులే అని తేలింది. అక్కడ ఉన్న బోర్డుపై మాత్రం ఫిబ్రవరి 27-మార్చి 14వరకు మదర్సా మూసేసినట్లు ఉంది.
పాక్ నుంచి సమాధానం లేని ప్రశ్నలు..
*43రోజుల పాటు సందర్శనకు అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితులు ఏమిటీ..?
* అదే నిజం అనుకుంటే.. వాతావరణ పరిస్థితులను తట్టుకొని గతంలో అక్కడికు వచ్చిన రాయిటార్స్ విలేకర్లను ఎందుకు అనుమతించలేదు..?
*ఫిబ్రవరి 27 నుంచి మార్చి 14 వరకు ఎందుకు సెలవులు..?
*అక్కడ విద్యార్థులతో మాట్లాడేందుకు మీడియాపై ఆంక్షలు దేనికి..?
ఇలాంటి ప్రశ్నలకు పాక్ నుంచి సమాధానం మాత్రం రాలేదు. దీంతో ఇవి చరిత్రలో భేతాళ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..!
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
