close

తాజా వార్తలు

రాజ్‌కోట్‌లో రోహిత్‌తుపాన్‌

43 బంతుల్లో 85
రెండో టీ20లో బంగ్లాపై భారత్‌ ఘనవిజయం

అంతా ఊహించినట్లు రాజ్‌కోట్‌ను ‘మహా’ తుపాను ముంచెత్తలేదు. కానీ బంగ్లాదేశ్‌కు తిప్పలు తప్పలేదు. ముందు మంచి స్కోరే చేసి సిరీస్‌పై ఆశలతో బౌలింగ్‌కు దిగిన ఆ జట్టును రోహిత్‌ తుపాను ముంచెత్తింది. సిక్సర్లు, ఫోర్లతో విధ్వంసం సృష్టించిన కెప్టెన్‌ తొలి పది ఓవర్లలోనే మ్యాచ్‌ను తేల్చేశాడు. అభిమానులకు కంటి నిండా వినోదాన్నిస్తూ అతడు కసిదీరా బాదేసిన వేళ రాజ్‌కోట్‌లో రెండో టీ20లో టీమ్‌ఇండియా.. బంగ్లాదేశ్‌ను చితక్కొట్టింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. దిల్లీలో ఓటమి మిగిల్చిన బాధను పోగొడుతూ లెక్క సరి చేసింది. ఇక సిరీస్‌ ఫలితం తేలేది నాగ్‌పుర్‌లోనే.

41
టీ20ల్లో భారత్‌ లక్ష్యాన్ని ఛేదించిన మ్యాచ్‌లు. ఆస్ట్రేలియా (40) తర్వాత స్థానంలోఉంది.
‘‘క్లిష్ట సమయంలో చాహల్‌ చక్కగా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. మా ఫీల్డింగ్‌ అనుకున్నంత గొప్పగా లేదు. రాజ్‌కోట్‌ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు కష్టం అవుతుందని తెలుసు. అందుకే పవర్‌ ప్లేలో వీలైనంత పరుగులు పిండుకున్నాం. ఆ తర్వాత మరింత చెలరేగి ఆడాం. నేనెప్పుడూ బౌలర్లను తక్కువగా అంచనా వేయను.. కానీ ఉత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఈ ఏడాది ఇప్పటిదాకా గొప్పగా గడిచింది. ఇక మంచి ముగింపు ఇవ్వాలి’’                   
- రోహిత్‌శర్మ

రాజ్‌కోట్‌

తొలి టీ20 షాక్‌ నుంచి తేరుకుంటూ టీమ్‌ ఇండియా విరుచుకుపడింది. సిరీస్‌లో బలంగా పుంజుకుంది. గురువారం ఏకపక్షంగా సాగిన రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. చాహల్‌ (2/28), దీపక్‌ చాహర్‌ (1/25), వాషింగ్టన్‌ సుందర్‌ (1/25)ల చక్కని బౌలింగ్‌తో మొదట బంగ్లాను 153/6కు పరిమితం చేసిన భారత్‌.. రోహిత్‌ (85; 43 బంతుల్లో 6×4, 6×6) వీర విధ్వంసంతో లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ధావన్‌ (31; 27 బంతుల్లో 4×4), శ్రేయస్‌ అయ్యర్‌ (24 నాటౌట్‌; 13 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ నయీమ్‌ (36; 31 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ విజయంతో సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. చివరిదైన మూడో టీ20 ఆదివారం నాగ్‌పుర్‌లో జరుగుతుంది.

ఆకాశమే హద్దుగా..
రాజ్‌కోట్‌లో రోహిత్‌ ఆటే హైలైట్‌. దిల్లీలో వైఫల్యం కసిని పెంచిందో.. కెరీర్‌లో 100వ మ్యాచ్‌ ఆడుతున్నానన్న భావన ఉత్తేజాన్నిచ్చిందో కానీ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పూనకమొచ్చినట్లు రెచ్చిపోయాడు. కళాత్మక విధ్వంసంతో ఫోర్లు, సిక్స్‌లు బాదేస్తూ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. ఛేదనలో తొలి ఓవర్‌ నుంచీ మెరుపులే. అయితే బంగ్లా బౌలింగ్‌ దాడిని ఆరంభించిన ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన ధావన్‌.. ఆ తర్వాత రోహిత్‌ బ్యాటింగ్‌కు ప్రేక్షకుడే అయ్యాడు. కళ్లు చెదిరే పుల్స్‌, లాఫ్టెడ్‌ షాట్లు, ఫ్లిక్స్‌తో రోహిత్‌ అభిమానులను మంత్ర ముగ్దుల్ని చేశాడు. షఫియుల్‌ బంతిని స్క్వేర్‌లెగ్‌లో పుల్‌ చేయడం ద్వారా తొలి బౌండరీ సాధించిన అతడు.. నాలుగో ఓవర్‌ నుంచి టాప్‌ గేర్‌లో సాగిపోయాడు. అతడు రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదడంతో ముస్తాఫిజుర్‌ వేసిన ఆ ఓవర్లో 15 పరుగులొచ్చాయి. అల్‌ అమిన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన రోహిత్‌. షఫియుల్‌ ఓవర్లో ఫోర్‌, సిక్స్‌ బాదేశాడు. అఫిఫ్‌ బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌తో డీప్‌ మిడ్‌వికెట్లో స్టాండ్స్‌లో పడేసి అర్ధశతకం (23 బంతుల్లో) పూర్తి చేశాడు. కానీ అదే జోరులో అమినుల్‌ బౌలింగ్‌లో ఓ పుల్‌ షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔటయ్యాడు. 13వ ఓవర్లో అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 125. అప్పటికే భారత్‌ విజయం ఖాయమైంది. అంతకుముందే ధావన్‌ (రోహిత్‌తో తొలి వికెట్‌కు 118) కూడా ఔటైనా కంగారుపడాల్సిన అవసరం లేకపోయింది.  రాహుల్‌ (8 నాటౌట్‌) అండతో శ్రేయస్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

రాణించిన చాహల్‌, చాహర్‌
బౌలర్లు రాణించడంతో మొదట బంగ్లాదేశ్‌ను భారత్‌ కట్టడి చేసింది. ఖలీల్‌ అహ్మద్‌ (1/44) ఒక్కడే నిరాశపరిచాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ధారాళంగా పరుగులిచ్చాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు నిజానికి మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు నయీమ్‌, లిటన్‌ దాస్‌ (29) బ్యాట్‌ ఝుళిపించడంతో 7 ఓవర్లలో 59/0తో భారీ స్కోరుపై కన్నేసింది. ఖలీల్‌ తన తొలి రెండు ఓవర్లలోనే 24 పరుగులిచ్చాడు. కానీ స్పిన్నర్లు చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ బంగ్లాను దెబ్బతీశారు. పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. అయితే బంగ్లా పతనం ఆరంభమైంది మాత్రం లిటన్‌ రనౌట్‌తోనే. ఎనిమిదో ఓవర్లో అతడు వెనుదిరిగాడు. ఆ తర్వాత నయీమ్‌ను సుందర్‌ ఔట్‌ చేయగా.. చాహల్‌ ఒకే ఓవర్లో (13వ)  ముష్ఫికర్‌ (4), సౌమ్య సర్కార్‌ (30)ను వెనక్కి పంపాడు. 13 ఓవర్లకు స్కోరు 103/4. మహ్మదుల్లా, అఫిఫ్‌ హుస్సేన్‌ (6) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ అఫిఫ్‌ను ఖలీల్‌.. మహ్మదుల్లా (30)ను చాహర్‌ వెనక్కి పంపారు. 
యువీని గుర్తు చేశాడు..
బంగ్లా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ రోహిత్‌ ఓ దశలో కేవలం సిక్స్‌ల కోసమే ఆడుతున్నట్లు కనిపించాడు. మొసాదెక్‌ హుస్సేన్‌ వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో తొలి మూడు బంతులను పుల్‌ షాట్లతో సిక్సర్లుగా మలిచి యువరాజ్‌ ఆరు సిక్సర్ల రికార్డుపై కన్నేశాడు. కానీ మొసాదెక్‌.. ముప్పును తప్పించుకున్నాడు. కాస్త మెరుగ్గా బౌలింగ్‌ చేసిన అతడు తర్వాతి మూడు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చాడు.
4
టీ20ల్లో రోహిత్‌ శతకాలు. మరెవరూ అన్ని సెంచరీలు సాధించలేదు. కొలిన్‌ మన్రో (3) రెండో స్థానంలో ఉన్నాడు
2537
టీ20ల్లో రోహిత్‌ శర్మ పరుగులు. అత్యధిక పరుగుల రికార్డు అతడిదే. కోహ్లి (2450) అతడి తర్వాత ఉన్నాడు
22
టీ20ల్లో రోహిత్‌ 50+ స్కోర్లు. కోహ్లి (22) అతడితో సమానంగా ఉన్నాడు రోహిత్‌ సిక్సర్లు. టీ20ల్లో  సిక్సర్ల రికార్డు అతడిదే
115
షోయబ్‌ మాలిక్‌ (111) తర్వాత వంద టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌ రోహిత్‌ 
1996
భారత టీ20 విజయాల్లో రోహిత్‌ పరుగులు. ఈ ఘనతలో నం.1 అతడే. కోహ్లి (1672) రెండో స్థానంలో ఉన్నాడు. 

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌ దాస్‌ రనౌట్‌ 29; నయీమ్‌ (సి) అయ్యర్‌ (బి) సుందర్‌ 36; సౌమ్య సర్కార్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) చాహల్‌ 30; ముష్ఫికర్‌ (సి) కృనాల్‌ (బి) చాహల్‌ 4; మహ్మదుల్లా (సి) దూబె (బి) చాహర్‌ 30; అఫిఫ్‌ హుస్సేన్‌ (సి) రోహిత్‌ (బి) ఖలీల్‌ 6; మొసాదెక్‌ హుస్సేన్‌ నాటౌట్‌ 7; అమినుల్‌ ఇస్లామ్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 153
వికెట్ల పతనం: 1-60, 2-83, 3-97, 4-103, 5-128, 6-142
బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-25-1; ఖలీల్‌ 4-0-44-1; వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-25-1; చాహల్‌ 4-0-28-2; శివమ్‌ దూబె 2-0-12-0; కృనాల్‌ పాండ్య 2-0-17-0.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌శర్మ (సి) మిథున్‌ (బి) అమినుల్‌ 85; ధావన్‌ (బి) అమినుల్‌ 31; రాహుల్‌ నాటౌట్‌ 8; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 24; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (15.4 ఓవర్లలో 2 వికెట్లకు) 154
వికెట్ల పతనం: 1-118, 2-125
బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ 3.4-0-35-0; షఫియుల్‌ ఇస్లాం 2-0-23-0; అల్‌ అమిన్‌ 4-0-32-0; అమినుల్‌ ఇస్లాం 4-0-29-2; అఫిఫ్‌ హుస్సేన్‌ 1-0-13-0; మొసాదెక్‌ 1-0-21-0


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.