Singareniలో కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్లు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Singareniలో కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్లు

మరో నాలుగు చోట్ల ఏర్పాటు
4, 5 వారాల్లో పూర్తికి చర్యలు
వెంటిలేటర్లు, పరికరాల కొనుగోలుకు రూ.3.15 కోట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, గోదావరిఖని: సింగరేణిలో నాలుగు ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ.2 కోట్లు కేటాయించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా అధికారులు రూ.3.15 కోట్ల వ్యయంతో వెంటిలేటర్లు, వైద్య పరికరాలు కొనుగోలు చేయనున్నారు. సింగరేణి పరిధిలో భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రి, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి, మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని ఆసుపత్రి, కుమురంభీం జిల్లా బెల్లంపల్లిలోని ఆసుపత్రులలో ఆక్సిజన్‌ ప్లాంట్లను సిద్ధం చేయనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థలకు సింగరేణి సీఎండీ శ్రీధర్‌ వర్క్‌ ఆర్డర్లను అందజేశారు. మరో నాలుగయిదు వారాల్లో వీటిని పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కేంద్రాలు గంటకు 12 క్యుబిక్‌ మీటర్ల వంతున ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. రామగుండం ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేస్తున్న మరో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇది కూడా ఆరు వారాల్లో పూర్తవుతుంది.

25వేల మంది సింగరేణి కార్మికులకు టీకా
సంస్థ ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సకు అవసరమైన 310 పరికరాల కొనుగోలుకు రూ.3.15 కోట్లను సింగరేణి సీఎండీ శ్రీధర్‌ మంగళవారం విడుదల చేశారు. వాటిని తక్షణమే ఏరియా ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. సింగరేణి వ్యాప్తంగా కొవిడ్‌ వార్డులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో ఆక్సిజన్‌ కొరత లేకపోయినా, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా 110 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులతో ప్రత్యేక వైద్యసేవల కోసం ఒప్పందాలు చేసుకున్నామని పేర్కొన్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తిస్తూ ఇప్పటికే 25వేల మంది సింగరేణి కార్మికులకు టీకాలు వేశామని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఉత్పత్తి ఆగకుండా నిరంతర విద్యుత్‌
కేంద్ర మంత్రిత్వశాఖ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఆక్సిజన్‌ ప్లాంట్లలో ఉత్పత్తికి ఎలాంటి అవరోధం రాకుండా 24 గంటల విద్యుత్‌ సరఫరా అందించాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఆక్సిజన్‌ కొరతతో దేశవ్యాప్తంగా కొవిడ్‌ బాధితులు ప్రాణాపాయస్థితికి చేరుతోండటంతో కేంద్రం చేపట్టిన ఈ చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ, రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లతో కలిసి దేశంలోని అన్ని మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లకు అందుతున్న విద్యుత్‌ సరఫరాపై ఆడిట్‌ నిర్వహించింది. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. ఇది దేశంలో ప్రధానమైన 73 మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా అందించే బాధ్యతను చేపడుతుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు