Vaccine: టీకా ఉచితం

ప్రధానాంశాలు

Vaccine: టీకా ఉచితం

18 ఏళ్లు దాటిన వారందరి వ్యాక్సిన్‌ ఖర్చు కేంద్రానిదే
ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా అమలు
రాష్ట్రాలకు పైసా ఖర్చు లేకుండా 75% ఉచితంగా సరఫరా
25% మాత్రం ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తాం
పేదలకు నవంబరు వరకు ఉచిత రేషన్‌: ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేయించే బాధ్యత తనదేనని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలపై పైసా భారం పడదని తేల్చిచెప్పింది. ఈ నెల 21 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో టీకా విధానంపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు, సంధించిన ప్రశ్నలు, వివిధ రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెలువరించారు. సోమవారం సాయంత్రం ఆయన జాతినుద్దేశించి 32 నిమిషాలసేపు ప్రసంగించారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75 శాతాన్ని తామే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రాలు ఇక మీదట వ్యాక్సిన్ల కోసం పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఉచితంగా వద్దనుకొనేవారి కోసం 25% వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా అందించనున్నట్లు చెప్పారు. నిరుపేదలకు నవంబరు వరకు ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీచేయనున్నట్లు చెప్పారు.

వ్యాక్సిన్‌పై రాజకీయాలు బాధాకరం
దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై పరిశోధనలు ప్రారంభమైన నాటినుంచి కొందరు వదంతులు సృష్టించడం ఆందోళనకరం. వ్యాక్సిన్‌ తయారీదారులు నిరుత్సాహపడిపోవాలని, వారికి ఇబ్బందులు రావాలని కోరుకున్నారు. టీకా వచ్చిన తర్వాతా అనుమానాలను పెంచారు. ఇలాంటి వ్యాక్సిన్‌ రాజకీయాలన్నింటినీ దేశం చూసింది. ఇవి బాధాకరం. వదంతులు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకున్న అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మన నుంచి కరోనా ఇంకా పోలేదు. అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. మనం కరోనా యుద్ధంలో గెలుస్తాం.

వ్యాక్సిన్‌ మనకు సురక్షా కవచం
మాస్క్‌ ధరించడం, రెండు గజాల దూరం పాటించడం, ఇతర జాగ్రత్తలు తప్పనిసరి. ఈ పోరాటంలో వ్యాక్సిన్‌ మనకు సురక్షా కవచం. డిమాండ్‌ని తీర్చేంత స్థాయిలో వ్యాక్సిన్‌ తయారుచేసే దేశాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. నీతి, నియమంలో స్పష్టత, నిరంతర పరిశ్రమ ఉంటే దేనికైనా పరిష్కారం లభిస్తుంది. దానివల్లే భారత్‌ ఒక్క ఏడాదిలోనే రెండు మేడిన్‌ ఇండియా వ్యాక్సిన్లు రూపొందించింది. శాస్త్రవేత్తల పరిశోధన ప్రారంభమైన వెంటనే లాజిస్టిక్‌, ఇతరత్రా సన్నద్ధతలు ప్రారంభించాం. సంస్థలకు అన్నివిధాలా సహకరించాం. పరిశోధనలకు ఆర్థికసాయం అందించాం. దేశంలో ఇప్పుడు ఏడు కంపెనీల ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ తయారీ విభిన్న స్థాయిల్లో ఉంది. డిసెంబరు నాటికి మొత్తం 187 కోట్ల డోసుల వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి. లభ్యతను పెంచడానికి విదేశాల నుంచి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశాం. పిల్లల కోసం రెండు టీకాల ట్రయల్స్‌ వేగం పుంజుకున్నాయి. నాసల్‌ వ్యాక్సిన్‌పైనా పరిశోధన జరుగుతోంది’’ అని మోదీ వివరించారు.

ముఖ్యమంత్రుల హర్షం
ప్రధాని ప్రకటనను పలు రాష్ట్రాలు, వివిధ వర్గాలు స్వాగతించాయి. ఇక అసమానతలు, తటపటాయింపులు తొలగిపోయి టీకాల కార్యక్రమం ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశాయి. ఇది సరైన నిర్ణయమని పార్టీలకు అతీతంగా పలు రాష్ట్రాల సీఎంలు హర్షం వెలిబుచ్చారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతోనే కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని కాంగ్రెస్‌ పేర్కొంది.

రాష్ట్రాలు కోరితేనే అప్పుడు మార్చాం

‘‘జనవరి 16 నుంచి మే 1 వరకు వ్యాక్సినేషన్‌ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగింది. అందరికీ టీకాలు ఉచితంగా అందించాం. చాలా రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌ను వికేంద్రీకరించాలని కోరాయి. ఏ వయసు వారికి వ్యాక్సిన్‌ అందించాలన్నది కూడా కేంద్రమే నియంత్రిస్తుందా అని ప్రశ్నించాయి. తమ ప్రయత్నమేదో తాము చేసుకుంటామన్నాయి. దీంతో కేంద్రానికి అభ్యంతరం ఎందుకన్న ఉద్దేశంతో మార్చాం. వ్యాక్సిన్‌ లభ్యతలో ఉన్న ఇబ్బందులు, ప్రపంచవ్యాప్త పరిస్థితులు తెలిసివచ్చాక కొన్ని రాష్ట్రాలు మొదటి విధానమే మేలని చెప్పాయి. అందుకే పాత పద్ధతిలోనే కొనసాగించాలని నిర్ణయించాం.

సేవా రుసుం గరిష్ఠంగా రూ. 150

రాష్ట్రాలు అందించాల్సిన 25% వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కూడా కేంద్రమే చేపడుతుంది. మరో రెండు వారాల్లో దీన్ని ప్రారంభిస్తాం. ఈలోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తాయి. ఉచితంగా వద్దనుకునేవారి కోసం 25% వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తున్నాం. వారు వ్యాక్సిన్‌ గరిష్ఠ ధరపై రూ.150 మాత్రమే సేవా రుసుం తీసుకోవాలి. ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన’ ద్వారా 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్‌ను దీపావళి వరకు పెంచుతున్నాం.

-ప్రధాని మోదీ

మేం వచ్చాకే టీకాల్లో వేగం

త 50-60 ఏళ్ల చరిత్రను చూస్తే భారత్‌కు విదేశాల నుంచి వ్యాక్సిన్లు రావడానికి దశాబ్దాలు పట్టేది. 2014లో దేశ ప్రజలు మాకు అవకాశం కల్పించేటప్పటికి వ్యాక్సినేషన్‌ విస్తృతి 60% వరకే ఉండేది. దీనిని 100 శాతానికి చేర్చాలంటే ఈ లెక్కన మరో 40 ఏళ్లు పట్టేది. మేం ‘మిషన్‌ ఇంద్ర ధనుష్‌’ ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 5-6 ఏళ్లలోనే వ్యాక్సినేషన్‌ కవరేజిని 90%కి పెంచాం. పేదలు, పిల్లల గురించి ఆలోచించి 100% టీకా దిశగా వెళ్తున్నాం. మనం కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేయకపోయిఉంటే పరిస్థితులెలా ఉండేవో? రెండో ఉద్ధృతికి ముందే మనం ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వకపోతే ఏమయ్యేవారో ఆలోచించండి. వ్యాక్సిన్‌ తయారీ వేగాన్ని పెంచి, వ్యాక్సినేషన్‌ను మరింత విస్తృతం చేస్తాం. భారత్‌ రూపొందించిన టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌పై అంతటా చర్చ జరుగుతోంది.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని