ఆరునూరైనా దళితబంధు ఆగదు

ప్రధానాంశాలు

ఆరునూరైనా దళితబంధు ఆగదు

నన్ను చంపినా మోసం చేయను

విపక్షాల అరుపులను పట్టించుకోం

పాలమూరు, సీతారామ పూర్తయితే తెలంగాణ కశ్మీరమే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

మాజీమంత్రి పెద్దిరెడ్డి తెరాసలో చేరిక


మనిషి చంద్రుని మీదకు వెళ్లినా దళితులు కఠిన పేదరికంలో ఉండటం మంచిది కాదు. దళితబంధు విజయవంతానికి అందరూ మద్దతునివ్వాలి.. దళిత అభివృద్ధి శాఖలోనూ రైతుబీమా తరహాలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాం. గీత కార్మికులకు అండగా నిలిచాం. నాయీ బ్రాహ్మణులు, రజకులు, ఎంబీసీల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. సామాజిక వివక్షకు గురైన వారికి పకడ్బందీగా కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.


తల్లిదండ్రులను కాపాడుకోవాలి

తల్లిదండ్రులను సాకని వ్యక్తులు దేశాన్ని అభివృద్ధి చేస్తారా! ఆ మధ్య నేనొక పర్యటనకు వెళ్లినప్పుడు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు కలిశారు. పిల్లలు తమకు తిండిపెట్డడం లేదని ఫిర్యాదు చేశారు. నేను పీఆర్సీపై జరిగిన సమావేశంలో ఉద్యోగులతో ఈ విషయాన్ని ప్రస్తావించాను. వేతనాలు పెంచినందున కొంత తల్లిదండ్రుల కోసం ఖర్చు చేయాలని చెప్పాను. ఏదైనా కొనొచ్చు కానీ తల్లిదండ్రులను కొనలేమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


ఈనాడు, హైదరాబాద్‌: దళితబంధు పథకం మహాయజ్ఞమని, ఆరునూరైనా అది ఆగదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఎవరాపుతారో  తాను చూస్తానని పేర్కొన్నారు. ఒక్కసారి కేసీఆర్‌ చెప్పాడంటే అది జరిగి తీరుతుందన్నారు. దాన్ని దశల వారిగా.. మన ఆర్థిక పరిమితులను బట్టి ఏడాదికి రెండు నుంచి నాలుగు లక్షల కుటుంబాలను ఆదుకోవాలని ప్రణాళికలు రూపొందించామన్నారు. అందుకే దీనికి రూ. లక్ష కోట్లు అయినా ఖర్చు పెడతామని ప్రకటించానన్నారు. దళితబంధు అంటే బాంబు పడ్డట్లు ప్రతిపక్షాలు భయపడుతున్నాయని తెలిపారు. తనను చంపినాసరే.. అబద్ధాలు చెప్పి మోసం చేయనన్నారు. చేనేత కార్మికులకు ప్రకటించిన బీమా పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని, ఇప్పుడు తెలంగాణ సరైన దారికి చేరిందని, ఈ ప్రస్థానం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అన్నారు. మంచి, చెడు తెలిసిన ప్రజలే అన్నింటినీ కాపాడుకుంటారని తెలిపారు. ఏనుగు పోతుంటే చిన్నచిన్న జంతువులు అరిచినా పట్టించుకోవని, తాము కూడా చిల్లర అరుపులను పట్టించుకోబోమన్నారు. రాష్ట్రంలో ఆకలిచావులు, ఆత్మహత్యలు ఆగిపోయాయని, అనేక విషయాల్లో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రులే స్పష్టం చేస్తున్నారన్నారు. తెలంగాణ సంపదను పెంచేందుకు, దానిని పేదలకు పంచేందుకు తాము ప్రణాళికలు, పథకాలను తెస్తున్నామన్నారు. పాలమూరు- సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే  తెలంగాణ కశ్మీరం అవుతుందన్నారు. భాజపాకు రాజీనామా చేసిన మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం తెలంగాణభవన్‌లో తెరాసలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు.

ప్రజల అవసరాల మేరకే..

‘‘రాష్ట్రంలో ఎక్కడ ఏం అవసరముందో గుర్తించి వాటిని ప్రభుత్వమే సమకూరుస్తోంది. ఇప్పుడు తీసుకొచ్చిన పథకాలన్నీ ఎవరూ అడిగినవి కాదు. ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని ప్రభుత్వమే అమలు చేస్తోంది. దళితబంధు అలాంటి పథకమే. అనేక ఏళ్ల నుంచి దళితుల సంక్షేమానికి చర్యలు చేపట్టాం. దళితబంధు అనే కార్యక్రమానికి రూపం ఇచ్చాం. గత ఏడాదే దాన్ని అమలు చేయాల్సి ఉంది. కరోనా వల్ల ఆలస్యమైంది. బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. ఈ పథకాన్ని చూసి విపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కొందరు నాయకులు అదిరిపడుతున్నారు. అవాకులు చవాకులు పేలుతున్నారు. గారడీ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకుని అధికారంలోకి వచ్చి, దాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడాలి.

ఎమ్మెల్యేల జీతాలాపి పంచాయతీలకు నిధులు

ఎన్నో త్యాగాల తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. ప్రపంచంలోనే ఎక్కడా లేని కార్యక్రమాలు ఇక్కడ అమలవుతున్నాయి. పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా, ఆదర్శంగా నిలిచింది. ఎప్పుడూ రాజకీయాలు చేయొద్దు. ప్రజల సమస్యలపై మానవీయ కోణంలో ఆలోచిస్తే పథకాలు పూర్తిగా అమలవుతాయి. వట్టి మాటలు చెప్పడం మా ప్రభుత్వానికి చేతకాదు. ఎమ్మెల్యేల జీతాలు ఆపి అయినా పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా చేపట్టడానికి ఏడాది కాలం పట్టింది. అన్ని విధాలా కసరత్తు చేసి అమల్లోకి తెచ్చాం. ఇప్పుడు రైతు కుటుంబాలకు వారం, పది రోజుల్లోనే బీమా సొమ్ము వస్తోంది. ఇదే తరహాలో చేనేత కార్మికులకు బీమా కోసం సన్నాహాలు చేయాలి. త్వరలోనే వారికీ బీమా వస్తుంది. చేనేత కార్మికులకు ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.


మాటతప్పిన జానారెడ్డి

తెలంగాణలో 24 గంటలూ విద్యుత్‌ ఇస్తామని జానారెడ్డితో శాసనసభలో సవాల్‌ చేశాను. ఆయన నమ్మలేదు. అలా చేస్తే తెరాస కండువా కప్పుకుంటానని ఆయన చెప్పారు. కానీ మాట తప్పి మొన్న నాగార్జునసాగర్‌లో పోటీ చేశారు.


అభివృద్ధిలో భాగస్వామిగా పెద్దిరెడ్డి

పెద్దిరెడ్డి నాకు సన్నిహితుడు, ఇద్దరం కలిసి ఒకేసారి మంత్రులుగా పనిచేశాం. ప్రజాసంక్షేమంలో భాగస్వామ్యం కావడానికే ఆయన తెరాసలో చేరారు. రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో పెద్దిరెడ్డి భాగస్వామిగా, చేదోడువాదోడుగా ఉంటారు’’ అని సీఎం తెలిపారు. పెద్దిరెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేత సర్గం రవి, ఇతర నేతలు తెరాసలో చేరారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, పార్టీ నేతలు ఎల్‌.రమణ, కౌశిక్‌రెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్‌, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని