పోలీసు వ్యవస్థపై వ్యతిరేకతను పోగొట్టాలి

ప్రధానాంశాలు

పోలీసు వ్యవస్థపై వ్యతిరేకతను పోగొట్టాలి

ఆ బాధ్యత యువ అధికారులదే
   ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు ప్రధాని మోదీ హితవు
ఈనాడు, దిల్లీ


దేశంలో న్యాయబద్ధమైన వ్యవస్థను ఆటంకపరిచేవారిని అరికట్టడానికి పోలీసులు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ఎన్నో రోజులు ఇళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. పండుగపూట కూడా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కరోనా సమయంలోనూ గొప్ప పాత్ర పోషించారు. ఇన్ని త్యాగాలు చేసినా, పోలీసుల గురించిన ప్రస్తావన వస్తే మాత్రం ప్రజల మనోభావం మారిపోతుంది. పోలీసులంటే నకారాత్మక దృక్పథం పెరిగింది. అది మీకు పెద్ద సవాల్‌. వ్యవస్థ మిమ్మల్ని మారుస్తుందా? మీరు వ్యవస్థను మారుస్తారా? అన్నది మీ ఇచ్ఛాశక్తి, మనోబలంపై ఆధారపడి ఉంటుంది.

- ప్రధాని నరేంద్రమోదీ


పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఉన్న వ్యతిరేక దృక్పథాన్ని యువ అధికారులు మార్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దేశమే సర్వోన్నతం అనే భావనతో పనిచేయాలని సూచించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని సర్దార్‌వల్లభ్‌భాయ్‌ పోలీసు అకాడమీలో శిక్షణ పొందిన ప్రొబేషనరీ ఐపీఎస్‌ అధికారులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. దిల్లీ నుంచి జరిగిన ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా పాల్గొన్నారు. ‘పోలీసింగ్‌ను భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు మార్చాలంటే సామూహికంగా సంవేదనశీలతతో పనిచేయడం చాలా అవసరం.
కరోనా సమయంలో పోలీసులు చాలా గొప్ప పాత్ర పోషించారు. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఎక్కడ ప్రకృతివైపరీత్యాలు వచ్చినా ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. వారు ప్రాణాలకు తెగించి తమను రక్షిస్తారన్న భరోసా ప్రజల్లో ఏర్పడింది. ఎన్డీఆర్‌ఎఫ్‌లో చాలావరకు పోలీసులే ఉంటారు. కానీ ప్రజల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌పట్ల ఉన్న సద్భావన పోలీసులపై ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మీకు కూడా తెలుసు. కరోనా కాలంలో నిర్భాగ్యులకు పోలీసులు చేసే సేవలను సామాజిక మాధ్యమాల్లో చూసి ప్రజల్లో కొంత సానుకూల దృక్పథం కలిగింది. కానీ మళ్లీ ఇప్పుడు పాత వాతావరణమే ఏర్పడింది.’ అని ప్రధాని పేర్కొన్నారు.

దేశ హితమే పరమార్థం కావాలి
మరో 25 ఏళ్లలో భారత్‌ శతవసంత స్వాతంత్య్రోత్సవాన్ని జరుపుకోనుంది. రాబోయే పాతికేళ్లలో మీరు దేశంలోని విభిన్న ప్రాంతాల్లో పనిచేయబోతున్నారు. ఆధునిక, సంవేదనాశీలవంతమైన పోలీసు వ్యవస్థను నిర్మించే పెద్ద బాధ్యత మీ అందరిపై ఉంది. రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం మారుతున్నందున పోలీసు వ్యవస్థను కొత్త సవాళ్లకు అనుగుణంగా సమాయత్తం చేయాలి. సైబర్‌ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయాలి. మీ ప్రవర్తనపై ఎప్పుడూ ఓ కన్ను ఉంటుంది. ఒత్తిళ్లు కూడా వస్తుంటాయి. సమాజంలోని ప్రతి పాత్ర గురించీ మీరు తెలుసుకోవాలి. స్నేహపూర్వకంగా ఉండాలి. విధినిర్వహణను, దేశహితాన్ని ఎప్పుడూ సర్వోన్నతంగా భావించాలి. ‘ఏక్‌భారత్‌... శ్రేష్ఠ్‌ భారత్‌’ ధ్వజవాహకులు మీరేనన్న విషయాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలి’ అని ప్రధాని ఆకాంక్షించారు.


సైబర్‌ నేరాల కట్టడికి ఏం చేస్తారు?
  ఏపీ కేడర్‌ ప్రొబేషనరీ ఐపీఎస్‌ కిశోర్‌కు ప్రధాని ప్రశ్న

రోజురోజుకీ పెరిగిపోతున్న సైబర్‌ నేరాలను అరికట్టడానికి ఏం చేస్తారు? అని ప్రొబేషనరీ ఐపీఎస్‌ అధికారి కొమ్మి ప్రతాప్‌ శివ కిశోర్‌ను ప్రధానిమోదీ ప్రశ్నించారు. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఫైనాన్షియల్‌, బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌లో బీటెక్‌, ఎంటెక్‌ పూర్తిచేసి, తర్వాత నాలుగేళ్లు బోస్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన అనంతరం ఐపీఎస్‌కు ఎంపికైన కిశోర్‌ది నెల్లూరు జిల్లా. ఏపీ కేడర్‌లో నియమితులైన ఆయనకు శనివారం ప్రధానితో మాట్లాడే అవకాశం వచ్చింది. మోదీ ప్రశ్నకు బదులిస్తూ... ‘సాంకేతికతను ఉపయోగించుకుంటే పోలీసు వ్యవస్థలో చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానవ వనరుల కొరత, సమర్థతకు సంబంధించిన సమస్యలకు చాలా మంచి పరిష్కారం చూపొచ్చు.  సైబర్‌ నేరాలపై ప్రజలకు మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తే అప్రమత్తమవుతారు.’ అని కిశోర్‌ వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని