తుపాకీ పాలనలోకి అఫ్గాన్‌

ప్రధానాంశాలు

తుపాకీ పాలనలోకి అఫ్గాన్‌

తాలిబన్‌ సర్కారు ఏర్పాటు నేడే
ప్రభుత్వాధినేతగా బరాదర్‌!
సుప్రీం లీడర్‌గా అఖుంద్‌జాదా

పెషావర్‌, కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో శనివారం నుంచి మళ్లీ తాలిబన్ల శకం మొదలుకాబోతోంది. రెండు దశాబ్దాల విరామం తర్వాత వారు మరోసారి సర్కారును ఏర్పాటుచేయనున్నారు. నూతన ప్రభుత్వ కూర్పుపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ఇరాన్‌ తరహా నాయకత్వం ఇక్కడ ఉండబోతోంది. తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు, ఆ ముఠా రాజకీయ విభాగాధిపతి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ సర్కారుకు నేతృత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను నూతన ప్రభుత్వాధినేతగా పేర్కొంటూ కాబుల్‌లో అఫ్గాన్‌ సమాచార, సాంస్కృతిక శాఖ ఇప్పటికే హోర్డింగులు ఏర్పాటుచేసింది. బరాదర్‌ పైస్థాయిలో.. దేశానికి సుప్రీం లీడర్‌గా మత గురువు ముల్లా హెబతుల్లా అఖుంద్‌జాదా వ్యవహరిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుతో పాటు కేబినెట్‌ కూర్పుపై సంప్రదింపులన్నీ పూర్తయ్యాయని ఇప్పటికే తాలిబన్లు స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రభుత్వాన్ని శుక్రవారమే ఏర్పాటుచేయాలని వారు తొలుత భావించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడిందని.. నూతన సర్కారును శనివారం ఏర్పాటుచేస్తామని ముఠా అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ తెలిపారు. తాలిబన్‌ కీలక నేతలు ముల్లా మొహమ్మద్‌ యాకూబ్‌, షేర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ స్థానెక్‌జాయ్‌లకు నూతన ప్రభుత్వంలో కీలక పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. తమ అగ్ర నేతలంతా ఇప్పటికే కాబుల్‌కు చేరుకున్నట్లు తాలిబన్‌ అధికారి ఒకరు తెలిపారు.

ఎవరీ బరాదర్‌?
తాలిబన్‌ సర్కారుకు బరాదర్‌ నేతృత్వం వహించడం దాదాపు ఖాయమవడంతో ఆయన పేరు మరోసారి వార్తల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. అఫ్గానిస్థాన్‌లో ఉర్జాన్‌ ప్రావిన్సులోని వీట్‌మాక్‌లో 1968లో బరాదర్‌ జన్మించారు. ముల్లా ఒమర్‌తో కలిసి సోవియట్‌ సేనలపై పోరాడారు. ఆ సేనలు వెనక్కి వెళ్లిపోయాక.. అఫ్గాన్‌లో అంతర్యుద్ధం తరహా పరిస్థితులు తలెత్తాయి. దీంతో ముల్లా ఒమర్‌, బరాదర్‌ సంయుక్తంగా తాలిబన్‌ ముఠాను స్థాపించారు. 1996-2001 మధ్య అఫ్గాన్‌లో తాలిబన్‌ సర్కారు ఉన్నప్పుడు.. హెరాత్‌, నిమ్రుజ్‌ ప్రావిన్సులకు గవర్నర్‌గా, పశ్చిమ అఫ్గాన్‌ కోర్‌ కమాండర్‌గా బరాదర్‌ వ్యవహరించారు. 2001లో అమెరికా దాడుల సమయంలో ముల్లా ఒమర్‌తో కలిసి పలాయనం చిత్తగించారు. 2010లో పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, అమెరికా నిఘా సంస్థ- ‘సీఐఏ’ అధికారులు బరాదర్‌ను కరాచీలో అదుపులోకి తీసుకున్నారు. 2018లో అమెరికా ఒత్తిడితో ఆయన్ను పాక్‌ విడుదల చేసింది. తర్వాత ఆయన కతర్‌ చేరుకొని.. తాలిబన్‌ రాజకీయ విభాగం బాధ్యతలు చేపట్టారు. అఫ్గాన్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించుకున్నాక.. ఆ దేశంతో చర్చల్లో కీలకంగా వ్యవహరించారు. 2020 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. బరాదర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అఫ్గాన్‌లో హింసను ఆపాలని కోరారు. దీంతో ఆయన పేరు అంతటా మార్మోగింది. తాలిబన్‌ ప్రతినిధిగా బరాదర్‌ వివిధ దేశాల నాయకులతో చర్చలు జరిపారు. ఇటీవల చైనాలో పర్యటించిన తాలిబన్‌ బృందానికి ఆయనే నేతృత్వం వహించారు.

భయం గుప్పిట్లో మీడియా
అఫ్గాన్‌ మళ్లీ తాలిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడి వార్తాసంస్థల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మీడియా స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారింది. దేశంలోని ఓ ప్రముఖ ప్రైవేటు టెలివిజన్‌ నెట్‌వర్క్‌ ఇప్పటికే తాలిబన్లకు భయపడి తమ ప్రసారాల్లో మార్పులు చేసింది. సంగీతం, సాహస కృత్యాల సంబంధిత కార్యక్రమాలను నిలిపివేసింది. వాటి స్థానంలో నిస్సార కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. కొన్ని వార్తాసంస్థలు ఇప్పటికీ మహిళా యాంకర్లను కొనసాగిస్తున్నప్పటికీ.. ఏ క్షణంలోనైనా వారి తొలగింపునకు ఆదేశాలు వెలువడొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించాక వందల మంది జర్నలిస్టులు దేశం విడిచి వెళ్లిన సంగతి గమనార్హం. మరోవైపు- అమెరికాకు చెందిన ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ ‘వెస్టర్న్‌ యూనియన్‌’ త్వరలోనే అఫ్గాన్‌లో కార్యకలాపాలను పునఃప్రారంభించనున్నట్లు తాలిబన్లు తెలిపారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో అఫ్గాన్‌లో కార్యకలాపాలను ఆ సంస్థ గత నెల 15 నుంచి నిలిపివేసిన సంగతి గమనార్హం.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని