13 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

ప్రధానాంశాలు

13 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

23 మంది హైకోర్టు జడ్జీల బదిలీలకు ఆమోదముద్ర

సుప్రీం కొలీజియం నిర్ణయాలు అధికారికంగా వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశంలోని 13 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించడంతోపాటు, మరో 23 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాలు అధికారికంగా వెలువడ్డాయి. ఈ నెల 16వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ ధనుంజయ్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన కొలీజియం సమావేశమై ఈ అంశాలపై నిర్ణయం తీసుకొంది. ఆ వివరాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మంగళవారం అధికారికంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో ఐదుగురిని బదిలీ చేయాలని, 8 మందికి ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని, 23 మంది న్యాయమూర్తులను విభిన్న హైకోర్టులకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించి, ఆ మేరకు కేంద్రానికి సిఫార్సులు పంపింది. ఈ జాబితాలో ఏపీ, తెలంగాణల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మల నియామకం; ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ గోస్వామి బదిలీ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్‌ ఎం.ఎస్‌.ఎస్‌.రామచంద్రరావును పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ను త్రిపుర హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా సిఫార్సు చేశారు. బాంబే హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచి నుంచి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, పట్నా హైకోర్టు నుంచి జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాలను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని ఇందులో సిఫార్సు చేశారు. సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ బాధ్యతలు స్వీకరించాక కొలీజియం ఇప్పటివరకు దాదాపు 100 మంది న్యాయమూర్తుల పేర్లను వివిధ నియామకాల నిమిత్తం సిఫార్సు చేసింది.


విద్యార్హతల ఆధారంగా పదోన్నతులు సబబే: సుప్రీం

దిల్లీ: ఒకే హోదాలో సమాన స్థాయిలో ఉన్న ఉద్యోగులను ఉన్నత విద్యార్హతల ప్రకారం వర్గీకరించి పదోన్నతులు కల్పించడం సరైన చర్యగానే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగ అధికరణలు 14, 16ల ఉల్లంఘనలుగా దీనిని పరిగణించలేమని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. విద్యార్హతల ఆధారిత వర్గీకరణ విషయంలో న్యాయస్థానాల జోక్యానికి అవకాశాలు పరిమితంగానే ఉంటాయని స్పష్టం చేసింది. డిప్లమో, డిగ్రీ అర్హతలతో సబ్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ ఉద్యోగాల్లో చేరిన వ్యక్తులకు పదోన్నతుల విషయంలో కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌(కేఎంసీ) విడివిడిగా నిబంధనలు రూపొందించింది. దీనిని డిప్లమో అర్హతలున్న వ్యక్తి కలకత్తా హైకోర్టులో సవాల్‌ చేయగా పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత సుప్రీంను ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు. పదోన్నతులు పొందే వ్యక్తికి అధిక నైపుణ్యాలు, అధిక విద్యార్హతలు ఉండాలని నిర్దేశించడం సహేతుకమైనదేనని, తప్పుపట్టాల్సింది ఏమీలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కలకత్తా హైకోర్టు తీర్పును సమర్థించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని