నేడు చైనా చెర నుంచి రానున్న అరుణాచల్‌ పౌరులు!

తాజా వార్తలు

Updated : 12/09/2020 10:28 IST

నేడు చైనా చెర నుంచి రానున్న అరుణాచల్‌ పౌరులు!

కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు వెల్లడి

ఇటానగర్‌: గత వారం భారత సరిహద్దుల వెంట ఉన్న అడవుల్లో అపహరణకు గురైన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అయిదుగురు వేటగాళ్లను చైనా నేడు భారత్‌కు అప్పగించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు తెలిపారు. సెప్టెంబరు 4న కనిపించకుండా పోయిన వారు తమ వద్దే ఉన్నారని డ్రాగన్‌ సైన్యం ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’(పీఎల్‌ఏ) మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వారిని భారత్‌కు అప్పగిస్తామని సమాచారం అందించినట్లు రిజుజు ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో నేడు ఏ సమయంలోనైనా వారు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.   

అరుణాచల్‌ ప్రదేశ్‌లో సుబన్‌సిరి జిల్లా కేంద్రం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచో ప్రాంతంలో కొందరు వేటకు అడవిలోకి వెళ్లారు. అలా వెళ్లిన వారిలో ఐదుగురిని చైనా బలగాలు అపహరించాయి. అదే బృందంలో ఉన్న ఇద్దరు తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు ఆర్మీ అధికారులను కలిశారు.

తొలుత కిడ్నాప్‌పై భారత్‌ ఆందోళనలను చైనా ఏమాత్రం పట్టించుకోలేదు. వేటగాళ్ల అపహరణ అంశం తమ దృష్టికే రాలేదన్న ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ.. డ్రాగన్‌ ప్రభుత్వం అరుణాచల్‌ప్రదేశ్‌ను గుర్తించటంలేదని తెలిపారు. అది తమ దక్షిణ టిబెట్‌ అని వితండవాదం చేశారు. మరోవైపు సెప్టెంబరు 2న దారితప్పిపోయి భారత్‌లోకి వచ్చిన చైనా పౌరుల పట్ల భారత సైన్యం ఎంతో ఉదారంగా వ్యవహరించింది. వారికి దుప్పట్లు, ఆహారం ఇచ్చి తిరిగి చైనా వైపు చేరుకునేందుకు సహాయం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని