2021 ప్రారంభానికి కోట్లల్లో వ్యాక్సిన్‌ డోసులు!: ఫౌచీ

తాజా వార్తలు

Updated : 06/08/2020 13:34 IST

2021 ప్రారంభానికి కోట్లల్లో వ్యాక్సిన్‌ డోసులు!: ఫౌచీ

వాషింగ్టన్‌: వచ్చే ఏడాది ప్రారంభానికి ఔషధ తయారీ సంస్థల వద్ద కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ డోసులు కోట్ల సంఖ్యలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని యూఎస్‌ వైద్య నిపుణుడు ఆంటోని ఫౌచీ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.  

ఫౌచీ మాట్లాడుతూ.. 2021 ప్రారంభానికి కోట్లల్లో వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉండొచ్చు. వ్యాక్సిన్‌ సహకారంతో కరోనా మహమ్మారిని కట్టడి చేయగలమని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘చరిత్రాత్మకంగా పరిమితమైన, అధికస్థాయి సామర్థ్యం కలిగిన వ్యాక్సిన్‌ లభించడం, సమర్థవంతమైన వైద్యసేవలు అందుబాటులో ఉంచడం ద్వారా ఈ వైరస్‌ను మనం కట్టడి చేయవచ్చు. అత్యధిక వేగంగా సంక్రమించే లక్షణం కారణంగా దాన్ని పూర్తిగా ఈ భూగ్రహం నుంచి పారదోలగలమని నేను భావించట్లేదు. వ్యాక్సిన్‌, తగిన వైద్య సేవల లభ్యతే దీన్ని అదుపులో ఉంచడానికి సహకరిస్తుందనుకుంటున్నాను. ఇప్పటికి ఇలా ఉన్నా, వచ్చే ఏడాదికి వ్యాక్సిన్‌ వస్తే వైరస్‌ ఇక మహమ్మారి కాజాలదు. ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేయలేదు’ అని సానుకూల వ్యాఖ్యలు చేశారు. కొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు ఉన్న తరుణంలో నవంబరు 3లోపు విజయవంతమైన వ్యాక్సిన్‌ను ప్రకటించాలని వైట్‌హౌస్‌ నుంచి తమకు ఎటువంటి ఒత్తిడి లేదని ఫౌచీ వెల్లడించారు. కాగా, అమెరికా వద్ద 2021 ప్రారంభానికి పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ డోసులు ఉంటాయని గత నెల ఆ దేశ ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి అలెక్స్‌ అజార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం కారణంగా కోటీ 89లక్షల పైచిలుకు ప్రజలకు సోకగా, 7,11,252 మంది మరణించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని