close

తాజా వార్తలు

Published : 30/11/2020 16:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతుల లబ్ధి కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు

పంట విక్రయాల్లో అన్నదాతలకు పూర్తి స్వేచ్ఛ

ప్రతిపక్షాల వదంతులు నమ్మొద్దు

వారణాసి సభలో ప్రధాని మోదీ

వారణాసి: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన వేళ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల లబ్ధి కోసమే చట్టాలను సవరించామని, రాబోయే రోజుల్లో ఆ ప్రయోజనాలను చూస్తారని అన్నదాతలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మోదీ మండిపడ్డారు. కొత్త చట్టాలపై విపక్షాలు కావాలనే వదంతులు సృష్టిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆక్షేపించారు. 

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ.. వ్యవసాయ చట్టంలో తీసుకొచ్చిన సంస్కరణలతో రైతులకు కొత్త అవకాశాలు రావడంతో పాటు న్యాయపరమైన భద్రత కూడా లభిస్తుందన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. వీటితో మార్కెట్లు ఏర్పాటు చేయడమే గాక, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. 

కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు తమ పంటలను ఉత్తమ ధరకు విక్రయించుకునే స్వేచ్ఛ ఉందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం.. రైతులకు 1.5రెట్లు ఎక్కువ మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక కిసాన్‌ రైళ్లు, మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రణాళికలతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు మన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలోనూ గిరాకీ లభిస్తోందన్నారు. 

మా ఉద్దేశం గంగానది అంత పవిత్రమైనది

‘దశాబ్దాలుగా అబద్ధపు హామీలు వినివినీ రైతులు ఇంకా ఆ భయంలోనే ఉన్నారు. కానీ గంగానది ఒడ్డున నిలబడి చెబుతున్నా.. మా ఉద్దేశం ఆ నదీమతల్లి అంత పవిత్రమైనది. రైతులను మభ్యపెట్టే ఉద్దేశం మాకు లేదు. అన్నదాతల శ్రేయస్సు కోసమే మేం పనిచేస్తున్నాం. వ్యవసాయంలో పాత వ్యవస్థే బాగుంది అని అనుకుంటే.. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు. కొత్త చట్టాలను అనుసరించమని మేం ఎవరినీ బలవంతపెట్టట్లేదు. కానీ అక్రమ దళారుల నుంచి రైతులను రక్షించేందుకే సంస్కరణలు తీసుకొచ్చాం’ అని మోదీ చెప్పుకొచ్చారు. గతంలో రుణమాఫీ ప్యాకేజీలు ప్రకటించేవారని, అయితే ఆ పథకం ప్రయోజనాలు రైతులకు చేరలేదని మోదీ అన్నారు. 

రైతు వ్యతిరేకులే వదంతులు సృష్టిస్తున్నారు

‘రైతులకు వ్యతిరేకంగా ఉండే కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై వదంతులు సృష్టిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని ప్రతిపక్షాలను మోదీ పరోక్షంగా దుయ్యబట్టారు. ‘రైతులను  నేను కోరేది ఒక్కటే. మా ప్రభుత్వం ట్రాక్ రికార్డు, పనితీరు చూడండి. అప్పుడు నిజమేంటో మీకు అర్థమవుతుంది’ అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనపై స్పందిస్తూ.. రైతులతో మాట్లాడుతున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని