కేరళ ప్రభుత్వ నిర్ణయం..సమాఖ్య సూత్రాలకే సవాల్‌!

తాజా వార్తలు

Published : 29/03/2021 01:22 IST

కేరళ ప్రభుత్వ నిర్ణయం..సమాఖ్య సూత్రాలకే సవాల్‌!

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌

తిరువనంతపురం: కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయవిచారణ జరపాలని కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికే ఒక సవాల్‌ అని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. తిరువనంతపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసును దర్యాప్తు చేస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై న్యాయ విచారణ చేపట్టాలని కేరళ కేబినెట్‌ నిర్ణయించింది. రాజ్యంగంలో ఉన్న సమాఖ్య సూత్రాలను కేరళ ప్రభుత్వం సవాల్‌ చేస్తున్నట్లే’ అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. భాజపా చేస్తోన్న ఈ విమర్శలను అధికార పక్షం తిప్పికొడుతోంది. తాజాగా రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై స్పందించిన సీపీఎం సీనియర్‌ నేత సీతారాం ఏచూరి, కేంద్ర ప్రభుత్వమే సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు.

ఇక, కేరళలో నమోదైన గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ జరపడాన్ని కేరళ ప్రభుత్వం మొదటి నుంచీ తప్పుబడుతోంది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించడం సమస్యకు మరింత ఆజ్యం పోసింది. అప్పటినుంచి ఉద్దేశపూర్వకంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసును తప్పుదోవపట్టిస్తున్నాయని కేరళ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందుకే ఈడీ వ్యవహారంపై రిటైర్డ్‌ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని తాజాగా కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అక్కడి క్రైం బ్రాంచ్‌లో కొందరి ఈడీ అధికారులపైనా కేరళ ప్రభుత్వం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, కేరళలో ఏప్రిల్‌ 6వ తేదీన శాసనసభ ఎన్నికలు జరుగునున్నాయి. కేరళ అసెంబ్లీలో మొత్తం140 స్థానాలుండగా అక్కడ ఒకేదశలో ఎన్నికలు జరుగనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని