Modi: మన ‘శతకోటి’ ప్రయాణం.. ఆందోళన నుంచి భరోసా వరకు..!

తాజా వార్తలు

Updated : 22/10/2021 09:58 IST

Modi: మన ‘శతకోటి’ ప్రయాణం.. ఆందోళన నుంచి భరోసా వరకు..!

దిల్లీ: కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు భారత్‌ చేపట్టిన బృహత్తర టీకా కార్యక్రమం కీలక మైలురాయిని దాటింది. కేవలం తొమ్మిదంటే 9 నెలల్లోనే దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసి అరుదైన కీర్తి గడించింది. అయితే ‘శతకోటి’ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఎన్నో అవాంతరాలు, మరెన్నో సవాళ్లను దాటుకుని ఈ ఘనత చేరుకున్నాం. అందుకే ఈ ప్రయాణాన్ని ‘ఆందోళన నుంచి భరోసా’ వరకు అని అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. టీకా పంపిణీలో 100 కోట్ల మార్క్‌ను దాటిన సందర్భంగా ప్రధాని మోదీ ‘టీమిండియా - సవాళ్లకు లక్ష్యంతో సమాధానం’ అనే టైటిల్‌తో ఓ హిందీ పత్రికలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఆందోళన నుంచి భరోసా వరకు చేరుకున్న ఈ ప్రయాణంతో దేశం మరింత బలమైందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీకాలపై ఎన్ని అపోహలు సృష్టించినా, గందరగోళ పరిస్థితులు ఎదురైనా.. దేశ ప్రజల విశ్వాసంతోనే ఈ విజయం సాధించగలిగామన్నారు. ‘‘ఇది నాది అని ప్రతిఒక్కరూ అనుకున్నప్పుడు.. ఏదీ అసాధ్యం కాదు. దేశ ప్రజలందరికీ టీకాలు అందించాలన్న లక్ష్యంతో మన ఆరోగ్య కార్యకర్తలు ఎంతో శ్రమించారు. కొండలు ఎక్కి.. నదులు దాటారు. ప్రతికూల భౌగోళిక పరిస్థితులను అధిగమించారు. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు, యువత కలిసికట్టుగా పనిచేశారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో టీకాపై సంకోచాలు కాస్త తక్కువే ఎదురయ్యాయి’’ అని మోదీ రాసుకొచ్చారు.

‘‘దాదాపు 100 ఏళ్ల తర్వాత మానవాళి ఇంతటి ఘోరమైన మహమ్మారిని ఎదుర్కొంటోంది. కన్పించని శత్రువు వేగంగా పాకుతుంటే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితుల్లో పడిపోయాం. అలాంటి ఆందోళనల నుంచి బయటపడి టీకాలు తయారుచేసుకున్నాం. ఇప్పుడు 100 కోట్ల మైలురాయిని దాటుకుని మహమ్మారి నుంచి బయటపడగలమనే భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రయాణంతో మనం మరింత బలంగా మారాం. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. 

టీకాల సామర్థ్యంపై ఎన్నో అనుమానాలు ఎదురైనా కేవలం 9 నెలల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామని మోదీ అన్నారు. టీకా కార్యక్రమంలో ఎలాంటి వీఐపీ సంప్రదాయాలను తావు లేకుండా ప్రతి ఒక్కరికీ సమానంగా వ్యాక్సిన్‌ను అందజేయగలుగుతున్నామన్నారు. టీకాలు, ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసం కారణంగానే ఈ రోజు ఈ ఘనత సాధించామన్నారు. స్వదేశీ టీకాలపై ప్రజలు నమ్మకం ఉంచడం చాలా సంతోకరమైన విషయమన్నారు. ‘‘టీకా పంపిణీ ప్రారంభించిన తొలినాళ్లలో 130 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్లు ఇవ్వాలంటే 3-4 ఏళ్లు పడుతుందని కొందరు అన్నారు. అసలు టీకాలు తీసుకోవడానికి ప్రజలు ముందుకురారని అన్నవాళ్లూ ఉన్నారు. వాటన్నింటికీ నేడు తగిన సమాధానం ఇచ్చాం’’ అని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని