దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు.. సీబీఐతో దర్యాప్తు  

తాజా వార్తలు

Published : 05/04/2021 12:47 IST

దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు.. సీబీఐతో దర్యాప్తు  

ఆదేశించిన బాంబే హైకోర్టు

ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ఫై ముంబయి మాజీ కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన సచిన్ వాజేకు దేశ్‌ముఖ్‌ ప్రతినెలా రూ.100కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టారంటూ పరమ్ బీర్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరపాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.  ఆయనతో పాటు న్యాయవాది జయశ్రీ పాటిల్‌, మరో టీచర్‌ కూడా ఈ ఆరోపణలపై పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ మూడు పిటిషన్లపై నేడు విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. ‘‘హోంమంత్రిపై ఇలాంటి ఆరోపణలు రావడం అసాధారణం.. అనూహ్యం. ఈ కేసులో స్వతంత్ర విచారణ అవసరం. దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ 15 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలి. దర్యాప్తులో ఆధారాలు లభిస్తే ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయాలి’’ అని పేర్కొంది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీసు అధికారి సచిన్‌వాజే అరెస్టు తర్వాత పరమ్‌వీర్‌ను హోంగార్డ్ డీజీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే బదిలీ అనంతరం మాజీ కమిషనర్‌ సంచలన ఆరోపణలు చేశారు. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రతి నెలా రూ.100కోట్ల వసూళ్లను వాజేకు లక్ష్యంగా పెట్టారంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాశారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ముందు హైకోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

ఎన్‌ఐఏ చేతికి ‘లంచాల’ పత్రాలు

మరోవైపు పేలుడు పదార్థాల వాహనం కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల దక్షిణ ముంబయిలోని ఓ క్లబ్‌లో జరిపిన సోదాల్లో ఎన్‌ఐఏ కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఓ పత్రాల్లో ఆ క్లబ్‌ నెలవారీగా ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన సొమ్ము వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఇతర అధికారులకు ఇచ్చిన లంచాలు, వారి పేర్లతో సహా ఉన్నట్లు సమాచారం. వీటిని దర్యాప్తు సంస్థ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ కేసులో వాజే కస్టడీని ఏప్రిల్‌ 7 వరకు పొడగించిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని