పటిష్ఠ పహారాలో అమెరికా!
close

తాజా వార్తలు

Updated : 18/01/2021 13:10 IST

పటిష్ఠ పహారాలో అమెరికా!

భద్రతా బలగాల్లో అంతర్గత దాడుల కలకలం!

వాషింగ్టన్‌: అమెరికాలో కొత్త అధ్యక్షుడు కొలువుదీరే సమయం సమీపించింది. ఈ తరుణంలో రాజధాని వాషింగ్టన్​ డి.సి ప్రాంతం.. పూర్తిగా మిలిటరీ జోన్‌ను తలపిస్తోంది. అమెరికా చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిరసనలు చెలరేగే అవకాశమున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటి వరకు బయట వ్యక్తుల నుంచి ముప్పు ఉందని భావించిన భద్రతా బలగాలు.. తాజాగా ఎఫ్‌బీఐ నుంచి వచ్చిన హెచ్చరికతో మరింత ఆందోళనకు గురవుతున్నాయి. భద్రతా బలగాల్లోని వారే నిరసనలకు ఉసిగొల్పే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దళాల్లో ప్రతి సభ్యుడు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వాషింగ్టన్‌లోని క్యాపిటల్​ భవనం సహా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ భారీ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇనుప కంచెలను బిగించారు. స్థానిక పోలీసులతో సహా ఇప్పటికే 25,000 మందితో కూడిన నేషనల్​ గార్డ్స్‌ దళం క్యాపిటల్‌ భవనం చుట్టూ పహారా కాస్తోంది. బైడెన్​ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే ప్రమాదం ఉందని అమెరికా అత్యన్నత దర్యాప్తు సంస్థ ఎఫ్​బీఐ హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వాషింగ్టన్​ సీక్రెట్​ సర్వీస్ ​స్పెషల్‌ ఏజెంట్​ ఇన్‌ఛార్జి మాథ్యూ మిల్లర్​ పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో ఈ తరహా భద్రతా ఏర్పాట్లు ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు. మరోవైపు ఆదివారం దేశవ్యాప్తంగా అనేకచోట్ల నిరసనకారులు కనిపించడం కలకలం రేకెత్తించింది. రాష్ట్రాల్లోని క్యాపిటల్‌ భవనాల వద్ద తుపాకులు, అమెరికా జెండాలు చేతబూని కొంతమంది నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అనేక రాష్ట్రాల గవర్నర్లు ప్రకటించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కులను తాము గౌరవిస్తామని వెల్లడించారు. అయితే, హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు న్యూయార్క్‌ నగరంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యా తమ ఔట్‌లెట్‌లను మూసివేస్తున్నట్లు స్టార్‌బక్స్‌ ప్రకటించింది.

ఇవీ చదవండి..

ఆ రకంగానూ ట్రంప్‌ది రికార్డే

భారతీయులకు బైడెన్‌ పెద్దపీట!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని