icon icon icon
icon icon icon

పద్మావతమ్మా.. పక్షపాతమేంటమ్మా?

గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న ఆర్డీఓ పద్మావతి వైకాపా అనుకూల నిర్ణయాలతో వివాదాస్పదమవుతున్నారు.

Updated : 27 Apr 2024 08:02 IST

గుడివాడ రిటర్నింగ్ అధికారి వివాదాస్పద నిర్ణయాలు

వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు

ఎన్నికల నిష్పక్షపాత నిర్వహణ అనుమానమే

ఈనాడు, అమరావతి: గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న ఆర్డీఓ పద్మావతి వైకాపా అనుకూల నిర్ణయాలతో వివాదాస్పదమవుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేనే ఆమెకు గుడివాడలో ఆర్డీఓగా పోస్టింగ్‌ ఇప్పించారని.. అక్కడే రిటర్నింగ్‌ అధికారిగా కొనసాగుతుండటంతో స్వామి భక్తి ప్రదర్శిస్తూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  ఇలాంటి అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో కీలకమైన గుడివాడ నియోజకవర్గం వివాదాలకు చిరునామా. అధికార పార్టీ నేతల దారుణాలూ అధికమే. అక్కడి ప్రజాప్రతినిధి క్యాసినోలకు అవకాశమిస్తే.. గంజాయి బ్యాచ్‌కు పోలీసులు మద్దతుగా నిలుస్తున్నారు. గుడివాడలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నా.. అధికారులు కళ్లకు గంతలు కట్టుకుంటారనేది బహిరంగంగా జరిగే చర్చ. అలాంటిచోట ఇప్పుడు ఆర్వో నిర్ణయాలూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటున్నాయనేది తెదేపా వాదన.


పోస్టింగ్‌ నుంచే మొదలు

  • గుడివాడ ఆర్డీఓగా పద్మావతి రెండేళ్ల కిందటే బాధ్యతలు చేపట్టారు. ఆమెకు ఆర్డీఓగా అదే తొలి పోస్టింగ్‌. ఎమ్మెల్యే కొడాలి నాని కావాలని ఆమెకు పోస్టింగు ఇప్పించారని ప్రచారం.
  • గుడివాడలో మట్టి తవ్వకాలు, భూకబ్జాలపై పలు ఫిర్యాదులు వచ్చినా ఆర్డీఓ చర్యలు తీసుకోలేదు. నందివాడ, గుడివాడ మండలాల్లో ఇష్టానుసారం తవ్వకాలు జరిగాయి. నందివాడలో ఓ వ్యక్తి సీఎం బామ్మర్దినని చెబుతూ దాదాపు వంద ఎకరాలు ఆక్రమించి, చెరువులు తవ్వి లీజుకు ఇచ్చారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చినా, కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లినా ఆర్డీఓ స్పందించలేదు.
  • హైదరాబాద్‌లో ఉంటున్న నందివాడకు చెందిన మహిళ భూమిని ఇటీవల మరో వ్యక్తికి అక్రమంగా రిజిస్టర్‌ చేశారు. దీనిపై ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా.. కనీసం విచారణ నిర్వహించలేదు.
  • ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఎమ్మెల్యేతో ఆర్డీఓ ఫోన్‌లో మాట్లాడిన తీరు చర్చకు దారితీసింది. కలెక్టర్‌ను నువ్వే బదిలీ చేయించావుగా అని ఎమ్మెల్యే ఆర్డీఓతో మాట్లాడటం, అవన్నీ ఫోన్‌లో వద్దని ఆమె వారించడం, పాత తేదీలతో పట్టాలు ఇవ్వచ్చుగా అని ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో రికార్డు వెలుగులోకి వచ్చింది.
  • ఏలూరులో నివాసం ఉంటున్న ఆర్డీఓ అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తారు. కార్యాలయంలో అందుబాటులో ఉండరు. ఎమ్మెల్యే ఫోన్‌కు తప్ప ఇతరులు కాల్‌ చేసినా స్పందించరు. వైకాపా నేతలను తప్ప సాధారణ ఫిర్యాదుదారులను కలవరని విమర్శలున్నాయి.
  • గుడివాడలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి భూసేకరణ పరిహారంలో తెదేపా సానుభూతిపరులకు ఓ లెక్క, వైకాపా వారికి ఓ లెక్క వర్తింపజేశారని ఫిర్యాదులు వచ్చాయి.
  • ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక గుడివాడలో ‘మేమంతా సిద్ధం’ పోస్టర్లు భారీగా వెలిసినా వాటిని తొలగించలేదు. ఇవి పత్రికల్లో వచ్చాక తొలగించి, పత్రికల్లో వచ్చిన చిత్రాలు పాతవి అని కలెక్టర్‌కు నివేదిక పంపారు. గుడివాడలో చాలా ప్రాంతాల్లో వైకాపా అనుకూల ప్రచార చిత్రాలను తొలగించలేదు.

ఇదేం న్యాయం?

  • కొడాలి వెంకటేశ్వరావు అనే దివ్యాంగ దళితుడు నామినేషన్‌ వేసేందుకు వస్తే ఆయనపై ఆర్డీఓ దురుసుగా ప్రవర్తించారు. ఎందుకు వచ్చారు, ఇక్కడి నుంచి వెళ్లకుంటే క్రిమినల్‌ కేసులు పెడతానని హెచ్చరించారు. కొడాలి వెంకటేశ్వరరావు పేరున్న వ్యక్తి నామినేషన్‌ వేస్తే అదే పేరున్న ఎమ్మెల్యేకు ఇబ్బంది అవుతుందేమోనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తర్వాత మీడియా, లాయర్లు ఉండటంతో అనుమతించి నామినేషన్‌ తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్‌) ఆర్డీఓను వివరణ కూడా అడగకపోవడంపై దళిత సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
  • వైకాపా అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌లో గుడివాడ మున్సిపాలిటీ నుంచి అద్దెకు తీసుకున్న భవనం వివరాలను పొందుపర్చలేదు. దీనిపై ఆధారాలతో తెదేపా ఫిర్యాదు చేస్తే.. తాను నామినేషన్‌ అనుమతించాననీ, ఆమోదించానని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img