సచిన్ వాజే‌ తీరు అంతా అనుమానాస్పదం..!
close

తాజా వార్తలు

Updated : 16/03/2021 16:21 IST

సచిన్ వాజే‌ తీరు అంతా అనుమానాస్పదం..!

నివాస ప్రాంగణ కెమేరా డీవీఆర్‌ మాయం

ఇంటర్నెట్‌డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి బెదిరింపుల కేసులో అరెస్టయిన సచిన్‌ వాజే తీరు అత్యంత అనుమానాస్పదంగా మారింది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు సచిన్‌ వాజే నివసించే గృహ సముదాయం సీసీ కెమేరా ఫుటేజీ, ఆ రికార్డులు ఉండే డీవీఆర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ దృష్టిసారించింది. అంబానీకి బెదిరింపులు వచ్చిన రెండురోజుల్లోనే ఈ కేసు దర్యాప్తు కోసమంటూ సచిన్‌ నివాసం ఉన్న గృహసముదాయం సీసీకెమేరా ఫుటేజీలు ఉన్న డీవీఆర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వారు కూడా సచిన్‌ వాజే బృందంలోని సభ్యులు కావడం జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానాలను పెంచేసింది.

మన్‌సుఖ్‌ హిరేన్‌ కుటుంబసభ్యులు సచిన్‌ వాజేపై ఆరోపణలు చేయడంతో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. మన్‌సుక్‌ను గుర్తించిన చివరి లొకేషన్‌ వంటి వివరాలు ముంబయి క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వాజేపై అనుమానాలు పుట్టించేవిగా ఉన్నాయి. ఈ కేసును చేపట్టిన ఎన్‌ఐఏకు ఓ లేఖ దొరికింది. ఫిబ్రవరి 25న అంబానీ ఇంటిదగ్గర పేలుడు పదార్థాల వాహనం వెలుగులోకి వచ్చిన తర్వాత రెండు రోజులకే ఈ లేఖను రాసినట్లు తేలింది. ఇది సచిన్‌ వాజే నివసించే రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ ‌సెక్యూరిటీ విభాగానికి క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ( వాజే నేతృత్వం వహిస్తున్న విభాగమే) పోలీస్‌ అధికారి రియాజ్‌ ఖ్వాజీ ఓ చిత్తుకాగితంపై ఈ లేఖను రాశారు. అప్పుడు మొత్తం నలుగురు అధికారులు అక్కడకు వెళ్లారు. అంబానీకి బెదిరింపుల కేసును దర్యాప్తు చేస్తున్నాం.. అందుకని ఈ గృహ సముదాయంలో ఉన్న రెండు డిజిటల్‌ వీడియో రికార్డ్లర్లను అప్పగించాలని వారు ఆ లేఖలో కోరారు. ఈ లేఖను సెక్యూరిటీ సిబ్బంది, గృహసముదాయ సంఘ ఛైర్మన్‌కు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి రెండు డీవీఆర్‌లు తీసుకొని వెళ్లిపోయారు.

ఈ లేఖ దొరికాక ఎన్‌ఐఏకు మరికొన్ని కొత్త అనుమానాలు వచ్చాయి. అపహరణకు గురైన మన్‌సుక్‌ ఎస్‌యూవీని ఫిబ్రవరి 25వరకు ఆ రెసిడెన్షియల్‌ కాంపౌండ్‌లోనే ఉంచినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రియాజ్‌ ఖ్వాజీని ఎన్‌ఐఏ ప్రశ్నిస్తోంది.

ఎన్‌ఐఏ సచిన్‌ను గతవారం అదుపులోకి తీసుకొని కొన్ని గంటలపాటు ప్రశ్నించింది. ఆ తర్వాత అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 14వ తేదీన కోర్టు ముందు ప్రవేశపెట్టింది. న్యాయస్థానం ఈ నెల 25 తేదీ వరకు ఎన్‌ఐఏ కస్టడీ విధించింది. ఇక స్కార్పియో యజమాని శామ్‌ న్యూటన్‌ను కూడా ప్రశ్నించనుంది. వాస్తవానికి స్కార్పియో అసలు యజమాని శామ్‌ న్యూటన్‌. మన్‌సుక్‌ వద్ద దాదాపు లక్షల విలువైన కారు ఇంటీరియర్‌ పనిచేయించుకొని అతను డబ్బు ఇవ్వలేదు. దీంతో ఆ పాత కారును మన్‌సుఖ్‌కు వదిలేశాడు. తర్వాత మన్‌సుఖ్‌ నుంచి సచిన్‌ చేతికి వెళ్లింది. నిందితులు పేలుడు పదార్థాలున్న కారును అంబానీ ఇంటి సమీపంలో వదిలేసిన తర్వాత వాడిన ఇన్నోవా వాహనం క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌దిగా అనుమానిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని