Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో కొనసాగుతోన్న విధ్వంసం.. 20ఇళ్లకు నిప్పు

తాజా వార్తలు

Published : 18/10/2021 22:04 IST

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో కొనసాగుతోన్న విధ్వంసం.. 20ఇళ్లకు నిప్పు

ఆందోళన చేపట్టిన మైనార్టీ హిందువులు

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై ఛాందసవాదుల దాడులు, విధ్వంసం కొనసాగుతూనే ఉన్నాయి. దుర్గా మాత పూజల వేళ మొదలైన హింసాత్మక ఘటనలు మరింత పెరిగిపోయాయి. తాజాగా అక్కడి మైనార్టీ (హిందూ) వర్గానికి చెందిన 20ఇళ్లను కొందరు దుండగులు తగలబెట్టడమే కాకుండా మరో 66ఇళ్లను ధ్వంసం చేశారు. రంగ్పూర్‌ జిల్లాలోని పిర్‌గంజ్‌ ఉప్‌జిలాలో జరిగిన ఈ ఘటనలో దాదాపు వంద మందికిపైగా దుండగులు పాల్గొన్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. మత ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రధాని ప్రకటించిన తర్వాత కూడా ఈ దాడులు కొనసాగడం అక్కడి మైనారిటీ హిందువులకు ఆందోళన కలిగిస్తోంది.

బంగ్లాదేశ్‌లో దుర్గ పూజల వేళ ఆలయాలపై ఓ వర్గం వారు జరిపిన దాడులు తీవ్ర హింసకు దారితీస్తున్నాయి. గతవారం నోవాఖలి ప్రాంతంలోని ఓ ఆలయంపై గుంపుగా వచ్చిన వ్యక్తులు దాడికి తెగబడటంతో ఆలయ కమిటీ సభ్యుడు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మూడు రోజుల్లోనే దాదాపు 70పూజా మండపాలపై దాడులు జరిగినట్లు బంగ్లాదేశ్‌లోని హిందూ-బుద్ధిస్ట్‌-క్రిస్టియన్‌ యూనిటీ కౌన్సిల్‌ పేర్కొంది. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు హిందువులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఇలా ఆలయాలపై ఛాందసవాదుల దాడులకు పాల్పడడమే కాకుండా పోలీసులపైనా ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

అయితే, బంగ్లాదేశ్‌లో మత ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా హామీ ఇచ్చారు. దుండగులు ఏ వర్గానికి చెందినవారైనా వదిలిపెట్టేది లేదన్నారు. ఈ ఘటనకు కారణమైన ప్రతిఒక్కరినీ సాంకేతికత సాయంతో వీలైనంత త్వరగా పట్టుకొని తీరతామని  ప్రకటించారు. అయినప్పటికీ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మైనార్టీ వర్గం ఇళ్లు, వాహనాలను తగులబెట్టే ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు. వీటిపై అక్కడి మైనార్టీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని