close
Array ( ) 1

తాజా వార్తలు

మహిళా అధికారుల గొంతుగా ఐశ్వర్య..

 పర్మినెంట్‌ కమిషన్‌ కేసును వాదించిన న్యాయకోవిదురాలు


ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

మహిళలు సైన్యంలో తమను తాము నిరూపించుకొనే అవకాశం దాదాపు పదేళ్ల న్యాయ పోరాటం తర్వాత సాధించుకొన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు మహిళలకు పర్మినెంట్‌ కమిషన్‌ పొందే అవకాశం కల్పించాలని చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. మహిళా అధికారులకు అనుకూలంగా ఈ తీర్పు రావడం వెనుక ఒక ప్రతిభావంతురాలి కృషి ఉంది. ఆమే ఐశ్వరా భాటి. న్యాయ విద్యలో బంగారు పతక గ్రహీత కూడ. న్యాయస్థానంలో మరో లాయర్‌ మీనాక్షి లేఖితో కలిసి ఆమె ఈకేసును వాదించారు. తాజాగా వచ్చిన తీర్పుతో మహిళలు ఆయా విభాగాల్లో కమాండ్‌ హోదా పొందేందుకు పోటీపడే అవకాశం కూడా లభించింది. దాదాపు 2003 నుంచి మొదలైన ఈ న్యాయ పోరాటంలో మహిళలు ఎక్కడా తగ్గలేదు.  ఫలితంగా వారు సైన్యంలో శాశ్వత ఉద్యోగాలు పొందేందుకు అవకాశం లభించింది. ఒకప్పుడు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 14ఏళ్లు ఉద్యోగం చేసి సైన్యం నుంచి బయటకు వచ్చాక మరో ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి  ఉండేది. కానీ తాజాగా వచ్చిన తీర్పు అమలైతే.. పర్మినెంట్‌ కమిషన్‌కు మానసికంగా.. శారీరకంగా సిద్ధమై అవకాశాలను అందిపుచ్చుకొని శాశ్వత ఉద్యోగం పొందవచ్చు.   

మహిళా అధికారుల తరఫున వాదించిన దిట్ట..

‘‘లక్ష్య శుద్ధి ఉంటేనే.. గమ్యాన్ని చేరుకోగలం.. ఎగరడానికి రెక్కలు ఒక్కటే సరిపోవు.. తగిన సాహసం కూడా ఉండాలి’’.. ఇవి ప్రముఖ న్యాయవాది ఐశ్వర్యా భాటి సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చెప్పిన మాటలు. ఆమె పేరు సుప్రీంకోర్టులో తరచూ మార్మోగిపోతుంటుంది. న్యాయవాద వృత్తిలో మహిళలు పెద్దగా రాణించలేరని ఎవరైనా అనుకుంటే గనుక ఈమె వాదించేటప్పుడు చూస్తే ఆ అపోహలు పటాపంచలైపోతాయి. భాటి మాటల్లోనే ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది.. నిర్మాణాత్మకంగా ఉండే ఆమె వాదనలకు ఎవరైనా ఫిదా అయిపోతారు.  అంతర్జాతీయ న్యాయ స్థానంలో కులభూషణ్‌ జాదవ్‌ కేసు వాదించే ప్యానల్‌లో కూడా భాటి సభ్యురాలు. సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టంపై అభ్యంతరం చెబుతూ దాఖలైన కేసులోనూ దళాల తరఫున ఆమే వాదించారు.

తాజాగా  మహిళా ఎస్‌ఎస్‌సీ అధికారులకు పీసీ(శాశ్వత కమిషన్‌) ఇవ్వాలంటూ దిల్లీ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై మహిళా అధికారులకు అనుకూలంగా వాదించారు. ఈ కేసులో మహిళా అధికారులకు అనుకూలంగా సుప్రీం తీర్పు వెలువరించింది. దీంతో సైనిక దళాల్లో నిర్దేశించిన విభాగాల్లో ‘కమాండ్‌ హోదా’ పోస్టుల్లో నియామకానికి వీలు కల్పించడం వల్ల పురుష అధికారుల తరహాలో మహిళా అధికారులూ కంపెనీ, బెటాలియన్‌ వంటి విభాగాలకు నాయకత్వం వహించడానికి వీలవుతుంది. 

ఐశ్వర్య చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకొన్నారు. జోధ్‌పూర్‌లో ఓ న్యాయవాదుల కుటుంబంలో ఆమె జన్మించారు. తండ్రి సుప్రీం కోర్టులో న్యాయవాది. సోదరుడు న్యాయమూర్తి. దీంతో ఐశ్వర్య కూడా న్యాయవిద్య వైపే మళ్లారు. దిల్లీ విశ్వవిద్యాలయంలో క్యాంపస్‌ లా సెంటర్‌ నిర్వహించిన ‘ఆల్‌ ఇండియా మూట్‌ కోర్ట్‌’ పోటీలో ‘బెస్ట్‌ స్టూడెంట్‌ అడ్వొకేట్‌’గా నిలిచారు.  జై నారాని వ్యాస్‌ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యలో బంగారు పతకం సాధించారు. 1999లో దిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్‌  ప్రారంభించారు.

సంప్రదాయ రాజ్‌పుత్‌ కుటుంబానికి చెందిన ఐశ్వర్యకు వివాహం తర్వాత కూడా అత్తింటి నుంచి ప్రోత్సాహం లభించింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసుకొంటూనే ప్రాక్టిస్‌ కొనసాగించారు. 20ఏళ్ల న్యాయవాద వృత్తిలో ఆమె ‘ఆధార్‌ చట్టబద్ధత’, వాయుసేనలో మహిళలకు సమానహక్కులు వంటి ప్రతిష్ఠాత్మక కేసులను వాదించారు. గతేడాది మార్చిలో సుప్రీం కోర్టు ఈమెను సీనియర్‌ అడ్వొకేట్‌గా ప్రమోట్‌ చేసింది. రాజస్థాన్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఈమే కావడం విశేషం. అప్పటికే 2017 నుంచి ఉత్తరప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ సెక్రటరీగా కూడా రెండు పర్యాయాలు పనిచేశారు.   ‘న్యాయవాద వృత్తిలో విజయాన్ని.. డబ్బుతో కొలవకూడదు. ప్రజల జీవితాల్లో వారు తెచ్చిన మార్పుతో కొలవాలి’ అంటారు ఐశ్వర్య.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.