‘ఎస్‌ బాస్’‌ అంటేనే చైనాలో..!

తాజా వార్తలు

Published : 01/04/2021 01:16 IST

‘ఎస్‌ బాస్’‌ అంటేనే చైనాలో..!

 కఠిన వైఖరి అవలంభిస్తున్న జిన్‌పింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను ఉక్కుపిడికిట బంధించేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమ దేశంలో వ్యాపారం చేయాలంటే అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉండాలని.. లేకపోతే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వ్యాపారం చేసే అంశాన్ని మర్చిపోవాలని సంకేతాలను ఇతర దేశాల కంపెనీలకు పంపిస్తోంది. గత కొన్ని వారాలుగా పలు కంపెనీలపై చైనా అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని వీగర్‌ ముస్లింల కష్టాలపై వ్యాఖ్యలు చేసిన రిటైల్‌ దిగ్గజం హెన్స్‌ అండ్‌ మ్యూర్టిజ్‌ ఏబీని బాయ్‌కాట్‌ చేయడం మొదలుపెట్టింది. అంతేకాదు యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ఓ బారిస్టర్స్‌ సంస్థపై కూడా ఆంక్షలు విధించింది. హాంకాంగ్‌ ఎన్నికల వ్యవస్థలో మార్పులు చేసి వీటో హక్కును బీజింగ్‌ దక్కించుకొంది. 
చాలా పశ్చిమ దేశాల కంపెనీలకు చైనాలో వ్యాపారం చేయడానికి హాంకాంగ్‌ అనువైన ప్రదేశంగా ఉంది.

మంచి కొనుగోలు శక్తి ఉన్న 140 కోట్ల మంది  వినియగదారులు చైనాలో ఉండటంతో పశ్చిమ దేశాల కంపెనీలకు అదొక ఆకర్షణీయమైన మార్కెట్‌గా ఉంది. కానీ, అక్కడ పనిచేయాలంటే పూర్తిగా చైనా చెప్పుచేతల్లో ఉండాల్సిందే. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ఎసెక్స్‌ కోర్ట్‌ ఛాంబర్స్‌ వెబ్‌సైట్‌లో వీగర్‌ ముస్లింలపై జరపుతున్న అత్యాచారాలపై ఓ ‘లీగల్‌ ఒపినీయన్‌’ కథనం పెట్టింది. దీంతో యూకే, ఎసెక్స్‌ సంస్థపై చైనా ఆంక్షలు విధించింది. దీంతో  ఎసెక్స్‌ సంస్థ ఆ లీగల్‌ ఒపినీయన్‌ కథనాన్ని తొలగించింది. దీనిపై చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ స్పందిస్తూ..‘‘పుకార్ల కట్టడికి చైనా ఆంక్షలు బలంగా పనిచేశాయి’’ అని పేర్కొంది. గత మంగళవారం చైనా మొత్తం మీద 10 మంది వ్యక్తులు, నాలుగు ఐరోపా సంస్థలపై ఆంక్షలు విధించింది.

కొన్ని నెలల క్రితం ప్రకటనలు తిరగదోడి..

గతేడాది మార్చిలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ చైనాలో వీగర్‌ ముస్లింలను బానిసలుగా మార్చడాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇక్కడి వీరితో తయారు చేయించిన ముడి పదార్థాలను 82 అంతర్జాతీయ సంస్థలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. హెచ్‌అండ్‌ఎం, డెల్‌, యాపిల్‌, అమెజాన్‌ నైకీ, యూనిక్విలో, విక్టోరియాస్‌ సీక్రెట్‌, జారా వంటి సంస్థలు ఉన్నట్లు పేర్కొంది. దీంతో హెచ్‌ అండ్‌ ఎం సంస్థ తాము బానిసల సాయంతో తయారు చేసిన వస్తువులను కొనబోమని గత సెప్టెంబర్‌లో ప్రకటించింది. దీంతోపాటు జారా,కెల్వన్‌ క్లెయిన్‌, టామీ హిల్‌ఫిగర్‌ వంటి పలు సంస్థలు ఇలాంటి ప్రకటనలే చేశాయి. దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు చైనాలో దీనిపై నిరసనలు మొదలయ్యాయి. హెచ్‌ అండ్‌ ఎంను వినియోగదారులు బాయ్‌కాట్‌ చేస్తున్నారు. ఆ సంస్థతో ఉన్న కాంట్రాక్టులను సెలబ్రిటీలు రద్దు చేసుకొంటున్నారు. దీనికి అక్కడి మీడియా, సోషల్‌ మీడియా ఆజ్యం పోస్తోంది.

గతంలో కూడా నేషనల్‌ బాస్కెట్‌బాల్‌  అసోసియేషన్‌కు చెందిన ఓ జట్టు ఎగ్జిక్యూటివ్‌ హాంకాంగ్‌ ఆందోళనలకు మద్దతుగా ట్వీట్‌ చేసింది. దీనిపై చైనా మండిపడింది. చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ సంస్థ ఎన్‌బీఏ మ్యాచ్‌లను ప్రసారం చేయడం ఏడాదిపాటు నిలిపివేసింది.

భవిష్యత్తులో హాంకాంగ్‌‌లో కూడా..

తాజాగా హాంకాంగ్‌ ఎన్నికల వ్యవస్థను మార్చడంతో చైనాకు భారీగా అధికారాలు దక్కాయి. ఇప్పటికే హాంకాంగ్‌లో చైనా అనుకూల నాయకురాలు కెర్రీ లామ్‌  ఓ ప్రకటన జారీ చేశారు. ఈ సరికొత్త మార్పులతో హాంకాంగ్‌ అతి రాజాకీయాలు తగ్గుతాయని పేర్కొన్నారు. తాజా మార్పులతో  హాంకాంగ్‌ చట్టసభలోని 70 స్థానాలను 90కి పెంచింది. వీటిల్లో 20 స్థానాలకు మాత్రమే ప్రజలు నేరుగా ఎన్నుకొనే అవకాశం కల్పించింది. మిగిలిన స్థానాల్లో చైనా కీలుబొమ్మలను కూర్చొబెట్టనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని