logo

టక్కరి దొంగ.. పోలీసులతోనే ఉపాధి పొంది మస్కా కొట్టి చోరీలు

అతను దొంగ..  సుమారు వందకుపైగా కేసుల్లో శిక్ష అనుభవించాడు.. మార్పు వచ్చినట్టు నటించాడు.. పోలీసులతోనే స్వయం ఉపాధి పొందాడు.. నిజంగా మార్పు రాలేదు.

Published : 05 May 2024 07:26 IST

సీసీ కెమెరాలో పాత నేరస్థుడు వెంకటరమణ

ఘట్ కేసర్‌, న్యూస్‌టుడే: అతను దొంగ..  సుమారు వందకుపైగా కేసుల్లో శిక్ష అనుభవించాడు.. మార్పు వచ్చినట్టు నటించాడు.. పోలీసులతోనే స్వయం ఉపాధి పొందాడు.. నిజంగా మార్పు రాలేదు. పైగా ఇంకా దొంగతనాలు చేయాలనే కోరిక పెరిగింది. గత మూడేళ్లుగా  చేస్తూ పోలీసులకు సవాలుగా మారాడు. పోచారం ఐటీకారిడార్‌   స్టేషన్‌ పరిధిలో ఇటీవల వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు, కాలనీవాసులకు కంటి మీద నిద్ర లేకుండా చేశాడు. గతనెల 29న ‘ఈనాడు’లో ‘తాళం వేసుందా.. సొమ్ముగోవిందా..!’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన పోలీసులు దొంగను పట్టు కోవడానికి ఐదు  బృందాలు ఏర్పాటు చేసి చివరకు  ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బీరప్పగడ్డలో నివాసం ఉంటున్న వెంకటరమణగా గుర్తించి పట్టుకున్నారు. గతంలో పదుల సంఖ్యలో చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. బయటకు వచ్చాక ఉపాధి లేకనే దొంగతనం చేశా..జీవనోపాధి కల్పించాలని కోరడంతో అప్పటి రాచకొండ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉప్పల్‌ ఠాణా పక్కన దాతల సాయంతో హోటల్‌ ఏర్పాటు చేయించి తానే ప్రారంభించారు. మూడేళ్ల పాటు హోటల్‌ నిర్వహించి.. తర్వాత కనిపించకుండా పోయాడు.

తప్పించుకునే ‘కళ’: మిర్యాలగూడ, కోదాడ, సిద్ధిపేట, పోచారం ఐటీకారిడార్‌, ఘట్‌కేసర్‌, తదితర పోలీసు స్టేషన్‌ పరిధిల్లో  చోరీలు చేస్తూనే ఉన్నాడు. టోపీ, మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించి, కుడికాలు కుంటుతూ (వికలాంగుడు కాదు) చోరీలు చేసేవాడు. అనుభవం ఉండటంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని