సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు

ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు.

Updated : 05 May 2024 06:17 IST

సామాజిక మాధ్యమాలే వేదికగా  ఓట్ల అభ్యర్థన
వాట్సాప్‌ గ్రూపులు.. ఆకట్టుకునే మీమ్స్‌తో  ప్రజలకు చేరువ
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే బంజారాహిల్స్‌

ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ ఖాతాల్లో ప్రచారం చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. పార్టీ పాటలతో పాటు, వాట్సాప్‌లో యువతను గ్రూపులుగా చేర్చి ప్రచారం హోరెత్తిస్తున్నారు.  పోలింగ్‌కు గట్టిగా పది రోజులు కూడా లేకపోవడంతో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్లల్లో పోటీలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం శ్రమిస్తున్నారు.


అందరికీ చేరేలా...

క్కో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా రాజకీయ పార్టీలు.. నియోజకవర్గ ముఖ్యనేతలతో కలిపి నియోజకవర్గానికి, డివిజన్ల వారీగా విడివిడిగా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని పార్టీలు బూత్‌ల వారీగా సైతం వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేశాయి. ఇక మహిళలు, యువత, ఆయా కుల, మత సంఘాలు ఎన్నికల ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు నిర్వహిస్తున్నాయి. బస్తీ, కాలనీ, డివిజన్‌ నేతలు సైతం తమకంటూ సొంతంగా గ్రూపులు ఏర్పాటు చేశారు. బరిలో ఉన్న ఒక్కో రాజకీయపార్టీ దాదాపు 1500-1700 వరకు గ్రూపులు ఏర్పాటు చేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు. వాటిలో నేతలు, కార్యకర్తలు చురుగ్గా ఉండేలా చూస్తున్నారు. కొంతమంది నేతలు తాము సొంతంగా 10 వరకు గ్రూపులను ఏర్పాటు చేసుకొని ప్రచారం చేస్తూ అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నమూ చేస్తున్నారు.  


కొత్త నినాదాలతో ఆకట్టుకునేలా

ప్రచారంలో కరపత్రాలు, కటౌట్‌లు, బ్యానర్లు, హోర్డింగ్‌లే కీలకం. వీటిల్లో వినియోగించే వ్యాఖ్యలు, నినాదాలు సుత్తి లేకుండా సూటిగా ప్రజల హృదయాలకు హత్తుకునేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నినాదాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి చేరేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపొందించి ప్రజల ముంగిటకు తెస్తున్నారు. అవతల పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ చేసే చిన్న చిన్న మీమ్స్‌  ఆలోచింపజేసేలా చేస్తున్నాయి. ఒక్కో పార్లమెంట్‌ నియోజక వర్గంలో 25-30 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో అందర్ని కలవడం కష్టమవడంతో స్మార్ట్‌గా ప్రచారం చేసి ఆకుట్టుకుంటున్నారు.

ఏఐ పరిజ్ఞానంతో రూపొందించిన రాజేంద్రనగర్‌ పరిసరాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని