ఆధునిక సీటీస్కాన్‌ 5-10 ఎక్స్‌రేలతోనే సమానం
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 04:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆధునిక సీటీస్కాన్‌ 5-10 ఎక్స్‌రేలతోనే సమానం

300-400 ఎక్స్‌రేలంత అనడం సరికాదు
గులేరియా ప్రకటనను ఖండించిన ఐఆర్‌ఐఏ

ఈనాడు, దిల్లీ: ఒక సీటీస్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానమని.. కొవిడ్‌పై అనుమానంతో అనవసరంగా పదేపదే సీటీస్కాన్‌ తీయించుకోవద్దంటూ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఇటీవల చేసిన ప్రకటనపై భారత రేడియలాజికల్‌, ఇమేజింగ్‌ అసోసియేషన్‌ (ఐఆర్‌ఐఏ) మండిపడింది. సీటీస్కాన్‌లు క్యాన్సర్‌ కారకమవుతాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పంటూ తోసిపుచ్చింది. ఈమేరకు ఐఆర్‌ఐఏ అధ్యక్షుడు సి.అమర్‌నాథ్‌, ప్రధాన కార్యదర్శి సందీప్‌ కవ్‌థాలేలు బుధవారం బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత ఆధునిక రూపం సంతరించుకున్న సీటీస్కాన్‌లు 5-10 చెస్ట్‌ ఎక్స్‌రేలతో సమానమని.. 300-400 ఎక్స్‌రేలన్నది ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం నాటి మాట అని ఆ ప్రకటనలో ఖండించారు. ఈ సందర్భంగా సీటీస్కాన్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.
‘ఆర్‌టీ-పీసీఆర్‌’ కొవిడ్‌ వైరస్‌ను నిర్ధారించే పరీక్ష. వివిధ కారణాల వల్ల ఒక్కోసారి ఈ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ, సంబంధిత వ్యక్తుల్లో కరోనాను కనిపెట్టడానికి సీటీస్కాన్‌ దోహదపడుతుంది. దీనివల్ల ప్రాథమిక దశలోనే ఇన్‌ఫెక్షన్‌ను కనిపెట్టి.. త్వరగా చికిత్స అందించవచ్చు. దీంతో వేగంగా వైరస్‌ వ్యాప్తిని నిలువరించవచ్చు. అందుకే కో రాడ్స్‌ స్కోర్‌ 4, 5 ఉన్న బాధితులను గుర్తించాలని రాష్ట్రాలు అక్కడి రేడియాలజీ విభాగాలను కోరుతున్నాయి. రోగ తీవ్రతను గుర్తించడానికి కూడా సీటీస్కాన్‌ ఉపయోగపడుతుంది. ఒకవేళ ప్రాథమికస్థాయిలోనే ఉన్నట్లు తేలితే ఇళ్లలోనే చికిత్సకు వీలవుతుంది.
ఊపిరితిత్తులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని సీటీస్కాన్‌ ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించొచ్చు. సకాలంలో స్టెరాయిడ్స్‌ మొదలు పెట్టడం వల్ల ఆక్సిజన్‌ స్థాయి పడిపోకముందే ఊపిరితిత్తులను కాపాడటానికి వీలవుతుంది.
ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలకు సమయం పట్టినా.. సీటీస్కాన్‌ ద్వారా తక్కువ సమయంలోనే ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించవచ్చు. బాధితులను వెంటనే అప్రమత్తం చేయడం వల్ల మిగతావారికి వైరస్‌ సోకకుండా నియంత్రించవచ్చు. దీనిద్వారా కొవిడ్‌-19 మాత్రమే కాకుండా ఇతర బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, గుండెపోటు లాంటి సమస్యలనూ ముందుగా గుర్తించవచ్చు.
కొవిడ్‌-19ని ప్రాథమిక స్థాయిలో గుర్తించడానికి చెస్ట్‌ ఎక్స్‌రే పనిచేయడం లేదని చాలా అధ్యయనాల్లో తేలింది. సీటీస్కాన్‌ మాత్రం అత్యంత ప్రాథమిక దశను కూడా ప్రభావశీలంగా గుర్తించగలుగుతోంది.
ఆధునిక విధానాల్లో సీటీస్కాన్‌లు అల్ట్రా లోడోస్‌ రేడియేషన్‌ను ఉపయోగిస్తాయి. ఇవి 5-10 ఎక్స్‌రేలతో మాత్రమే సమానం. ప్రపంచవ్యాప్తంగా రేడియాలజిస్టులు స్కానింగ్‌ సమయంలో అత్యల్ప రేడియేషన్‌ను ఉపయోగిస్తున్నారు. మెడికల్‌ ఇన్వెస్టిగేషన్‌, చికిత్సను ‘రిస్క్‌ వర్సెస్‌ బెనిఫిట్‌’ నిష్పత్తిలో చూడాలి. ఇక్కడ రిస్క్‌ దాదాపు శూన్యం కాబట్టి దీనివల్ల ప్రయోజనమే అధికం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన