ఇక 10, 12 తరగతులకు కాగిత రహిత ధ్రువపత్రాలు

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:32 IST

ఇక 10, 12 తరగతులకు కాగిత రహిత ధ్రువపత్రాలు

‘ఏబీసీడీ’కి సీబీఎస్‌ఈ ఏర్పాట్లు

దిల్లీ: కాగిత రహితంగా.. ఎవరూ ట్యాంపర్‌ చేయడానికి వీల్లేని విధంగా 10, 12 తరగతుల బోర్డు పరీక్ష ఫలితాల ధ్రువపత్రాల (సర్టిఫికెట్ల) జారీకి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సమాయత్తమైంది. ఇందుకు గాను బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని వినియోగించనుంది. ఈ మేరకు ‘అకడమిక్‌ బ్లాక్‌ చెయిన్‌ డాక్యుమెంట్‌ (ఏబీసీడీ)’ పేరిట ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల జారీకి ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా ధ్రువపత్రాలను సురక్షితంగా పదిలపరచడానికి వీలవుతుంది. 10, 12 తరగతులకు సంబంధించి 2019 నుంచి 2021 వరకు ‘డిజిటల్లీ సైన్డ్‌’ ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు సీబీఎస్‌ఈ ఓ ప్రకటనలో తెలిపింది. క్రమేపీ అంతకుముందు సంవత్సరాలకు సంబంధించిన వాటిని కూడా అందుబాటులోకి తెస్తుంది. బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతను ఉపయోగించి అదనపు భద్రతతో కూడిన లింక్‌ ద్వారా ఈ ధ్రువపత్రాలను జారీ చేస్తారు.

ఈ ‘ఏబీసీడీ’ని వివిధ విద్యాసంస్థలు ప్రవేశాల సమయంలోను, కంపెనీలు ఉద్యోగాలిచ్చేటప్పుడు ధ్రువీకరణకు వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు కూడా వీటిని వాడుకోవచ్చని సీబీఎస్‌ఈ తెలిపింది. బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు విద్యా రుణాలు, ఉపకార వేతనాలు వంటివాటిని మంజూరు చేసేటప్పుడు కూడా ఈ విధానంలో ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవచ్చని వెల్లడించింది. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవచ్చు. సర్టిఫికెట్లలో అవసరమైన మార్పులు చేయాల్సి వచ్చినా భవిష్యత్తులో వీలు కలుగుతుంది. పారదర్శకంగా ధ్రువపత్రాల వినియోగానికి వీలవుతుందని.. దీనిద్వారా పలు సందర్భాల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు సమయం ఆదా అవుతుందని సీబీఎస్‌ఈ తెలిపింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన