నేపాల్‌లో న్యాయ సంక్షోభం

ప్రధానాంశాలు

Updated : 28/10/2021 10:43 IST

నేపాల్‌లో న్యాయ సంక్షోభం

‘సుప్రీం’ సీజేపై ‘నీకిది-నాకది’ ఆరోపణలు

 బావమరిదికి మంత్రి పదవి ఇప్పించుకున్నారని విమర్శలు

రాజీనామా చేయాలని ఆందోళనలు

 విచారణకు సిద్ధమేనన్న జస్టిస్‌ రాణా

కాఠ్‌మాండూ: నేపాల్‌ న్యాయ వ్యవస్థలో సంక్షోభం నెలకొంది. ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారంటూ సాక్షాత్తూ నేపాల్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ చోలేంద్ర శంషేర్‌ రాణాపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చేసిన వారిలో కొందరు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ఆయన రాజీనామా చేయాలంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగడంతో పాటు, కోర్టును బహిష్కరించారు. అయితే తాను రాజీనామా చేసేది లేదని, అవసరమైతే రాజ్యాంగం ప్రకారం తనపై చర్యలు తీసుకోవచ్చని జస్టిస్‌ రాణా స్పష్టం చేశారు.

మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి రెండు సార్లు పార్లమెంటును రద్దు చేయగా అలా చేయడం తగదంటూ జస్టిస్‌ రాణా ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. పార్లమెంటును పునరుద్ధరించడంతో పాటు, ప్రతిపక్ష నేతగా ఉన్న షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఇచ్చింది. అయితే దేవ్‌బా మంత్రివర్గంలో జస్టిస్‌ రాణా తన బావమరిది గజేంద్ర బహదూర్‌ హమాల్‌కు పదవి వచ్చేలా చూసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. పరిశ్రమలు, వాణిజ్యం, పౌరసరఫరాల మంత్రిగా హమాల్‌ ఈ నెల పదో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఆరోపణలు వచ్చిన 48 గంటల్లోనే ఆయన రాజీనామా చేశారు.  

ఈ వ్యవహారంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాణా..దేవ్‌బా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారంటూ నేపాల్‌ బార్‌ అసోసియేషన్‌తో పాటు, సుప్రీంకోర్టుకు చెందిన న్యాయమూర్తులు కూడా ఆరోపించారు. ‘నీకిది- నాకది’ తరహాలో వ్యవహరించారని విమర్శలు చేశారు. న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించడంతో పాటు, కొందరు న్యాయమూర్తులు దీనిపై చర్చలు జరుపుతుండడంతో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. జస్టిస్‌ రాణా స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని బార్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం జస్టిస్‌ రాణా సుప్రీంకోర్టుకు చెందిన 15 మంది న్యాయమూర్తులతో సమావేశమయ్యారు. ‘‘మీడియాలో విమర్శలు వచ్చినంత మాత్రాన, వీధుల్లో ఆందోళనలు చేసినంత మాత్రాన రాజీనామా చేయబోను. ఒత్తిళ్లకు లొంగను. అవసరమైతే రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు’’ అని సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి బాబూరాం దహాల్‌ చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలంటే ప్రతినిధుల సభలోని కనీసం 25 శాతం మంది సభ్యులు తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సభలోని మూడింట రెండొంతుల మంది దాన్ని ఆమోదిస్తే ఆయన పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. మంత్రి పదవికి హమాల్‌ రాజీనామా చేసినప్పటికీ అది సరిపోదని, న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠకు మచ్చ వచ్చినందున జస్టిస్‌ రాణాయే రాజీనామా చేయాలని న్యాయమూర్తులు అంటున్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన