close

తాజా వార్తలు

కలివిడిగా... కదలండిలా!

ఉద్యోగం - ఉల్లాసం

  మనకు నచ్చిన మిత్రులను ఎంపిక చేసుకోవచ్చు కానీ...  ఆఫీసులో ఏరికోరి సహచరులను ఎంచుకునే అవకాశం ఉండదు. ఉన్నవారితోనే సర్దుకుపోయి పనిచేయాలి.  భిన్న మనస్తత్వాలు, నేపథ్యాల నుంచి వచ్చే నలుగురితో కలిసి, నలుగురిలో ఒకరిగా మెలగాలంటే...  మనంతట మనం పాటించాల్సిన నియమాలేంటో చూద్దాం.
మనలో చాలామంది తేలిగ్గా తీసుకుంటాం కానీ... సహచరులతో సంతోషంగా కలిసిపోవడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. పని వాతావరణం ఆహ్లాదపూర్వకంగా మారుతుంది. రోజంతా హాయిగా గడిచిపోతుంది. మీ ఆలోచనలను వారితో పంచుకోగలరు. పని ఒత్తిడిలో వాళ్ల సాయం కూడా అందుతుంది.  మరి అలా కలిసిపోవాలంటే... మన వంతుగా ఏం చేయాలో చూద్దామా...

ఓ నవ్వు నవ్వండి...
ఉద్యోగ జీవితం ప్రారంభించిన మొదట్లో సహచరులతో వెంటనే మాట కలపలేం. అందుకే వారు ఎప్పుడైనా ఎదురైనప్పుడు చిన్న నవ్వు నవ్వండి. తరువాత మాటలు వాటికవే కలిసిపోతాయి. వారెప్పుడైనా లంచ్‌, డిన్నర్‌ వంటి వాటికి పిలిస్తే వెళ్లండి. ఇది మీలో స్నేహాన్ని పెంచుతుంది. సహచరుల వ్యక్తిత్వం తెలుస్తుంది. మీ సహచరులతో మీరే ఏదైనా సంభాషణను ప్రారంభించండి. మీ సహచరులతోనే లంచ్‌, డిన్నర్‌ లాంటివి చేయాలి. వీటన్నింటివల్లా ఇతరులు ఎలాంటి వారో తెలుసుకోవడానికి దోహదపడతాయి. స్నేహితులుగా వారు మనకు దగ్గరవడానికి ఉపయోగపడతాయి.
ఈ మూడు చాలా అవసరం...
మీ వల్ల ఎదుటివారికి అసౌకర్యం కలిగినప్పుడు ‘క్షమించండి’ అని, ఏదైన మేలు జరిగినప్పుడు ‘థాంక్స్‌’ అని చెప్పడం మరిచిపోకండి. ఇలా చెప్పకపోతే ఎదుటి వారి ఈగో దెబ్బతింటుంది. అలాగే మీ పనికి సంబంధించిన సహాయం మీ సహొద్యోగిని కోరినప్పుడు ‘ప్లీజ్‌’ అనే పదం వాడటం ఉత్తమం.
మగవారితోనూ మాట్లాడుదాం...
ఆఫీసులో ఉద్యోగం సక్రమంగా చేయాలంటే పురుషుల సహకారం కూడా అవసరమే. కార్యాలయాల్లో మన పై అధికారులు, సహచరులు ఎక్కువగా పురుషులే ఉంటారు. వారితోనూ స్నేహపూర్వకంగా మెలగాలి. వారితో ఏదైనా ఫెయిర్‌గా మాట్లాడండి. ఏదైన సమస్య వస్తే పరిష్కారం చూపేలా మీ భావాలు వ్యక్తం చేయండి.
పని పంచుకుందాం...
ఎదుటి వారు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు వారికి సహాయపడటానికి ముందుకెళ్లండి. వారి పని సులువవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మీకు ఏదైన సమస్య వచ్చినప్పుడు వారు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఇలాంటి సంఘటనలే వారికి మిమ్మల్ని దగ్గర చేస్తాయి.
గౌరవిద్దాం...
మీరు ఒకరితో స్నేహపూర్వకంగా మెలగకపోతే వచ్చే నష్టం తక్కువే. కానీ ఇతరులకు గౌరవం ఇవ్వకుంటే మాత్రం మీరు నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరితో మర్యాదగా మెలగండి. ఎదుటివారు పలకరిస్తే సరిగ్గా స్పందించండి. గాసిప్స్‌కు దూరంగా ఉండండి. పనిలో జరిగే పొరపాట్లను ఇతరుల పైకి నెట్టడం సరికాదు. ఇవి మీపై చెడు అభిప్రాయం కలిగిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
మౌనమా... వదిలేద్దాం!
కొందరు ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడరు. తమకు అవసరం ఉంటేనే స్పందిస్తారు. అలాంటివాళ్లను మాట్లాడమంటూ అసలు ఒత్తిడి తేవొద్దు. వారి స్వేచ్ఛకు భంగం కలిగించొద్దు. ఇతరుల దగ్గర ఎప్పుడూ వాళ్ల గురించి తప్పుగా మాట్లాడకపోవడమే మంచిది. క్రమంగా వాళ్లే మారతారు.
వాళ్ల తరఫున నిల్చుని...
ఎవరూ కావాలని తప్పు చేయరు. కార్యాలయంలో మీ సహచరులు ఏదైన పొరపాటు చేసినప్పుడు పై అధికారుల వద్ద వారికి మద్దతుగా నిలవండి. మీ సహోద్యోగికి కూడా ఇటువంటిది మరోసారి చేయకూడదని చెప్పండి.
వాదనలు ఎందుకు...
అభిప్రాయాలు, సిద్ధాంతాలు అందరివీ ఒకేలా ఉండవు. పెరిగిన ప్రాంతం, పరిస్థితి ఆధారంగా ఇవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. అందుకే వాటి గురించి ఎప్పుడూ వాదించొద్దు. ఇవి క్రమంగా పెరుగుతాయే తప్ప అసలు తగ్గవు. వీటి గురించి ఎవరెనా ప్రస్తావించినా మీరు వెనక్కి తగ్గడమే మంచిది కానీ వాదన వద్దు. ఇటువంటి వాదనలు మనుషులను వర్గాలుగా విడగొడతాయే కానీ దగ్గర చేయవు. ఈ తీరు పనివాతావరణాన్నీ ప్రభావితం చేస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.