close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌@ 9 PM

1. సమ్మె..కోర్టు ఆదేశాలపై కేసీఆర్‌ సమీక్ష

రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రవాణశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మతో పాటు పలువురు ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని.. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించాలని ఉన్నత న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. 

2. సచివాలయం కూల్చివేతపై విచారణ వాయిదా

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. ప్రస్తుత భవనాలు మరమ్మతులు చేయలేని స్థితిలో ఉన్నట్లు సాంకేతిక కమిటీ నివేదికలో పేర్కొందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సరిదిద్దే అవకాశమున్న భవనాలను కూల్చాలనుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఈసందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కచ్చులూరు వద్ద లంగరుకు తగిలిన బోటు

గతనెల 15న కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గి, వాతావరణం అనుకూలించడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం మరోసారి బోటు వెలికితీత పనులు చేపట్టింది. గోదావరిలో మునిగిన బోటు లంగరుకు తగిలిందని ధర్మాడి సత్యం బృందం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. భవిష్యత్తులో తీవ్ర సంక్షోభ పరిస్థితులు

భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతుందని ఆర్థికవేత్త, నోబెల్‌ పురస్కార గ్రహీత అభిజిత్‌ బెనర్జీ హెచ్చరించారు. తక్షణం బ్యాంకింగ్‌ రంగానికి ఉద్దీపన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, దీనిపై ఆర్బీఐ కూడా అంత అప్రమత్తంగా లేదని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడారు. పీఎంసీ బ్యాంకు కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ భవిష్యత్తులో బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కోనున్న సమస్యలపై ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. పాక్‌పై 2020లో తుది నిర్ణయం: ఎఫ్‌ఏటీఎఫ్‌

పాకిస్థాన్‌కు ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి, 2020 వరకు పాకిస్థాన్‌ను సూత్రప్రాయంగా ‘గ్రే’ లిస్టులో పెట్టడానికి నిర్ణయించినట్లు పాక్‌లోని ఓ వార్త సంస్థ పేర్కొంది. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారంతో పాటు మనీలాండరింగ్‌ కార్యకలాపాల్ని పూర్తిగా నిలిపివేయాలని సూచించినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. హుజూర్‌నగర్‌లో తెరాస ధన ప్రవాహం:మర్రి

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు తెరాస భారీగా నగదు ఖర్చుచేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెరాస ఖర్చు చేసే మొత్తాన్ని ఆ పార్టీ అభ్యర్థి ఖర్చుగానే చూడాలని సీఈవో రజత్‌కుమార్‌ను కోరినట్లు శశిధర్‌రెడ్డి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. జగన్‌తో ఇంటెలిజెంట్‌ సెజ్‌ ప్రతినిధులు భేటీ

ఏపీ సీఎం జగన్‌తో హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పాదరక్షల తయారీకి ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌) ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో రూ.700 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు ఇంటెలిజెంట్‌ సెజ్‌ లిమిటెడ్‌ ఆసక్తి చూపింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో సుమారు 10వేల మందికి ఉపాధి అవకాశం లభిస్తుందని సీఎంకు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. చిరుతో కలిసి ‘సైరా’ వీక్షించిన ఉపరాష్ట్రపతి 

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాతి జనరేషన్‌లో ప్రజల్ని అలరించడానికి చిరంజీవి వచ్చారని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా దిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు నివాసంలో సైరా చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. మార్కెట్లోకి రెడ్‌మి నోట్‌ 8 ఫోన్లు

వరుస ఫోన్‌ లాంచ్‌లతో అదరగడుతున్న రెడ్‌మి ఇప్పడు మరో రెండు కొత్త మొబైల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెడ్‌మి నోట్‌ 8 ప్రో, రెడ్‌మి నోట్‌ 8 పేరుతో ఈ ఫోన్లను విడుదలచేసింది. ఇతర నోట్‌ సిరీస్‌ ఫోన్లతో పోలిస్తే ఈ ఫోన్లలో ఫీచర్లను మరింత మెరుగుపరిచినట్లు కంపెనీ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. డెన్మార్క్‌ ఓపెన్‌: సైనా ఓటమి

డెన్మార్క్‌ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ నిరాశపరిచింది. తొలి రౌండ్లో జపాన్‌ క్రీడాకారిణి సయకా చేతిలో 15-21, 21-23 తేడాతో ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో 15-21తో ఓడిన సైనా రెండోగేమ్‌లో ప్రత్యర్థిని ప్రతిఘటించింది. 20-16తో రెండో గేమ్‌లో మంచిస్థితిలో నిలిచింది. కానీ, సయకా ఒక్కసారిగా విజృంభించి గేమ్‌ను 23-21తో కైవసం చేసుకుంది. దీంతో సైనా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.