close

తాజా వార్తలు

సాహసం చేయరా సినీ డింభకా!

దేనికైనా సై!

ఇంటర్నెట్‌డెస్క్‌: సరైన పాత్రలు వస్తే, మన సినీ తారలు దేనికైనా సై అంటున్నారు. ఆ పాత్రకు సరిపోయేలా ఆహార్యాన్ని మార్చుకునేందుకు కిలోల బరువు పెరుగుతున్నారు.. కిలోల బరువు తగ్గుతున్నారు. సిక్స్‌ప్యాక్‌లో మెప్పిస్తున్నారు. కొందరైతే ఒరిజినాలిటీ కోసం అందం విషయం పక్కన.. పెట్టి ఏకంగా గుండు చేయించుకుంటున్నారు. మరికొందరు డూప్‌లు లేకుండా యాక్షన్‌ సీన్లలో దుమ్ము దులిపేస్తున్నారు.  వృత్తిపట్ల తమకున్న అంకితభావాన్ని చాటుతూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు.

అప్పటి వరకూ యాక్షన్‌, ప్రేమకథా చిత్రాలతో ఆకట్టుకున్న హీరోలు ప్రభాస్‌, రానా ‘బాహుబలి’ కోసం ఒక్కసారిగా రాజులుగా మారారు. ఈ సినిమాలో ప్రభాస్‌ ‘బాహుబలి’గా, రానా ‘భళ్లాలదేవుడు’గా పోటాపోటీగా నటించారు. అంతర్జాతీయంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే దీని వెనక వారి శారీరక, మానసిక కష్టం ఎంతో ఉంది. డైట్‌ పూర్తిగా మార్చేశారు. రోజులో కొద్దికొద్దిగా ఆరు సార్లు తినేవారు. అల్పాహారంగా 40 గుడ్ల తెల్లసొన తీసుకునేవారట. ఇక్కడ అన్నం అనే పదానికి ఆమడ దూరంలో ఉండేవారట. కేవలం పోషకాహారం మాత్రమే తీసుకుని 100 కేజీలకుపైగా పెరిగారు. తర్వాత రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా కోసం ఒక్కసారిగా బరువు తగ్గారు. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో చంద్రబాబు నాయుడు పాత్ర కోసం మరింత సన్నబడి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రభాస్‌ ‘సాహో’ సినిమా కోసం కాస్త బరువు తగ్గినట్లు కనిపిస్తున్నారు.


‘సైజ్‌జీరో’

కథానాయిక అనుష్క ‘సైజ్‌ జీరో’ కోసం దాదాపు 20 కిలోలు పెరిగారు. ఇది ఓ విధంగా సాహసమనే చెప్పాలి. ఓ నటి నాజూగ్గా ఉంటేనే  ప్రేక్షకులు ఇష్టపడతారు. కానీ, స్వీటీ ‘సైజ్‌జీరో’ కోసం ఏకంగా 20 కిలోలు అదనపు బరువు పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రశాంత్‌ కోవెలమూడి దర్శకత్వంలో 2015లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 


జైలు ఖైదీ

బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హుడా ‘సరబ్‌జీత్‌’ కోసం ఎవరూ ఊహించని విధంగా తయారయ్యారు. సిక్స్‌ప్యాక్‌లో ఉన్న ఆయన 28 కేజీలు తగ్గి.. అందర్నీ షాక్‌కు గురి చేశారు. పొరపాటున పాకిస్థాన్‌ సరిహద్దు దాటిన ఓ భారతీయుడు, అతడ్ని జైలు నుంచి విడిపించడం కోసం కుటుంబ సభ్యులు పడే శ్రమ నేపథ్యంలో దర్శకుడు ఒమంగ్‌ కుమార్‌ ‘సరబ్‌జీత్‌’ ను తెరకెక్కించారు.


మల్లయోధుడు టు ఫాదర్‌

బాలీవుడ్‌ మిస్టర్‌పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌ ‘దంగల్’లో ఇటు మల్లయోధుడి పాత్రలో, అటు తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. మల్లయోధుడి కోసం తెగ కసరత్తులు చేసిన ఆయన తండ్రి పాత్ర కోసం ఆ కండల్ని కరిగించారు. వైద్యులు ప్రమాదమని చెప్పినా.. సాహసం చేశారు. 2016లో వచ్చిన ‘దంగల్’ సినిమా చూసిన వారంతా ఆమిర్‌ పాత్రల్లో వ్యత్యాసం చూసి ఆశ్చర్యపోయారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విశేషమైన్‌ వసూళ్లు రాబట్టింది.


గల్లీబాయ్‌

‘పద్మావత్‌’ సినిమాలో అల్లా ఉద్దీన్‌ ఖిల్జీగా నటుడు రణ్‌వీర్‌ సింగ్ అందర్నీ భయపెట్టారు. ఆ సినిమాలో భారీ దేహంతో క్రూరంగా కనిపించిన ఆయన ఇటీవల వచ్చిన ‘గల్లీబాయ్‌’లో సామాన్య కుర్రాడిగా బక్క పల్చగా కనిపించారు. జోయా అక్తర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలై, విజయం సాధించింది. సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత రణ్‌వీర్‌ క్రమంగా బరువు పెరుగుతూ వచ్చారు.


ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన సినిమా ‘ఐ’లో హీరో విక్రమ్‌ రెండు వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించారు. మిస్టర్‌ ఇండియాగా సిక్స్‌ప్యాక్‌తో కనిపించిన ఆయన ఆ తర్వాత వైరస్‌ సోకిన వ్యక్తిగా బక్క చిక్కిపోయి కనిపించారు. రెండేళ్లపాటు పళ్లరసాలు తాగుతూ కండలు కరిగించారు. ‘ఐ’ సినిమా బాక్సాఫీసు ఆశించిన విజయం అందుకోకపోయినా, విక్రమ్‌ నటన, అంకితభావానికి ప్రశంసలు దక్కాయి.


సిల్క్‌స్మిత కోసం..

అలనాటి నటి సిల్క్‌ స్మిత బయోపిక్‌ ‘డర్టీ పిక్చర్‌’ కోసం విద్యా బాలన్‌ కూడా బరువు పెరిగారు. ఈ సినిమా కోసం ఆమె దాదాపు 15 కిలోలు పెరిగారు. బాక్సాఫీసు వద్ద కూడా మంచి విజయం సాధించిన ఈ సినిమాను మూడు జాతీయ అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, ఆరు స్క్రీన్‌ అవార్డులు వరించాయి.


మంచి భార్య..

అప్పటి వరకు నాజూకుగా ఉన్న భూమి పెడ్నేకర్‌ ‘దమ్‌ లగా కే హైషా’ సినిమా కోసం దాదాపు 15 కిలోల బరువు పెరిగారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానా కథానాయడు. ఓ అందమైన అమ్మాయి తన జీవిత భాగస్వామి కావాలని కోరుకునే హీరోకు లావుగా ఉన్న అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తారు. మొదట ఇష్టం లేకపోయినా.. తర్వాత ఆమె మంచితనం చూసి హీరో దగ్గరవుతాడు. ఈ నేపథ్యంలో సాగే కథతో కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.30 కోట్లు రాబట్టింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.