close

తాజా వార్తలు

పది చాలు.. కొలువులు వేలు

పదేగా పాసైంది... అని తీసేయడానికి వీల్లేదు. ఆ అర్హతతోనే ఎన్నో ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రక్షణ దళాలు, రైల్వేలు, పోస్టల్‌శాఖ, పారామిలటరీ తదితర విభాగాల నుంచి ఏటా ప్రకటనలు వెలువడుతున్నాయి. టెన్త్‌తో ముందు ఉద్యోగం సంపాదించుకొని తర్వాత దూరవిద్య తదితర మార్గాల్లో పైచదువులకూ వెళ్లవచ్చు. అనుభవంతో ప్రమోషన్లు అందుకోవచ్చు. డిపార్ట్‌మెంట్‌ పరీక్షల సాయంతో ఉన్నతస్థాయికీ చేరుకోవచ్చు.

పదో తరగతి పూర్తయింది.. ఇప్పుడేం చేయాలి? చదువుకోవాలంటే చాలా కోర్సులున్నాయి. మరి ఏదైనా ఉద్యోగం చేయాలంటే ఏమున్నాయి? దీనికి సమాధానంగా వేల ఉద్యోగాలు కనిపిస్తాయి. ఏటా ఏన్నో నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆ ప్రకటనల ప్రకారం వయసు సరిపోతే అన్నింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. చిన్నవయసులోనే జీవితంలో స్థిరపడవచ్చు.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌:  మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) భర్తీ చేస్తుంది. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ పరీక్షల ద్వారా అభ్యర్థులను తీసుకుంటారు. 18-25 ఏళ్లవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి రూ.18000 మూలవేతనం లభిస్తుంది. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. సాధారణంగా ప్రకటన ఏటా నవంబరులో వెలువడుతుంది.

పారామిలటరీ: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కేంద్ర పోలీస్‌ బలగాలతోపాటు ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో జనరల్‌ డ్యూటీ- కానిస్టేబుల్‌, రైఫిల్‌మెన్‌ పోస్టుల భర్తీకి ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. అన్ని విభాగాల్లోనూ కలిపి ఒక్కోవిడతలో యాభై వేలకుపైగా ఖాళీలు ఉంటున్నాయి. పదో తరగతి అర్హతతో ఎక్కువ ఉద్యోగాలు ఈ ప్రకటన ద్వారానే భర్తీ అవుతున్నాయి. సాధారణంగా జులైలో నోటిఫికేషన్‌ వస్తుంది. దీని ద్వారా బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ల్లో పోస్టులను భర్తీ చేస్తారు.
వయసు 18-23 మధ్య ఉండాలి. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ పరీక్ష ద్వారా నియామకాలు చేపడతారు. రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు.
వెబ్‌సైట్‌:
http://www.ssc.nic.in

ఆర్మీ

సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ: పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు సోల్జర్‌ జనరల్‌ డ్యూటీకి అర్హులు. వయసు 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. 166 సెం.మీ. ఎత్తుతోపాటు 50 కి.గ్రా. బరువు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి.

సోల్జర్‌ ట్రేడ్‌ మెన్‌: చెఫ్‌, వాషర్‌ మెన్‌, డ్రెస్సర్‌, స్టివార్డ్‌, టైలర్‌, ఆర్టిజన్‌ (వడ్రంగి/ ఇస్త్రీ/  తాపీపని) మొదలైన పోస్టులను సోల్జర్‌ ట్రేడ్‌ మెన్‌ విభాగంలో భర్తీ చేస్తారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. 166 సెం.మీ. ఎత్తు, కనీసం 50 కి.గ్రా. బరువు తప్పనిసరి. ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి.
ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా ఏటా నియామకాలు (రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు) జరుగుతాయి. ఈ ఉద్యోగంలోకి చేరినవారు తదనంతరం సిపాయ్‌, నాయక్‌, హవల్దార్‌ వంటి పదోన్నతులు పొందవచ్చు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ, దేహదార్ఢ్య పరీక్షలు, వైద్య ఆరోగ్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌ విభాగంలో హౌస్‌ కీపర్‌, మెస్‌ కీపర్‌, గుర్రాల పర్యవేక్షణ ఉద్యోగాలకు ఎనిమిదో తరగతి పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

www.joinindianarmy.nic.in

ఎయిర్‌ ఫోర్స్‌

గ్రూప్‌ వై మ్యుజీషియన్‌: ఈ ట్రేడ్‌ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హతతో పోటీ పడవచ్చు. అయితే ఏదైనా సంగీత/  వాద్య పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. 17-25 ఏళ్లలోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానంలో ఎంపికైనవారు ఎయిర్‌ఫోర్స్‌ బ్యాండ్‌లో పనిచేస్తారు. మొదట రాత పరీక్ష తర్వాత శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షల అనంతరం ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్‌:
‌www.indianairforce.nic.in

నేవీ

చెఫ్‌, స్టివార్డ్‌, శానిటరీ హైజీనిస్ట్‌ ఉద్యోగాలను మెట్రిక్‌ రిక్రూట్‌మెంట్‌ (ఎంఆర్‌) ద్వారా నేవీలో భర్తీ చేస్తున్నారు. పదో తరగతి విద్యార్హతతో 17 -21 ఏళ్లలోపు వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. రాత పరీక్ష, దేహదార్ఢ్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో రూ.14,600 చెల్లిస్తారు. అనంతరం రూ.21,700 మూలవేతనం లభిస్తుంది. దీంతోపాటు రూ.5,200 మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్పీ) చెల్లిస్తారు. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. ఉంటాయి. భవిష్యత్తులో మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ స్థాయి వరకు చేరుకుంటారు.

మ్యుజీషియన్‌: నేవీ బ్యాండ్‌లో పనిచేయడానికి మ్యుజీషియన్లను ఎంపిక చేస్తారు. సంగీత పరికరాలపై ప్రావీణ్యం ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. సంగీత ప్రావీణ్యం, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.

స్పోర్ట్స్‌ కోటా ఎంట్రీ: పదో తరగతి విద్యార్హతతో ఈ విభాగంలో చేరవచ్చు. ఏదైనా క్రీడ/ ఈవెంట్లో ప్రావీణ్యం ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌:
www.joinindiannavy.gov.in

కోస్ట్‌ గార్డ్‌

ఇండియన్‌ కోస్ట్‌ గార్డు పదోతరగతి విద్యార్హతతో నావిక్‌ పోస్టులకు ఎంపికైనవారిని డొమస్టిక్‌ బ్రాంచ్‌ కుక్‌, స్టివార్డ్‌ హోదాల్లో తీసుకుంటారు. రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఉద్యోగంలో చేరినవారికి ప్రారంభంలో రూ.21700 మూలవేతనం చెల్లిస్తారు. పురుషులే అర్హులు. పదోతరగతిలో 50 (ఎస్సీ, ఎస్టీ 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18 - 22 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయఃపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడతాయి.

రైల్వేల్లో...

పదో తరగతి విద్యార్హతతో రైల్వేల్లో చాలా ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీటి కోసం మహిళలు, పురుషులు ఎవరైనా పోటీ పడవచ్చు. గ్రేడ్‌-4 ట్రాక్‌ మెయిన్‌టెయినర్‌తో  పాటు వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇటీవల వెలువడిన ప్రకటనలో లక్షకు పైగా ఖాళీలకు అర్హత పదో తరగతే. వేతన శ్రేణి ప్రకారం వీటిని లెవెల్‌-1 (ప్రారంభ స్థాయి) ఉద్యోగాలుగా పరిగణిస్తున్నారు. ఎంపికైన వారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. కరవు భత్యం, ఇంటిఅద్దె..మొదలైనవాటితో సుమారు రూ.పాతికవేల వరకు మొదటి నెల నుంచే వేతనం అందుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.
రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌ పోస్టులకూ పదోతరగతి సరిపోతుంది.రాతపరీక్ష, దేహదార్ఢ్య పరీక్షల ద్వారా వీటిని భర్తీ చేస్తున్నారు.
వెబ్‌సైట్‌:
www.indianrailways.gov.in & www.rrbsecunderabad.nic.in

రోడ్డు రవాణా శాఖలో

కండక్టర్‌: ఏపీఎస్‌/ టీఎస్‌ఆర్‌టీసీల్లో కండక్టర్‌ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించకుండా పదో తరగతి మార్కుల మెరిట్‌ ప్రకారం భర్తీ చేస్తున్నారు.

డ్రైవర్‌: పదో తరగతి విద్యార్హతతోపాటు హెవీ వెహికల్‌ మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ ఉద్యోగానికీ దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌:
http://www.apsrtc.gov.in,
https://www.tsrtc.telangana.gov.in/

పోస్టల్‌శాఖ

పదో తరగతి ఉత్తీర్ణులతో పోస్టల్‌ శాఖలో పోస్టుమ్యాన్‌, మెయిల్‌ గార్డు, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మంచి జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లూ ఉంటాయి.

గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌): బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం), మెయిల్‌ డెలివరర్‌ (ఎండీ), ప్యాకర్‌ పోస్టులను పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తున్నారు. శాఖాపరమైన పరీక్షల ద్వారా వీరు పోస్టుమెన్‌, మెయిల్‌ గార్డు, క్లర్క్‌ మొదలైన పదోన్నతులు పొందవచ్చు.
వెబ్‌సైట్‌:
‌www.indiapost.gov.in

ఆర్‌బీఐలో...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టులను పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేస్తుంది. ఇందులో ప్యూన్‌, దర్వాజ్‌, మజ్దూర్‌ అనే మూడు రకాల పోస్టులు ఉంటాయి. 18-25 ఏళ్లలోపువారు అర్హులు. ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఎంపికచేస్తారు. ఉద్యోగంలో చేరిన వారు సీనియర్‌ ఆఫీస్‌ అటెండెంట్‌గా పదోన్నతి పొందవచ్చు. డిగ్రీ పూర్తయితే శాఖాపరమైన పరీక్షల ద్వారా అసిస్టెంట్‌ మొదలైన ఉద్యోగాలు లభిస్తాయి.
వెబ్‌సైట్‌:
https://www.rbi.org.in/

అటవీశాఖ

రాష్ట్ర అటవీ శాఖల్లో బంగ్లా వాచర్‌, థానేదార్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుషులు 163 సెం.మీ., స్త్రీలు 150 సెం.మీ. ఎత్తు ఉండాలి.
‌www.forests.ap.gov.in,
www.forests.telangana.gov.in

వీఆర్‌ఏ

రాష్ట్రాల్లో గ్రామస్థాయిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి కీలకమైన విధులు నిర్వహించే విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ) ఉద్యోగాలను పదోతరగతి ఉత్తీర్ణులతో భర్తీ చేస్తారు. రాత పరీక్షలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహిస్తాయి.
వెబ్‌సైట్‌:
www.psc.ap.gov.in.
       www. tspsc.gov.in

ఇతరాలు

* ఐటీబీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌ తదితర పారా మిలటరీ దళాలు కానిస్టేబుల్‌ హోదాలో కుక్‌, వాషర్‌మన్‌, బార్బర్‌, వాటర్‌ క్యారియర్‌, సఫాయి కర్మచారి తదితర పోస్టుల భర్తీకి విడిగా ప్రకటనలు వెలువరిస్తున్నాయి. పురుషులు మాత్రమే అర్హులు. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.