close

తాజా వార్తలు

ఉద్యోగం మారేముందు...

ఉద్యోగం - ఉల్లాసం 

ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరింది స్రవంతి. సహోద్యోగుల్లో కొందరు ఆమెకు పనిరాదనేవారు. మరికొందరు తనతో కలిసేవారు కాదు. వారి సమస్యల్లో మాత్రం స్రవంతినీ భాగం చేసేవారు. వీటన్నింటితో విసిగిపోయిన ఆమె చివరకు ఉద్యోగం మానేసి సొంతూరికి వెళ్లిపోయింది.

ప్రవల్లిక పదోన్నతి కోసం చాలాకాలం ఎదురుచూసింది. చివరకు తనకంటే జూనియరైన ఓ ఉద్యోగికి.... అర్హతకు మించిన హోదాను కట్టబెట్టింది యాజమాన్యం. దీనిపై ఆరా తీస్తే... మొదటి నుంచీ బాస్‌కి మహిళలంటే సరైన అభిప్రాయం లేకపోవడం, తన పనితీరుపై సంతృప్తి చెందకపోవడమే కారణమని తెలిసి మానేయడానికి సిద్ధమైంది. 

వాణిజ్యం నుంచి అంతరిక్షం వరకు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా... స్రవంతి, ప్రవల్లిక లాంటివారూ అన్నిచోట్లా కనిపిస్తున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం వాటినుంచి పారిపోవడం కన్నా... ఎదుర్కొని ప్రత్యామ్నాయాలు ఆలోచించడమే మంచిదని అంటారు నిపుణులు.

చాలా సంస్థలు మహిళలకు పట్టం కడుతున్న మాట ఎంత వాస్తవమో, మగవారితో పోల్చితే వారికి ఎదురయ్యే సవాళ్లు ఎక్కువే అన్నది అంతే నిజం. తక్కువ వేతనాలు, సరైన సదుపాయాలు లేకపోవడం, పనివేళలు ఎక్కువగా ఉండటం... చెప్పుకుంటూ పోతే ఇలాంటివెన్నో సమస్యలు కనిపిస్తాయి. వీటన్నింటితో కొందరు ఉద్యోగాలు మానేస్తుంటే మరికొందరు కొత్త కొలువులు వెతుక్కుంటున్నారు. ఇలాంటి కీలక విషయాల్లో మహిళలు నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైతే కెరీర్‌లో తప్పటడుగులు వేసినట్లే. ఇది కెరీర్‌ నిచ్చెనపైనే ప్రభావం చూపిస్తుంది. వాటిని ఎలా అధిగమించాలంటే...

ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి: ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలు మానేయడానికి కారణం వారి ‘బాస్‌’లేనని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉన్నతాధికారులు తమ కష్టాన్ని గుర్తించకపోవడం, చులకనగా చూడటం, కొందరికి మాత్రమే గుర్తింపు ఇవ్వడం.. వంటి కారణాలతో చాలామంది పని మానేయాలనుకుంటారు. ఇలాంటప్పుడు ఆ బాధ్యతల నుంచి కాస్త విరామం తీసుకోవాలే తప్ప ఆవేశంలో ఉద్యోగానికి రాజీనామా చేయకూడదు. పనితీరులో లోపాలుంటే... వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని యాజమాన్యాన్ని ధైర్యంగా అడిగే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకునేందుకు ప్రయత్నించండి. పదోన్నతుల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఊహించిన పదోన్నతి రాకపోయినా, వేతనం విషయమైనా సరే పై అధికారులతో మాట్లాడాలి. మీలో లోపం ఎక్కడుందో తెలుసుకుని అవసరమైన మార్పులు చేసుకునేందుకు ప్రయత్నించాలి.

నైపుణ్యాలు పెంచుకునేలా: ఉద్యోగంలో చేరాక... అదే ప్రపంచం అయిపోతుంది కొందరికి. నెల తిరిగేసరికి జీతం వస్తే చాలని అనుకుంటారు. ఆ చిన్న సంతృప్తే ఉన్నతంగా ఎదగడానికి ఆటంకంగా మారుతుంది. రంగం ఏదైనా సరే... అనుక్షణం మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవాలి. అవసరమైన విద్యార్హతలూ పెంచుకోవాలి. వినూత్నంగా ఆలోచించి, పనిచేయడం అలవాటు చేసుకుంటే తిరుగే ఉండదు. ఇంత చేస్తున్నా ప్రతిభకు తగ్గ ఫలితం లేదని అనిపిస్తే మరో ఉద్యోగం చూసుకోవడం మంచిది. ప్రతి విషయంలో తోటివారితో పోల్చుకుంటూ, కెరీర్లో ఎదుగుదల లేదనుకోవడం సరికాదు. కాస్త ఆలస్యమైనాసరే, మీ శక్తిసామర్థ్యాలకు తగిన హోదా కచ్చితంగా వస్తుందనే ఆశాభావం ఉండాలి. కొన్నాళ్లు వేచి చూశాకే ఓ నిర్ణయానికి రావాలి.

రాజకీయాలకు దూరంగా: పనిచేసే చోట భిన్న మనస్తత్వాలున్న వ్యక్తులుంటారు. ఒకరి పనితీరు మరొకరికి నచ్చకపోవచ్ఛు ఎదురుపడినప్పుడు స్నేహంగా మాట్లాడినా వెనకాల విమర్శించొచ్ఛు పనివాతావరణంలో గాసిప్స్‌ సాధారణం. వాటికి అతిగా ప్రభావితమైతే మానసికంగా కుంగిపోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదు. దీనికి పరిష్కారం బాధపడటమో, అక్కడి నుంచి పారిపోవడమో కాదు. పై అధికారులతో మీ సమస్యని నిర్భయంగా చెప్పాలి. వీలైనంతవరకూ అలాంటివాటికి దూరంగా ఉండాలి. ఎంత జాగ్రత్తపడినా ప్రయోజనం లేదనుకున్నప్పుడే ఆఖరి ప్రయత్నంగా మరో ఉద్యోగం గురించి ఆలోచించాలి.

అభిరుచులకు సానబెట్టాలి: చదువుల్లో రాణించి, నచ్చిన కెరీర్‌లో స్థిరపడినా... కొందరు మహిళలు పెళ్లయ్యాకో, పిల్లలు పుట్టాకో ఇంటికే పరిమితమవుతుంటారు. ఇలాంటి వారు ఇంట్లోనూ ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. సాంకేతికతను ఉపయోగించుకొని ఇంటి నుంచే ఆదాయాన్ని అర్జించే కొలువుల్ని ఎంచుకోవచ్ఛు సృజనాత్మకత ఉంటే... అలవాట్లు, అభిరుచులనే ఆదాయ మార్గంగా మార్చుకోవచ్ఛు అలాంటివారు ఈ రోజుల్లో చాలామందే ఉన్నారు. రాజ్యలక్ష్మిది హైదరాబాద్‌...ఇంట్లోనే ఉంటూ తన అభిరుచులకు సాన బెట్టుకుంది. రంగురంగుల వ్యాలెట్‌లు, హ్యాండ్‌బ్యాగులు, లంచ్‌బ్యాగులు తయారు చేసి అమ్ముతూ వేల రూపాయల ఆదాయం అందుకుంటోంది. తమిళనాడుకు చెందిన షణ్ముగప్రియ సామాజిక మాధ్యమాల ద్వారా హోల్‌సేల్‌ చీరల వ్యాపారం చేస్తూ లక్షల్లో ఆదాయం అందుకుంటోంది. వీరేకాదు మీరైనా సరే! అద్భుతంగా వంట చేయగలిగినా, వృథా నుంచి కళాకృతులు చేయడం వచ్చినా, రాయగలిగినా... ఈ రోజుల్లో చక్కని అవకాశాలు దొరుకుతాయి.

మానేయాల్సిన అవసరం లేదు

పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం, వారి సంరక్షణ, భర్త వేరే ప్రదేశానికి బదిలీ కావడం వంటి కారణాలతో మహిళలు ఉద్యోగం మానేయాలనుకోవడం సరికాదు. ఈ రోజుల్లో చాలా కంపెనీలు ఇంటి నుంచి పని చేసుకునే సౌకర్యాలు కల్పిస్తున్నాయి. యాజమాన్యం అనుమతితో ఖాళీ సమయంలో ఇంటి నుంచే పని చేసుకోవచ్ఛు చదువుకున్న మహిళలు ఉద్యోగం చేస్తూ ఆర్థిక స్వేచ్ఛను పొందాలి. ప్రభుత్వరంగ సంస్థల్లో వేధింపుల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. విజిల్‌ బ్లోయింగ్‌ పాలసీలో భాగంగా పారదర్శకంగా విచారించి, శిక్ష విధించే కమిటీలు ఉంటాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో నేనుగానీ, నా సహచరులు గానీ ఎప్పుడూ ఇలాంటి వాటితో ఇబ్బందులు పడలేదు. శక్తి సామర్థ్యాల మేరకు పని చేస్తూ, వృత్తిలో మనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటేనే యాజమాన్యం గుర్తిస్తుంది. పదోన్నతుల విషయంలో లింగవివక్ష ఉండదు అనడానికి నేనే ఉదాహరణ. నాతో పాటు ఉద్యోగంలో చేరిన వారిలో కొందరే ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలు కెరీర్‌లో రాణించాలన్నా, మానసిక ఒత్తిడి అధిగమించాలన్నా కుటుంబ సభ్యుల మద్దతు ఉండాల్సిందే.

- అనన్య సిమ్లై, డిప్యూటీ వైస్‌ప్రెసిడెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌

సమన్వయం చేసుకోవాలి

మగవారి ఆధిపత్యానికి మొదటి నుంచి అలవాటు పడిన సమాజం మనది. మగవారితో పోలిస్తే మహిళల జీతాలు 20 శాతం మేర తక్కువగా ఉన్నట్లు చాలా అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రసవ సెలవులు, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు కెరీర్‌ గ్రాఫ్‌లో వెనుకబడే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో సంస్థలూ వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలు తమ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకుంటూ అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో ముందుండాలి. కుటుంబాన్ని, ఉద్యోగాల్ని సమన్వయం చేసుకోగలగాలి. నేనూ అందుకు మినహాయింపు కాదు. పని అనుభవంతో పాటు సామర్థ్యాలు మెరుగుపరచుకోవడానికి ఏదో ఒక కోర్సు చదువుతూనే ఉన్నా. ప్రస్తుతం ఐఎస్‌బీ నుంచి ఎంబీఏ చేస్తున్నా. ఇవన్నీ అదనపు బాధ్యతల కిందే లెక్క. మా సంస్థ నాపై ఉంచిన నమ్మకాన్ని, నాకు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నా. మేనేజరుగా పదేళ్లు పనిచేసిన అనుభవంతో చెబుతున్నా... అవరోధాలను ఎదుర్కొంటూ, బాధ్యతలను సవాలుగా స్వీకరిస్తేనే గుర్తింపు వస్తుంది. ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

- ఉదయశ్రీ, ఆపరేషన్స్‌ హెడ్‌, పెగా సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

మిమ్మల్ని మీరు తెలుసుకోండి...!

కొందరు అవకాశం వచ్చిందనో, అర్హత ఉందనో ఏదో ఒక ఉద్యోగంలో చేరతారు. ఆసక్తి, సృజనాత్మకత, సహజ సామర్థ్యాలు లేనప్పుడు ఏ ఉద్యోగంలో అయినా ఎక్కువ రోజులు కొనసాగలేరు. పని చేయలేకపోవడం, గుర్తింపు రాకపోవడం, ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు తదితర కారణాలతో ఇంకొందరు ఉద్యోగం మానేస్తుంటారు. మరికొంతమంది ప్రతిభావంతులే అయినా, మొహమాటంతో అదనపు బాధ్యతల్ని మోస్తారు. ఒత్తిడికి గురవుతారు. చివరకు తట్టుకోలేక ఉద్యోగం వదులుకుంటారు. ముందు ఉద్యోగంపై మీకు ఎలాంటి అభిప్రాయం ఉందనేది చూసుకోవాలి. మీరు ఏ అంశంలో వెనుకబడి ఉన్నారో గుర్తించి అందరికంటే మెరుగ్గా రాణించేలా ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే మీ అంచనాల్ని చేరుకోగలుగుతారు.

- స్వాతి, కెరీర్‌ నిపుణురాలు


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.