close

తాజా వార్తలు

వ్యక్తిగత సమాచారం కొట్టేసేందుకు కొత్తదారి


హైదరాబాద్‌ : ప్రశాంత్‌(పేరు మార్చాం) మెయిల్‌కు ఓ సందేశం వచ్చింది. మీ రుణలావాదేవీల పరపతికి మెచ్చి తమ సంస్థ నుంచి క్రెడిట్‌కార్డు ఆఫర్‌ ఇస్తున్నామనేది దాని సారాంశం. మెయిల్‌లోని లింక్‌ను క్లిక్‌ చేసి తాము అడిగిన సమాచారం నింపితే చాలు కొత్త కార్డు మీ ఇంటికే వచ్చేస్తుందంటూ ప్రకటనదారు ఆశపెట్టాడు. నిజమేననుకొని వివరాలు నమోదు చేస్తే  అతడి బ్యాంకు ఆన్‌లైన్‌ ఖాతా నుంచి డబ్బు మాయమైపోయింది. సైబర్‌ నేరగాళ్లు అతడికి తెలియకుండానే రూ.20వేల నగదు కొట్టేశారు. అదెలా సాధ్యమైందని ఆలోచించగా తన మెయిల్‌కు వచ్చిన లింక్‌ గుర్తుకొచ్చింది. అందులో తాను బ్యాంకు ఖాతా వివరాల్ని నమోదు చేసిన విషయం స్ఫురించి నాలుక కరుచుకున్నాడు.
మెయిల్‌ ఐడీకి వచ్చిన లింక్‌లో తన వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తే సైబర్‌ నేరగాళ్ల చేతికి ఎలా చేరిందనే విషయాన్ని పసిగట్టేందుకు ప్రశాంత్‌ తల బద్దలు కొట్టుకున్నా వాస్తవం బోధపడలేదు. చివరకు సైబర్‌క్రైమ్‌ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేయడంతో అక్కడి అధికారులు గుట్టు విప్పడంతో నోరెళ్లబెట్టాడు. ప్రశాంత్‌ వ్యక్తిగత వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి చేరడం వెనక పెద్ద తతంగమే ఉంది.

ఎలా జరిగింది..? బ్యాంకులతోపాటు ఇతర సంస్థలు తమ వినియోగదారుల వివరాల్ని సేకరించే విషయం అందరికీ తెలిసిందే. వాటిపి భద్రపరిచే బాధ్యతను ‘థర్డ్‌ పార్టీ ఏజెన్సీ’లకు అప్పగిస్తాయి. అవి ఆ కీలక సమాచారాన్నంతటినీ తమ వద్ద నిక్షిప్తం చేస్తుంటాయి. తర్వాత ఎప్పుడైనా అవసరం పడితే ఆయా వివరాల్ని సంబంధిత సంస్థలకు సమర్పిస్తాయి. ఈనేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు ఏజెన్సీలపై కన్నేస్తున్నారు. ఆ ఏజెన్సీల్లోని కొందరు ఇంటిదొంగల్ని గుర్తించి మచ్చిక చేసుకుంటున్నారు. వారి నుంచి కీలక సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇందుకు ఇంటిదొంగలకు ఒక్కో సమాచారానికి ఇంత అని లెక్కగట్టి ఇస్తున్నారు. ఆ సమాచారం తమ చేతికి చిక్కిన తర్వాత సైబర్‌ నేరాలతో బురిడీ కొట్టిస్తున్నారు.

నిన్న ఫోన్లు.. నేడు మెయిళ్లు.. బ్యాంకు ఖాతాదారులకు చెందిన విలువైన సమాచారం గుప్పిట్లోకి రావడంతో సైబర్‌ నేరగాళ్లు రెండో అంకానికి తెర లేపుతున్నారు. బాధితుడి మెయిల్‌కు లింక్‌ పంపుతున్నారు. దానిని క్లిక్‌ చేసి కీలక వివరాలు (యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌, సీవీవీ నంబరు, కార్డు గడువు తేదీ) నమోదు చేయాలంటున్నారు. ఇవి తెలిస్తే చాలు ఆన్‌లైన్‌లోనే బాధితుడి ఖాతా నుంచి డబ్బు కొట్టేసేందుకు మార్గం సులభమే.

వీటితోనే వల వేస్తారు..
* క్రెడిట్‌ కార్డును అప్‌గ్రేడ్‌ చేస్తాం.
* వివరాలు చెప్పకపోతే డెబిట్‌ కార్డు బ్లాక్‌ చేస్తాం. రివార్డు పాయింట్లను రిడీమ్‌ చేస్తాం.
* ఉచితంగా బోనస్‌ ఇస్తాం.

ఇవిగో జాగ్రత్తలు..
బ్యాంకులు అలాంటి మెయిళ్లు పంపవు.
* ఒకవేళవస్తే బ్యాంకుకువెళ్లి తనిఖీ చేయాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ సీవీవీ నంబరు, గడువు తేదీ ఇతరులకు చెప్పొద్దు.
* బ్యాంకు ఆన్‌లైన్‌ లావాదేవీల క్రమంలో మెయిల్‌ లింక్‌లను క్లిక్‌ చేయొద్దు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.