
హూస్టన్: మంచు తుపాను ధాటికి వణికిపోయిన టెక్సాస్ నగరం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. హిమపాతం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విద్యుత్ గ్రిడ్ పునరుద్ధరణ కొనసాగుతోంది. దీంతో నాలుగు రోజులుగా చీకట్లో మగ్గిన టెక్సాస్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మంచినీరు, ఆహారానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అమెరికాలోని టెక్సాస్‌లో మంచు తుపాను తీవ్రతకు దాదాపు 30లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను తీవ్రత కాస్త తగ్గిన వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టిన అధికారులు.. చాలా ప్రాంతాల్లో వీటిని పునరుద్ధరించగలిగారు. ఇంకా లక్షా 85వేల నివాసాలను విద్యుత్ సరఫరా అందుబాటులోకి రాలేదు. ఇక వర్జీనియా, లూసియానా ప్రాంతాల్లోనూ వేల సంఖ్యలో ఇళ్ల చీకట్లోనే ఉన్నాయి.
మంచు తీవ్రతకు ఆరుగురు మృతి
విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర చలికి వణికిపోతున్న వృద్ధులు వీటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఉత్తర టెక్సాస్‌లోని అబిలీన్ ప్రాంతంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ లేని కారణంగా మరికొందరు ఆహారం తయారు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుక అధికారులు దుప్పట్లు, నీరు, ఇంధనాన్ని అవసరమైన వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తుపాను తీవ్రత కలిగిన ప్రాంతాలపై సమీక్షించిన అధ్యక్షుడు జో బైడెన్, వారికి ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.