అసత్యాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు:లోకేశ్‌

తాజా వార్తలు

Published : 11/12/2020 01:27 IST

అసత్యాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు:లోకేశ్‌

అమరావతి: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించకుంటే ఉద్యమ కార్యాచరణతో పోరాడతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. తడిసి దెబ్బతిన్న, రంగుమారిన పంటలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.. ప్రత్యామ్నాయ సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.30 వేలు, ఉద్యాన పంటలకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలుగు రైతు అధ్యక్షులు, కార్యదర్శులతో లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఇటీవలే పదవులు పొందిన వీరు లోకేశ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

‘‘రాష్ట్రంలో రైతు రాజ్యం తీసుకొస్తానన్న సీఎం జగన్ రైతులే లేని రాజ్యాన్ని తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారు. వైకాపా విధానాలతో ఏడాదిన్నర కాలంలో 496 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకపోవటం వల్లే నివర్ తుపాన్‌ ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పంటల బీమా చెల్లించకుండా అసెంబ్లీలో అసత్యాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు. ముందుగానే బీమా ప్రీమియం చెల్లించి ఉంటే రైతులకు రూ. 4వేల కోట్లు పరిహారం లభించేది. రైతులకు లాభం చూకూర్చే అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు’’ అని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి అనుబంధ సంఘాలే వెన్నుదన్నుగా నిలవాలని.. కష్టపడే వారికే పదవులు, గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. పదవులను అలంకారంగా భావిస్తే మూడు నెలల్లో మార్పు తప్పదని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని