రాజకీయ లబ్ధికే జలజగడం
close

ప్రధానాంశాలు

రాజకీయ లబ్ధికే జలజగడం

రాయలసీమకు అన్యాయం చేస్తున్న ఇరు రాష్ట్రాల సీఎంలు
మాజీ మంత్రి మైసూరారెడ్డి వ్యాఖ్యలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు రాజకీయ లబ్ధి కోసమే జల జగడం సృష్టించి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి, గ్రేటర్‌ రాయలసీమ ఉద్యమ కమిటీ నేత ఎం.వి.మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. వారిద్దరూ చర్చించుకుంటే పరిష్కారమయ్యే సమస్యను పెద్దది చేసి పంచాయితీని కేంద్రం చేతుల్లో పెట్టారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ గ్రేటర్‌ రాయలసీమ ప్రాజెక్టులైన హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, వెలిగొండ, సోమశిల, కండలేరు సాగునీటి పథకాలకు గొడ్డలిపెట్టు. రాయలసీమ కూడా ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగమని మరిచిపోయి కేంద్రం ఇచ్చిన గెజిట్‌ను ఏపీ ప్రభుత్వం స్వాగతించడం దారుణం.

కృష్ణా డెల్టా ఆధునికీకరణ ద్వారా ఆదా అయ్యేవి, హైదరాబాద్‌ మంచినీటి పథకానికి వాడుతున్న వాటిలో రీజనరేటెడ్‌ నీళ్లు, పోలవరం ద్వారా మళ్లించే గోదావరి జలాల్లో మొత్తంగా 71 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకుంటున్నా ఏపీ ప్రభుత్వం ఎందుకు నిలదీయలేకపోతోంది? శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ఇష్టమొచ్చినట్లు నీటిని ఖాళీ చేస్తున్నా ఏపీ పాలకులు నిద్రపోతున్నారు. గ్రేటర్‌ రాయలసీమకే ఓ ప్రత్యేక ప్రభుత్వం ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు.. ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకమయ్యేదీ కాదు’ అని అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని