రూ.10 లక్షలు రాయితీనా? రుణమా?

ప్రధానాంశాలు

రూ.10 లక్షలు రాయితీనా? రుణమా?

దళితబంధు పథకంపై స్పష్టత కావాలి
భట్టివిక్రమార్క డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలుచేయాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క డిమాండ్‌ చేశారు. గిరిజన కుటుంబాలు, ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాలకు కూడా ఈ తరహాలోనే ఆర్థిక తోడ్పాటు అందించాలన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో సోమవారం జరిగిన దళితబంధు సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. సీఎం వద్ద జరిగిన సమావేశంలో తాను మాట్లాడని అంశాలపై పత్రికా ప్రకటన ఇచ్చారని పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద భట్టివిక్రమార్క విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు అమలు చేయాలంటే రూ.1.7 లక్షల కోట్లు  అవసరం. ఈ నేపథ్యంలో ఏ సంవత్సరం ఎంత ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఆ రూ.10 లక్షలు పూర్తి రాయితీనా? రుణమా? అనేది చెప్పాలి. నగదు అందుకున్న కుటుంబం రెండు మూడు రకాల వ్యాపారాలు చేసుకునేలా అవకాశం కల్పించాలి. ఈ పథకంపై అనేక సందేహాలున్న నేపథ్యంలో శాసనసభను సమావేశపరిచి చర్చించాలి’’ అని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరించినట్లే ఇప్పుడు కూడా కొనాలని భట్టివిక్రమార్క డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. కేంద్రం వద్దన్నందున ధాన్యం కొనేదిలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎంకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. 

* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ త్వరలో మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలంలో పర్యటించనున్నట్లు భట్టివిక్రమార్క తెలిపారు. దళితబంధు పథకంపై సోమవారం సీఎంతో జరిగిన సమావేశంలో ధరణి పోర్టల్‌లో సమస్యలను, చింతకాని మండలంతో పాటు పలు ప్రాంతాల్లో కొన్ని భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించినట్లు తెలిపారు. దీనిపై సీఎం స్పందించి చింతకాని మండలంలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని సీఎస్‌కు సూచించారని వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని