close

తాజా వార్తలు

గబ్బర్‌... మీసం మెలేసేనా!!

ప్రపంచకప్‌ తర్వాత ఫామ్‌ కోల్పోయిన శిఖర్‌ ధావన్‌

గాయాలతో ఇబ్బంది పడుతున్న ఓపెనర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: శిఖర్‌ ధావన్‌.. ఐసీసీ ఈవెంట్లలో దుమ్ముదులిపే భారత బ్యాట్స్‌మన్‌. 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా టైటిల్‌ సాధించినా.. 2017లో రన్నరప్‌గా నిలిచినా.. అందుకు కారణం అతడి మెరుపులే. ఇక ఆస్ట్రేలియాలో జరిగిన 2015 వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్‌ సెమీస్‌ చేరడంలో తనదైన ముద్రవేశాడు‌. టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసి సత్తా చాటాడు. భారీ టోర్నీల్లోనే కాకుండా జట్టుకు అవసరమైన వేళ భారీ ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నాడు. ప్రపంచకప్‌లో ఆసీస్‌ పోరులో చేతివేలిక గాయమైనా.. నొప్పి వేధిస్తున్నా.. అద్భుత శతకం బాది విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఫామ్‌ కోల్పోయాడు. డిసెంబర్‌ 5న 34వ వసంతంలోకి అడుగుపెడుతున్న గబ్బర్‌ తిరిగి లయ అందుకొనేనా..!!


ఫామ్‌ లేమి

గాయం నుంచి కోలుకున్న శిఖర్‌ ధావన్‌ విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో జట్టులోకి వచ్చాడు. పూర్తిగా విఫలమయ్యాడు. బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్‌లోనూ రాణించలేదు. దిల్లీలో టీ20లో 41 పరుగులు మినహా మిగతా మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోయాడు. ఇక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తన సొంత జట్టు దిల్లీ తరఫున బరిలోకి దిగి పూర్తిగా నిరాశపరిచాడు. 24, 35, 19, 9, 0.. చివరి ఐదు మ్యాచ్‌ల్లో అతడి పరుగులివి. రోహిత్‌తో జత కలిస్తే చెలరేగిపోయే ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ ప్రపంచకప్‌ తర్వాత సరిగ్గా ఆడలేకపోతున్నాడు. దీంతో అతడు మెరుగవ్వాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.


రెడీగా.. రాహుల్‌

ప్రపంచకప్‌లో ధావన్‌ లేని లోటును కేఎల్‌ రాహుల్‌ పూరించాడు. రోహిత్‌ శర్మతో కలిసి మిగిలిన మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఓపెనింగ్‌ చేసి శుభారంభాలు అందించాడు. భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోయినా నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రపంచకప్‌లో వరుసగా 57, 30, 48, 0, 77, 111 పరుగులు చేశాడు. ధావన్‌ గనక ఫామ్‌లోకి రాకుంటే అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు రాహుల్‌ సిద్ధంగా ఉన్నాడు. మంచి స్ట్రోక్‌ప్లే, అద్భుతమైన టెక్నిక్‌ అతడి సొంతం. గబ్బర్‌ త్వరగా ఫామ్‌ అందుకోకపోతే సంజు శాంసన్‌ రూపంలోనూ ముప్పు ఎదురుకానుంది.


మయాంక్‌, పృథ్వీ సై

మరోవైపు, రోహిత్‌శర్మ ఇటీవలే టెస్టుల్లో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగుతున్నాడు. విశేషంగా రాణిస్తూ జట్టు కష్టాలను తీరుస్తున్నాడు. ధావన్‌ను వన్డే, పొట్టి ఫార్మాట్లకే పరిమితం చేయడంతో యువ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. హిట్‌మ్యాన్‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తున్న మయాంక్‌ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ జట్లపై టెస్టుల్లో చెలరేగాడు. వరుస సిరీస్‌ల్లో రెండు ద్విశతకాలు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో స్థానం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. సంజు శాంసన్‌, పృథ్వీషా సైతం వరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శిఖర్‌ ధావన్‌ ఎంత త్వరగా ఫామ్‌లోకి వస్తే అంత మంచిది. లేదంటే యువ ఆటగాళ్లతో పోటీలో నెగ్గడం కష్టమవుతుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.