రాహుల్‌+కుంబ్లే @ 3 ఏళ్ల వ్యూహం!

తాజా వార్తలు

Updated : 20/11/2020 04:33 IST

రాహుల్‌+కుంబ్లే @ 3 ఏళ్ల వ్యూహం!

ఇకపై అన్ని మ్యాచుల్లో క్రిస్‌గేల్‌: వాడియా

దిల్లీ: గతంలో కోచ్‌లు, సారథులను తరచూ మార్చేవిధానం దెబ్బతీయడంతో కోచ్‌ అనిల్ ‌కుంబ్లే, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ నేతృత్వంలో మూడేళ్ల కాలానికి ప్రణాళికలు సిద్ధం చేశామని పంజాబ్‌ సహ యజమాని నెస్‌వాడియా అన్నారు. సీనియర్‌ ఆటగాడు క్రిస్‌గేల్‌ వచ్చే సీజన్లో అన్ని మ్యాచుల్లో ఆడతాడని పేర్కొన్నారు. కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడకపోవడంతో ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయామని వెల్లడించారు.

ఈ సీజన్లో అభిమానులను పంజాబ్‌ అమితంగా అలరించింది. సూపర్‌ ఓవర్లతో అబ్బురపరిచింది. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి ఆ తర్వాత మళ్లీ వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి అద్భుతం చేసింది. చెన్నైతో ఆఖరి లీగ్ ‌మ్యాచులో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్‌ బెర్తు చేజారింది. రాహుల్‌ అత్యధిక పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

‘ఇప్పుడు జట్టులో కొత్త సారథి, కొత్త కెప్టెన్‌, కొత్త ఆటగాళ్లు ఉన్నారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి జట్టు మెరుస్తుంది. కొన్నిసార్లు కుదరదు. వేలం సమీపిస్తోంది. అందులో మిడిలార్డర్‌, డెత్‌ బౌలింగ్‌ సమస్యలు పరిష్కరించుకుంటాం. కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు (మాక్స్‌వెల్‌, కాట్రెల్‌) అంచనాలను అందుకోలేదు. క్రిస్‌గేల్‌కు అన్ని మ్యాచుల్లో అవకాశం ఇవ్వకపోవడం జట్టు యాజమాన్యం నిర్ణయం. తనకు దొరికిన అవకాశాలను గేల్‌ సద్వినియోగం చేసుకొని మెరుపులు మెరిపించాడు. వచ్చే సీజన్లో ఒకటో మ్యాచ్‌ నుంచే ఆడతాడు’ అని వాడియా తెలిపారు.

ఐపీఎల్‌లో తొమ్మిదో జట్టు చేరికపై వాడియా స్పందించారు. లీగ్‌పై ఆసక్తి తగ్గనంత వరకు, ఇతర ఫ్రాంచైజీల ఆర్థిక ప్రయోజనాలకు ఇబ్బంది లేనంతవరకు ఫర్వాలేదని పేర్కొన్నారు. కోచ్‌కు సంబంధించి అనిల్‌కుంబ్లేతో మూడేళ్ల వ్యూహం అమలు చేయబోతున్నామని వెల్లడించారు. కేవలం ఒక్క మ్యాచు ఓటమితో ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌ అవకాశాలు చేజార్చుకున్నామని తెలిపారు.

కేఎల్‌ రాహుల్‌ దూకుడుగా ఆడుతున్నాడని, మూడేళ్లుగా జట్టుకు అండగా ఉంటున్నాడని వాడియా వివరించారు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ అతడిలోని సారథి ఆత్మవిశ్వాసంతో కనిపించాడని వెల్లడించారు. లీగులో షార్ట్‌రన్‌ వంటి నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తప్పిదాల వల్ల అన్ని జట్లకూ ఇబ్బందేనని స్పష్టం చేశారు. దిల్లీతో జరిగిన మ్యాచులో అంపైర్‌ తప్పిదంతో పంజాబ్‌ ఖాతాలో ఒక పరుగు చేరలేదు. దాంతో ఆ మ్యాచ్‌ సూపర్‌ఓవర్‌కు దారితీసింది. అదీ గెలుచుంటే రాహుల్‌ సేన సులువుగా ప్లేఆఫ్స్‌ చేరుకొనేది!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని