
తాజా వార్తలు
పాండ్య మెరిసినా కోహ్లీసేన ఓటమి
375 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా విఫలం
రాణించిన ఆరోన్ ఫించ్, స్టీవ్‌స్మిత్, మాక్స్వెల్
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనను టీమ్ఇండియా ఓటమితో ఆరంభించింది. తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసింది. 375 పరుగుల లక్ష్య ఛేదనలో 308/8కే పరిమితమైంది. 66 పరుగుల భారీ తేడాతో అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఛేదనలో హార్దిక్ పాండ్య (90; 76 బంతుల్లో 7×4, 4×6), శిఖర్ ధావన్ (74; 86 బంతుల్లో 10×4) మెరిసినా వారికి తోడుగా మరెవ్వరూ రాణించలేదు. అంతకు ముందు ఆసీస్‌లో ఆరోన్ ఫించ్ (114; 124 బంతుల్లో 9×4, 2×6), స్టీవ్‌స్మిత్ (102; 66 బంతుల్లో 11×4, 4×6) శతకాలు బాదగా డేవిడ్ వార్నర్ (69; 76 బంతుల్లో 6×4), మాక్స్వెల్ (45; 19 బంతుల్లో 5×4, 3×6) అదరగొట్టారు.
దెబ్బకొట్టిన ‘జోష్’
టీమ్ఇండియాకు మయాంక్ అగర్వాల్ (22; 18 బంతుల్లో 2×4, 1×6), శిఖర్ ధావన్ శుభారంభమే అందించారు. 5 ఓవర్లకే స్కోరును 50 దాటించారు. అయితే జోష్‌లో ఉన్న హేజిల్‌వుడ్ (3/55) జట్టును దెబ్బకొట్టాడు. 5.2వ బంతికి మయాంక్‌ను ఔట్ చేశాడు. రావడంతోనే ఎదురుదాడికి దిగిన విరాట్ కోహ్లీ (21; 21 బంతుల్లో 2×4, 1×6), యువ శ్రేయస్ అయ్యర్ (2)ను పదో ఓవర్లో పెవిలియన్ పంపించాడు. అప్పటికి స్కోరు 80/3. మరో 11 పరుగులకే కేఎల్ రాహుల్ (12; 15 బంతుల్లో 1×4)ను జంపా (4/54) బోల్తా కొట్టించడంతో టీమ్ఇండియా 101/4తో కష్టాల్లో పడింది.
ఆదుకున్న గబ్బర్, పాండ్య
భారీ తేడాతో ఓటమి తప్పదనుకున్న కోహ్లీసేనను శిఖర్ ధావన్‌తో కలిసి హార్దిక్ పాండ్య ఆదుకున్నాడు. వీరిద్దరూకలిసి ఐదో వికెట్‌కు 128 పరుగుల చక్కని భాగస్వామ్యం అందించి గెలుపుపై ఆశలు రేపారు. ఆసీస్ బౌలర్లు విసిరిన కట్టుదిట్టమైన బంతుల్ని గౌరవిస్తూనే సొగసైన బౌండరీలు బాదేశారు. ముఖ్యంగా పాండ్య కళ్లుచెదిరే సిక్సర్లు దంచాడు. అర్ధశతకాల తర్వాత గేరు మార్చే క్రమంలో 34.3వ బంతికి ధావన్‌ను జంపా ఔట్ చేసి కీలకమైన భాగస్వామ్యాన్ని విడదీశాడు. అప్పటికి స్కోరు 229. ఆదుకుంటాడనుకున్న పాండ్యపై ఒత్తిడి పెరగడంతో 247 వద్ద అతడూ జంపాకే వికెట్ ఇచ్చేశాడు. దాంతో ఓటమి ఖరారైపోయింది. ఆ తర్వాత రవీంద్ర జడేజా (25; 37 బంతుల్లో 1×6), నవదీప్ సైని (29*), మహ్మద్ షమి (13) పరుగుల అంతరం తగ్గించేందుకు ప్రయత్నించారు.
స్మిత్, మాక్సీ విధ్వంసం
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను టీమ్ఇండియా బౌలర్లు కంగారు పెట్టించలేదు. సమయోచితంగా వికెట్లు తీస్తూ పరుగుల్ని నియంత్రించడంలో విఫలమయ్యారు. పేసర్ మహ్మద్ షమి (3/59) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియాలో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (114; 124 బంతుల్లో 9×4, 2×6), స్టీవ్‌స్మిత్ (102; 66 బంతుల్లో 11×4, 4×6) ఆటే హైలైట్. వీరిద్దరూ శతకాలతో చెలరేగారు. మొదట డేవిడ్ వార్నర్ (69; 76 బంతుల్లో 6×4)తో కలిసి తొలి వికెట్‌కు ఫించ్ 156 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 27.5వ బంతికి వార్నర్‌ను షమి ఔట్ చేసినా భారత్‌కు కలిసిరాలేదు. పరుగుల దాహంతో ఉన్న స్టీవ్‌స్మిత్ క్రీజులోకి వచ్చింది మొదలు ఎడాపెడా సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. 36 బంతుల్లో 50, 62 బంతుల్లో 100 బాదేశాడు. ఫించ్ ఔటైనా అతడు మాత్రం ఆఖరి ఓవర్ వరకు ఆడేశాడు. చివర్లో మాక్స్వెల్ (45; 19 బంతుల్లో 5×4, 3×6) సైతం విధ్వంసకరంగా ఆడి ఆసీస్ స్కోరును 374కు చేర్చాడు.
భారత్×ఆస్ట్రేలియా తొలి వన్డే లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- సాహో భారత్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
