కుంగుబాటుకు గురైన విరాట్‌ కోహ్లీ

తాజా వార్తలు

Published : 19/02/2021 16:52 IST

కుంగుబాటుకు గురైన విరాట్‌ కోహ్లీ

ఏకాకి అయ్యానని బాధపడ్డ పరుగుల రారాజు

దిల్లీ: ఇంగ్లాండ్‌లో 2014లో పర్యటించినప్పుడు కుంగుబాటుకు గురయ్యానని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవ్వడంతో ‘ప్రపంచంలో నేన్కొడినే ఒంటరి’ అని బాధపడ్డానని తెలిపాడు. ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు మార్క్‌ నికోలస్‌ నిర్వహించిన ‘నాట్‌ జస్ట్‌ క్రికెట్‌’ పాడ్‌కాస్ట్‌లో తన జీవితంలో కఠిన దశగురించి వివరించాడు.

ఆ సిరీసులో ఐదు టెస్టుల్లో కోహ్లీ వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు మాత్రమే చేశాడు. పది ఇన్నింగ్సుల్లో 13.50 సగటు మాత్రమే సాధించాడు. ఆ పర్యటన తర్వాత ఆసీస్‌కు వెళ్లిన విరాట్‌ అక్కడ 692 పరుగులు చేసి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

కుంగుబాటుకు గురయ్యారా అన్న ప్రశ్నకు విరాట్‌ ‘అవును. అయ్యాను’ అని జవాబిచ్చాడు. ‘పరుగులు చేయలేకపోతున్నామని తెలిసిన అనుభూతి గొప్పదేం కాదు. ప్రతి క్రికెటర్‌ ఏదో ఒకదశలో తన నియంత్రణలో ఏదీ ఉండదని అనుకుంటాడు. అప్పుడు నా జీవితంలో అండగా నిలిచేవాళ్లున్నా ప్రపంచంలో నేను ఒంటరినని అనిపించేది. మాట్లాడేందుకు మనుషులు లేరని కాదు. నా మనసులో ఏముందో పూర్తిగా అర్థం చేసుకొనే నిపుణుడు లేరనిపించింది. నిజానికి ఇది పెద్ద విషయం. ఈ పరిస్థితిలో మార్పు చూడాలనుకున్నా’ అని కోహ్లీ అన్నాడు.

కెరీర్‌ను నాశనం చేయగల మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూదని విరాట్‌ తెలిపాడు. ‘నాకిలా అనిపిస్తోంది. నిద్రపోవడమూ కష్టంగా ఉంది. పొద్దున్నే లేవాలనిపించడం లేదు. నాపై నాకు నమ్మకం ఉండటం లేదు. వీటిని పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి? అని చెప్పుకొనేందుకు ఒకరు ఉండాలి. కొందరు ఇలాంటి అనుభవాలతోనే సుదీర్ఘ కాలం గడుపుతారు. ఒక్కోసారి క్రికెట్‌ సీజన్‌ అంతా ఇలాగే బాధపడతారు. దాన్నుంచి తప్పించుకోలేరు. ఇలాంటప్పుడు నిపుణుల సహాయం అవసరమని నిజాయతీగా చెప్పగలను’ అని అతడు పేర్కొన్నాడు.

1990ల్లో టీమ్‌ఇండియాను చూసి క్రికెట్లోకి రావాలని బలంగా నిర్ణయించుకున్నానని విరాట్‌ తెలిపాడు. ‘90ల్లోని భారత జట్టు నా ఊహాత్మక శక్తిని ప్రేరేపించింది. నమ్మకం, నిర్ణయం ఉంటే అద్భుతాలు జరుగుతాయని నన్ను నేను విశ్వసించాను. దేశం తరఫున ఆడాలన్న జ్వాల రగిలింది’ అని అతడు వెల్లడించాడు. ‘18 ఏళ్ల వయసులో మా నాన్న మరణించారు. ఆ సంఘటన నాపై విపరీతంగా ప్రభావం చూపించింది. నా అంతరంగంలోకి నేను చూసుకొన్నాను. బాల్యంలో క్రికెట్‌ ఆడేటప్పుడు మా నాన్న చాలా కష్టపడ్డారు. ఏదేమైనా నా కల నెరవేరుతుందని, దేశం తరఫున అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడటం నిజమవుతుందని అప్పుడే గట్టిగా విశ్వసించాను’ అని విరాట్‌ పేర్కొన్నాడు.

నిజ జీవితంలోనూ మైదానంలో ఉన్నట్టే ఉంటానని కోహ్లీ తెలిపాడు. ఇతరుల కోణంలో తన అభిప్రాయాలు చూసుకోనని, సొంతంగా పనిచేసుకుంటూ వెళ్తానని వెల్లడించాడు. ‘వ్యక్తిగతంగా నేనేం చేస్తానన్నదే నాకు ముఖ్యం. అలాగే మైదానంలోనూ కృషి చేస్తాను. కొంతమంది ముందు బాగా కనిపించాలని భావించను. నేనలాంటి వ్యక్తిని కాను. అంచనాల విషయానికి వస్తే వాటి గురించి ఆలోచిస్తే భారంగా అనిపిస్తుంది’ అని విరాట్‌ తెలిపాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని