ఆనంద్‌ మహీంద్రాకు నటరాజన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ 

తాజా వార్తలు

Updated : 02/04/2021 12:06 IST

ఆనంద్‌ మహీంద్రాకు నటరాజన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ 

థార్‌ ఎస్‌యూవీ కారు బహుమతికి..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం సిరీస్‌లోనే అద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లకు ప్రముఖ ఆటోమొబైల్‌ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా అప్పట్లో థార్‌ ఎస్‌యూవీ కార్లను బహుమతులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కంగారూల గడ్డపై తొలి టెస్టులో ఘోరంగా ఓటమిపాలైన టీమ్‌ఇండియా తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో చెలరేగి ఆడి 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లు.. శార్దూల్ ఠాకూర్‌‌, నవ్‌దీప్‌ సైని, నటరాజన్‌, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. దాంతో వీరి ప్రదర్శన మెచ్చిన మహీంద్రా తన కంపెనీ నుంచి తలా ఓ ఎస్‌యూవీ కారును బహుమతిగా ఇస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నటరాజన్ తాజాగా ఆ కారును అందుకున్నాడు. అయితే, ఆ బహుమతికి గుర్తుగా అతడు కూడా మహీంద్రాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడం ఇప్పుడు విశేషం. 

గబ్బాలో చారిత్రక విజయం సాధించిన టీమ్‌ఇండియా.. ఆ టెస్టులో తాను ధరించిన జెర్సీని నటరాజన్‌.. మహీంద్రాకు బహుమతిగా ఇచ్చాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ గురువారం రాత్రి రెండు ట్వీట్లు చేశాడు. ‘టీమ్‌ఇండియాకు ఆడడం నా జీవితంలో అతిపెద్ద గర్వకారణం. నా ఎదుగుదల మొత్తం అనూహ్యంగా జరిగింది. ఈ ప్రయాణంలో నాకు లభించిన ప్రేమాభిమానాలు నన్ను మైమరపించాయి. ఇలా వెన్నుతట్టి ప్రోత్సహించే అద్భుతమైన వ్యక్తులు వెంట ఉంటే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసుకునే మార్గాలు నా ముందుకు వస్తాయి. నాకు మహీంద్రా థార్‌ను బహుమతిగా ఇచ్చినందుకు ఆనంద్‌ మహీంద్రా సర్‌కు ధన్యవాదాలు. నన్నూ, నా ప్రయాణాన్ని గుర్తించినందుకు ఆయనకు మనసారా కృతజ్ఞతలు చెబుతున్నాను. క్రికెట్‌ పట్ల తనకున్న అమితమైన ప్రేమకు గుర్తుగా నా గబ్బా టెస్టు జెర్సీని సంతకంతో అందజేస్తా’ అని నటరాజన్‌ భావోద్వేగపూరితంగా స్పందించాడు. ఈ సందర్భంగా ఎస్‌యూవీ కారుతో పాటు తాను సంతకం చేస్తున్న జెర్సీ ఫొటోలను నటరాజన్‌ అభిమానులతో పంచుకున్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని