close
భళిభళిరా బంగ్లా

విండీస్‌పై అద్భుత విజయం
41.3 ఓవర్లో 322 పరుగుల ఛేదన
షకిబ్‌ అజేయ శతకం

బంగ్లాదేశ్‌ సంచలనాలు లేకపోతే అది ప్రపంచకప్‌ ఎలా అవుతుంది? మొన్న దక్షిణాఫ్రికాను మట్టికరిపించిన బంగ్లా పులులు ఈసారి విండీస్‌పై పంజా విసిరారు.
భీకర బ్యాట్స్‌మెన్‌తో నిండిన విండీస్‌ను బంగ్లా మామూలుగా కొట్టలేదు. చిత్తు చిత్తుగా చిరకాలం గుర్తుండేలా చితక్కొట్టింది.
షకిబ్‌, లిటన్‌ దాస్‌ రెచ్చిపోయారు. నిర్దాక్షిణ్య బ్యాటింగ్‌తో విండీస్‌ బౌలర్లను ఉతికారేస్తూ.. పరుగుల వరద పారించారు. ఈ ఇద్దరి కళ్లు చెదిరే విన్యాసాలతో 322 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం బంగ్లా ఉఫ్‌మని ఊదేసింది. మరో 51 బంతులు  మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
సెమీఫైనల్‌కు వెళ్లగలిగే సత్తా ఉన్న జట్టుగా టోర్నీలో అడుగుపెట్టిన విండీస్‌.. ఈ పరాజయంతో తుది-4  రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే!

టాంటన్‌

బంగ్లాదేశ్‌ అదరగొట్టింది. షకిబ్‌ అల్‌ హసన్‌ (124 నాటౌట్‌; 99 బంతుల్లో 16×4) అదిరే శతకం సాధించిన వేళ వెస్టిండీస్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. షై హోప్‌ (96; 121 బంతుల్లో 4×4, 1×6), లూయిస్‌ (70; 67 బంతుల్లో 6×4, 2×6), హెట్‌మయర్‌ (50; 26 బంతుల్లో 4×4, 3×6) మెరవడంతో మొదట వెస్టిండీస్‌ 8 వికెట్లకు 321 పరుగులు సాధించింది. షకిబ్‌కు తోడు లిటన్‌ దాస్‌ (94 నాటౌట్‌; 69 బంతుల్లో 8×4, 4×6) రెచ్చిపోయిన వేళ.. లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ 41.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.

ఆ జోడీ అదరహో..: లక్ష్యం పెద్దది కావడంతో బంగ్లాదేశ్‌కు కష్టమే అనిపించింది. కానీ ఆ జట్టు ఛేదనను దాటిగా ఆరంభించింది. తమీమ్‌ ఇక్బాల్‌ (48; 53 బంతుల్లో 6×4), సౌమ్య సర్కార్‌ (29; 23 బంతుల్లో 2×4, 2×6) తొలి వికెట్‌కు 8.1 ఓవర్లలో 52 పరుగులు జోడించారు. సర్కార్‌ ఔటయ్యాక షకిబ్‌ క్రీజులోకి రావడంతో స్కోరు వేగం ఇంకా పెరిగింది. విండీస్‌ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్న షకిబ్‌.. చక్కని షాట్లతో అలరించాడు. ఆద్యంతమూ అదే దూకుడును కొనసాగించాడు. ఓ దశలో 121/1తో ఉన్న బంగ్లా..  కొద్ది తేడాలో తమీమ్‌, ముష్ఫికర్‌ (1) వికెట్లు కోల్పోయి 133/3కు చేరుకుంది. పట్టుబిగించడానికి విండీస్‌కు అదో చక్కని అవకాశం. కానీ జోరుమీదున్న షకిబ్‌కు లిటన్‌ తోడవడంతో బంగ్లా బ్యాటింగ్‌ గేర్‌ మారింది. వీళ్లు సాధికార బ్యాటింగ్‌తో విండీస్‌ బౌలర్లను నిస్సహాయులుగా మార్చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. బంగ్లా వడివడిగా లక్ష్యం దిశగా సాగింది. థామస్‌ బౌలింగ్‌లో ఓ కవర్‌ డ్రైవ్‌తో షకిబ్‌ శతకం (83 బంతుల్లో) పూర్తి చేసుకోగా.. గాబ్రియెల్‌ బౌలింగ్‌లో లిటన్‌ దాస్‌ వరుసగా మూడు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. ఏ దశలో విండీస్‌ బౌలర్లు వీరిని అడ్డుకునేలా కనపడలేదు. షకిబ్‌-లిటన్‌ జోడీ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 189 పరుగులు జోడించి లక్ష్యాన్ని పూర్తి చేసింది. వీరి జోరు చూస్తే.. 400 లక్ష్యాన్ని కూడా బంగ్లా ఛేదించేదేమో అనిపించింది.

రాణించిన హోప్‌, హెట్‌మయర్‌: అంతకుముందు వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ పేలవంగానే ఆరంభమైంది. 10 ఓవర్లకు స్కోరు 32 పరుగులే. లూయిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన గేల్‌. 13 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండా ఔటయ్యాడు. అయితే హోప్‌ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. లూయిస్‌తో రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించి భారీ స్కోరు స్కోరుకు బాటలు వేశాడు. లూయిస్‌ ఔటయ్యాక పూరన్‌ (25)తో మూడో వికెట్‌కు హోప్‌ 37 పరుగులు జోడించాడు. పూరన్‌ నిష్క్రమణతో వచ్చిన హెట్‌మయర్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. హెట్‌మయర్‌ కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. విండీస్‌ 39.2 ఓవర్లలో 242/3తో అత్యంత పటిష్టస్థితిలో నిలిచింది. ఆ జట్టు 350పై కన్నేసిన దశ అది. కానీ హెట్‌మయర్‌, రసెల్‌ (0) ఒక్క పరుగు తేడాలో ఔటయ్యారు. హోల్డర్‌ (33; 15 బంతుల్లో 4×4, 2×6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. హోప్‌తో ఆరో వికెట్‌కు 39 పరుగులు జోడించాడు. కానీ 44వ ఓవర్లో అతడు ఔటయ్యాక విండీస్‌ జోరు తగ్గిపోయింది. చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 33 పరుగులు మాత్రమే చేయగలిగింది.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: గేల్‌ (సి) ముష్ఫికర్‌ (బి) సైఫుద్దీన్‌ 0; లూయిస్‌ (సి) షబ్బీర్‌ (బి) షకిబ్‌ 70; హోప్‌ (సి) లిటన్‌ దాస్‌ (బి) ముస్తాఫిజుర్‌ 96; పూరన్‌ (సి) సౌమ్య సర్కార్‌ (బి) షకిబ్‌ 25; హెట్‌మయర్‌ (సి) తమీమ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 50; రసెల్‌ (సి) ముష్ఫికర్‌ (బి) ముస్తాఫిజుర్‌ 0; హోల్డర్‌ (సి) మహ్మదుల్లా (బి) సైఫుద్దీన్‌ 33; డారెన్‌ బ్రావో (బి) సైఫుద్దీన్‌ 19; థామస్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 22 మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 321;
వికెట్ల పతనం: 1-6, 2-122, 3-159, 4-242, 5-243, 6-282, 7-297, 8-321;
బౌలింగ్‌: మొర్తజా 8-1-37-0; సైఫుద్దీన్‌ 10-1-72-3; ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ 9-0-59-3; మెహదీ హసన్‌ 9-0-57-0; మొసాదెక్‌ 6-0-36-0; షకిబ్‌ 8-0-54-2

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తమీమ్‌ రనౌట్‌ 48; సౌమ్య సర్కార్‌ (సి) గేల్‌ (బి) రసెల్‌ 29; షకిబ్‌ నాటౌట్‌ 124; ముష్ఫికర్‌ (సి) హోప్‌ (బి) థామస్‌ 1; లిటన్‌ దాస్‌ నాటౌట్‌ 94; ఎక్స్‌ట్రాలు 26 మొత్తం: (41.3 ఓవర్లలో 3 వికెట్లకు) 322;
వికెట్ల పతనం: 1-52, 2-121, 3-133;
బౌలింగ్‌: కాట్రెల్‌ 10-0-65-0; హోల్డర్‌ 9-0-62-0; రసెల్‌ 6-0-42-1; గాబ్రియెల్‌ 8.3-0-78-0; థామస్‌  6-0-52-1; గేల్‌ 2-0-22-0

25

అర్ధసెంచరీ కోసం హెట్‌మయర్‌ ఆడిన బంతులు. ఈ ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన బ్యాట్స్‌మన్‌గా అతడు ఆసీస్‌ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ కేరీ (భారత్‌పై) రికార్డును పంచుకున్నాడు.

105

హోల్డర్‌ కొట్టిన ఓ సిక్స్‌ వెళ్లిన దూరం. ఈ టోర్నీలో ఇదే అతి పెద్ద సిక్స్‌.

షకిబ్‌.. ఏమిటీ ప్రవాహం?

75.. 64.. 121.. 124 నాటౌట్‌.. ఈ ప్రపంచకప్‌లో షకిబ్‌ అల్‌హసన్‌ స్కోర్లివి. ఇవేమీ చిన్నా చితకా జట్ల మీద సాధించినవి కావు. వరుసగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌లపై అతనీ స్కోర్లు సాధించాడు. బంగ్లాదేశ్‌ తన తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికాను మట్టికరిపించి సంచలనం సృష్టించిందన్నా.. సోమవారం వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిందన్నా.. అందులో షకిబ్‌ పాత్ర కీలకం. న్యూజిలాండ్‌పైనా బంగ్లాను గెలిపించేందుకు గట్టిగానే ప్రయత్నించాడు షకిబ్‌. టైటిల్‌ ఫేవరెట్‌ ఇంగ్లాండ్‌ మీదా అతను చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు. షకిబ్‌ కెరీర్లోనే ఇది అత్యుత్తమ దశగా చెప్పొచ్చు. ప్రపంచకప్‌ ముంగిట ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్న షకిబ్‌.. టోర్నీలో ఇలా చెలరేగిపోతాడని ఎవ్వరూ ఊహించలేదు. అతను బంతితోనూ సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మినహాయిస్తే.. పొదుపుగా బౌలింగ్‌ చేసి కీలక వికెట్లు (1/50, 2/47, 2/54) పడగొట్టాడు. టాప్‌, మిడిలార్డర్‌కు మధ్య వారధిలా నిలుస్తున్న షకిబ్‌.. సహచరుల్లోనూ స్ఫూర్తినింపుతూ.. పెద్ద జట్లకు బంగ్లా షాకివ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బంగ్లా నెగ్గిన రెండు మ్యాచ్‌ల్లోనూ అతనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’. షకిబ్‌ మెరుపులతో బంగ్లా ఇప్పుడు సెమీస్‌కు పోటీదారుగా మారింది. అతను ఇదే జోరు కొనసాగిస్తే ఆ జట్టు సెమీస్‌ చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.