close

ప్రధానాంశాలు

Published : 27/01/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూపర్‌ సమరం

టైటిల్‌పై సింధు, శ్రీకాంత్‌ గురి
బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ నేటి నుంచే
బ్యాంకాక్‌


ప్రపంచ బ్యాడ్మింటన్‌లోని అగ్రశ్రేణి క్రీడాకారుల సమరానికి సమయం ఆసన్నమైంది. హరాహోరీ పోరాటాలు.. ఉత్కంఠభరిత ఫలితాలతో హోరెత్తించే మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులు బరిలో దిగే బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ ప్రారంభమయ్యేది నేడే. సుదీర్ఘ విరామానంతరం ఆడిన 2 అంతర్జాతీయ టోర్నీల్లో విఫలమైన భారత స్టార్‌ క్రీడాకారులు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు ప్రతిష్టాత్మక ఫైనల్స్‌లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. డిసెంబరులో జరగాల్సిన ఈ టోర్నీని కరోనా మహమ్మారి కారణంగా ఈ నెల 27 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నారు.

రోనా కారణంగా 10 నెలలు అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉన్న భారత క్రీడాకారులకు పునరాగమనం చేదు అనుభవాన్నే మిగిల్చింది. బ్యాంకాక్‌లో జరిగిన రెండు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లలో భారత స్టార్లు ఘోరంగా విఫలమయ్యారు. మొదటి టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సింధుకు రెండో ఈవెంట్లో క్వార్టర్‌ఫైనల్లో చుక్కెదురైంది. తొలి టోర్నీలో గాయం కారణంగా రెండో రౌండ్‌ నుంచి తప్పుకున్న శ్రీకాంత్‌.. అనివార్య పరిస్థితుల్లో తర్వాతి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. రెండు టోర్నీల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సింధు, శ్రీకాంత్‌లు ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో సత్తాచాటాలని భావిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు లయను దొరకబుచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-బిలో సింధుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), ఇంతానన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌), పోర్న్‌పావీ (థాయ్‌లాండ్‌)లతో సింధు ఒక్కో మ్యాచ్‌ ఆడనుంది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ అనంతరం గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులు సెమీస్‌కు అర్హత సాధిస్తారు. ఒకే గ్రూప్‌లో తై జు, రచనోక్‌ ఉండటం సింధుకు ప్రతికూలాంశం. ఇప్పటి వరకు తై జు, సింధులు 17 సార్లు తలపడగా.. 12 మార్లు ప్రత్యర్థిదే పైచేయి అయింది. సింధు అయిదు సార్లు మాత్రమే తై జుపై నెగ్గింది. రచనోక్‌కు 5-4తో సింధుపై మెరుగైన రికార్డుంది. ఇటీవలి థాయ్‌లాండ్‌ టోర్నీలో సింధును రచనోక్‌ చిత్తుగా ఓడించింది. పోర్న్‌పావీపై సింధుకు 3-1తో మెరుగైన రికార్డుంది. తన కెరీర్‌లో 4 ఫైనల్స్‌లో బరిలో దిగిన సింధు 2018లో విజేతగా నిలవడం ఆమె అత్యుత్తమ ప్రదర్శన. 2016లో సెమీస్‌, 2017లో ఫైనల్‌ చేరుకున్న సింధు 2019లో గ్రూపు దశలోనే నిష్క్రమించింది. గత కొంతకాలంగా లండన్‌లో ప్రత్యేక శిక్షణ  తీసుకుంటున్న సింధు ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌తో సత్తాచాటాలని కోరుకుంటోంది.
తోటి క్రీడాకారులంతా దూరంగా ఉన్నా.. నిరుడు అక్టోబరులో డెన్మార్క్‌ ఓపెన్‌లో పాల్గొనడం శ్రీకాంత్‌కు కలిసొచ్చింది. ఆ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌ చేరుకున్న శ్రీకాంత్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానం సంపాదించాడు. థాయ్‌లాండ్‌ టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగినా అతడి ర్యాంకింగ్‌పై ప్రభావం పడలేదు. ఫైనల్స్‌లో బరిలో దిగే అవకాశం దక్కింది. 2014 ఫైనల్స్‌లో సెమీస్‌ చేరుకున్న శ్రీకాంత్‌ మెగా టోర్నీలో మళ్లీ బరిలో దిగలేదు.గ్రూప్‌-బిలో శ్రీకాంత్‌తో పాటు ఆండర్స్‌ ఆంథోన్సెన్‌ (డెన్మార్క్‌), వాంగ్‌ వీ (చైనీస్‌ తైపీ), లాంగ్‌ ఆగ్నస్‌ (హాంకాంగ్‌)లు ఉన్నారు. వీరిందరిపై మెరుగైన రికార్డు ఉండటం శ్రీకాంత్‌కు కలిసొచ్చే అంశం. వరుస టోర్నీల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న శ్రీకాంత్‌ ప్రపంచ టూర్‌ టైటిల్‌తో థాయ్‌లాండ్‌ పర్యటనను ఘనంగా ముగించాలని భావిస్తున్నాడు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన