close
అక్రమాలపై విస్తృత నిఘా

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంపై నిర్ణయం ఈసీదే
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎన్నికల అక్రమాల నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా నిఘాను విస్తృతం చేశాం. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన తరవాత నిఘాను మరింత విస్తృతం చేస్తాం’ అని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ చెప్పారు. 432 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌, 499 ఎన్నికల ప్రవర్తన నియమావళి తనిఖీ బృందాలు, వీడియో నిఘా, అభ్యర్థుల ఖర్చులను లెక్కించేందుకు 95 గణాంక బృందాలు, సరిహద్దు జిల్లాల తనిఖీకి 57 బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. గురువారం సాయంత్రం సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘ఎన్నికల నియమావళి అమలు విషయంలో పకడ్బందీగా నిఘాను ఏర్పాటు చేస్తున్నాం. రాజీలేకుండా వ్యవహరించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు స్పష్టం చేశాం. గడిచిన ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం అధికంగానే ఉంది. ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు నిఘాను పెంచాం. మద్యం అక్రమ దుకాణాలను మూసివేయటంతోపాటు దుకాణాల సమయాలను విధిగా అమలుచేయాలని ఆదేశించాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలోని కోస్గి వద్ద రూ.51లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపన్ను శాఖ కమిషనర్‌ నివేదిక ఇచ్చారు. ఆ తనిఖీల్లో రూ.17.5కోట్లు పట్టుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. 2014లో రూ.77.1కోట్లు స్వాధీనం చేసుకుంటే, 2018లో రూ.122.7కోట్లు స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు.

‘ఎన్టీ రామారావుపై రూపొందించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విడుదలను వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి, తమకూ ఒక ఫిర్యాదు వచ్చింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నట్లైతే ఆ ఫిర్యాదును పరిశీలించే అవకాశం ఉంది. ఫిర్యాదుదారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులనూ కలిసిన నేపథ్యంలో ఏమి చేయాలన్న అంశంపై అక్కడి నుంచి వచ్చే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆ సినిమాను ముందస్తుగా చూసే ఆలోచన లేదు. కులం, మతం పేరుతో ఓట్లు అడిగినా, కించపరిచినా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించినా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎన్నికల నియమావళి ప్రకారం పదోన్నతులకు సంబంధించిన డీపీసీని నిర్వహించవచ్చు. 8మంది సంయుక్త కార్యదర్శులను అదనపు కార్యదర్శుల పదోన్నతులకు వీలుగా డీపీసీ నిర్వహించారు. ఉత్తర్వులు జారీ చేసిన విషయం మా దృష్టికి రాలేదు, పరిశీలిస్తాం. నూతనంగా ఓటు నమోదు చేసుకున్నవారికి ఉచితంగానే ఓటరు కార్డును అందచేస్తాం. నామినేషన్ల రోజున తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తాం. వారికి ఏప్రిల్‌ 6లోగా కార్డు పంపిణీని పూర్తిచేస్తాం. పాతకార్డులను మార్చి కొత్త కార్డు జారీ చేసేందుకు రూ.వంద వసూలు చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మీ-సేవా అధికారులు కోరారు’ అని రజత్‌కుమార్‌ చెప్పారు.

 

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.